నైపుణ్యం..సృజనాత్మక కలయిక చేనేతలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి నేతన్నలతో అవినాభావ సంబంధం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-08-07 10:28 GMT

నైపుణ్యం..సృజనాత్మకల కలయిక చేనేతలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పొల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేతన్నలతో టీడీపీకి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని, చేనేతలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,500 మంది నేతన్నలకు రూ. 2లక్షల చొప్పున రూ. 27 కోట్లు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న 90,765 చేనేత కార్మికుల కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చామన్నారు. దీంతో పాటుగా ఎన్నడు లేని విధంగా నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలనే నిర్ణయాన్ని తొలిసారిగా తామే అమలు చేశామన్నారు. చేనేత రంగంలో పని చేసే కార్మికులు చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతుండటం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

చేనేత మర మగ్గాల కోసం 50 శాతం సబ్సిడీలతో రూ. 80 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ సారి నేతన కష్టాలను చూసిన తర్వాత 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, దీనిని ఈ నెల నుంచి అమలు చేస్తామన్నారు. ఇలా ఉచిత విద్యుత్‌ అందించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93వేల చేనేత కార్మికుల కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తొలి నాటి నుంచి టీడీపీతో అవినాభావ సంబంధం కలిగిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఎంత చేసిన, ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘నేతన్న భరోసా’ పథకం కింద నేతన్న కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ. 25వేలు అందిస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు, నేతన్న కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామన్నారు.

ఏపీలోని చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత కార్మిక కుటుంబాలు పడుతున్న కష్టాలు, సమస్యలు తెలుసుకున్నానని, ఆ కష్టాలు, సమస్యల పరిష్కారానికి హామీలు కూడా నాడు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అందువల్ల చేనేతల సమస్యలను పరిష్కారం కోసం తాము అధికారంలో లేక పోయినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పలు కార్యక్రమాలు చేపట్టామని మంత్రి లోకేష్‌ వెల్లడించారు.
Tags:    

Similar News