ఆంధ్రలో ‘స్మార్ట్ షాపులు’ వస్తున్నాయ్...

స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు మైపాడు రోడ్డులో ప్రవేశపెట్టిన కంటైనర్ షాపుల సముదాయం సక్సెస్ కావడంతో దాన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపజేయనున్నారు.;

Update: 2025-04-29 09:58 GMT
A pilot project of Smart Street venders
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... హైటెక్ కి మారుపేరు. ఆయన నోటి నుంచి ఎప్పుడు వినిపించే పదం టెక్నాలజీ, స్మార్ట్, స్టేక్ హోల్డర్స్, శాచ్యురేషన్ లెవెల్స్.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బాగా వాడుతున్న పదం స్మార్ట్.. ప్రతి పనిలో ఆయన స్మార్ట్ నెస్ నే చూస్తున్నారు. ప్రతి పథకానికి స్మార్ట్ అనే పేరే పెడుతున్నారు. తాజాగా చిన్న వ్యాపారులకు ఊరట కలిగించేలా ‘స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్’ను తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న వ్యాపారులకు మద్దతుగా ఓ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. నగరాలలో తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొట్టబోసుకునే అనేక మంది వీధి వ్యాపారులకు ఈ పథకం ఉద్దేశించింది. ఉన్న రోడ్ల విస్తీర్ణం తక్కువ కావడం, ట్రాఫిక్ గందరగోళం, మురికివాడలు, నగరాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకాలు లేకుండా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 'స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్' అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
నెల్లూరులో ప్రయోగాత్మకంగా అమలు...
ఈ ప్రాజెక్టు తొలుత నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డులో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అక్కడ అర్హులైన వీధి వ్యాపారులకు కంటైనర్ షాప్‌లు ఏర్పాటు చేసి కేటాయించారు. ఇక్కడ ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మిగతా ప్రాంతాలకూ విస్తరింపజేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తవంతెన రోడ్డుపైనా ఈ ప్రాజెక్టును విస్తరింపజేయనున్నారు.
స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ లక్ష్యం
స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రారంభించిన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ భాగంగా అమలవుతోంది. దీనిమూలంగా చిన్న వ్యాపారాలను రోడ్ల పక్కన నుంచి శుభ్రమైన, ఆధునిక వాణిజ్య వేదికలపైకి మార్చే లక్ష్యంతో సాగుతోంది. వీధి వ్యాపారుల గౌరవాన్ని పెంచే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.
ప్రాజెక్ట్ తో ఏమిటి లాభం...
-ట్రాఫిక్ సమస్యలను తగ్గించటం
-రహదారులను పాదచారులకు అనుకూలంగా మార్చడం
-వీధి వ్యాపారులకు శాశ్వత వ్యాపార స్థలాలు కల్పించడం
-శుభ్రతను పెంచడం
-చిన్న వ్యాపారులకు ఓ శాశ్వత స్థలం చూపించి వారి వ్యాపారాలను మెరుగుపర్చడం
-ఆధునిక సదుపాయాలతో కంటైనర్ షాపులు నిర్మించడం వల్ల వ్యాపారులకు, ఉత్పత్తులకు భద్రత పెరుగుతుంది. ఎండకు ఎండి వానకు తడవాల్సిన అవసరం ఉండదు. పైకప్పు సీల్ చేసి ఉంచుతారు. సౌర విద్యుత్ సదుపాయం, ఉచిత వైఫై ఉంటుంది. ఆధునిక ఫర్నిచర్ సమకూరుతుంది.
తినుబండారాలు అమ్మే వ్యాపారుల కోసం వంటగదులు, నిల్వ గదులు కూడా ఈ కంటైనర్ షాపుల్లో ఉంటాయి. ఇవి కేవలం వ్యాపార స్థలాలుగా మాత్రమే కాకుండా, చిన్న వ్యాపారులకు అన్ని అవసరమైన వసతులతో కూడిన శాశ్వత కార్యాలయాలుగా రూపొందించారు.
ఎవరికి ఈ షాపులు కేటాయిస్తారంటే...
 కనీసం 18 ఏళ్ల వయసు ఉండి స్థానిక మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్ లో తన వివరాలు నమోదు చేయించుకుని ఉండాలి. ఆధార్ కార్డు కావాలి. ప్రస్తుతం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ ఉండాలి. లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీధి వ్యాపారుల కమిటీ సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. బండ్ల మీద అమ్ముకోదగిన వస్తువులతో వ్యాపారాలు చేసుకునే వారు లేదా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ...
షాప్‌లు కేటాయించడమే కాకుండా, ఆహార తయారీ, పరిశుభ్రత, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో శిక్షణనూ అందిస్తారు. దీని వల్ల వీధి వ్యాపారులు తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం పొందుతారు.
ప్రస్తుత దశలో రాష్ట్రవ్యాప్తంగా 200 కంటైనర్ షాపులను నిర్మించి, అవసరాన్ని బట్టి వివిధ నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి కేటాయించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని షాపులు నిర్మించే అవకాశం కూడా ఉంది.
‘స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్’ వీధి వ్యాపారులకు భద్రతతో కూడిన గౌరవనీయ జీవనోపాధిని కల్పించడానికి ఉపయోగపడుతుంది. నగరాభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Tags:    

Similar News