సాగర్ కుడి కాల్వకు గండి, నాగులేటి వాగు దిగువ గ్రామాలకు ముప్పు
బిక్కుబిక్కుమంటున్న 20 గ్రామాల ప్రజలు, ఎవరైనా గండి పెట్టారా అనే అనుమానం
By : The Federal
Update: 2025-11-21 04:01 GMT
నాగార్జున సాగర్ కుడి కాలువ గట్టుకు కారంచేడు-మాచర్ల మధ్య గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గండి పడింది. దీంతో పరిసరాల ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఈ వాగుకు దిగువన ఉన్న జనం శుక్రవారం ఉదయం నుంచి ఈ గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరుల తిరునాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు ప్రాధమిక సమాచారం. నీటి ప్రవాహం పెరిగి ఊళ్ల మీద పడుతుందేమోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన గండిపడ్డ చోటుకు చేరుకున్నారు. గండిని పూడ్చే పనులు చేపట్టారు. స్థానికులు కూడా పెద్దఎత్తున సహకరిస్తున్నట్టు మీడియాలో వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని స్థానిక అధికారులు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ కుడికాలువకు ఈప్రాంతంలో గండి పడడం ఇదే మొదటి సారి కాదు. ఎగువ ప్రాంతాల్లోని రైతులు నీళ్ల కోసం చిన్న చిన్న గండ్లు పెట్టడం మామూలేనని, అయితే ఈసారి భారీగా గండిపడి నాగులేటి వాగులోకి నీరు ఉధృతంగా వస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.