నవంబర్ 27-29 మధ్య కోస్తా-రాయలసీమలో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనం.. మరింత బలోపేతం కావొచ్చు అని ఏపీ విపత్తు నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2025-11-20 14:59 GMT

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనం.. మరింత బలోపేతం కావొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) గురువారం (నవంబర్ 20, 2025) జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 

  • శనివారం (నవంబర్ 22) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.
  • సోమవారం (నవంబర్ 24) నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారవచ్చు.
  • మరో 48 గంటల్లో (నవంబర్ 26 వరకు) పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది అని పేర్కొంది. 

వర్షాల అంచనా – జిల్లాల వారీగా

  • నవంబర్ 27 (గురువారం) నుంచి 29 (శనివారం) వరకు: ఉత్తర కోస్తా (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు), దక్షిణ కోస్తా (గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి), రాయలసీమ (కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు) జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
  • నవంబర్ 21 (శుక్రవారం): ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

రైతులకు ముఖ్య సూచనలు

  • ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు త్వరగా కోతలు పూర్తి చేసుకోవాలి.
  • పండిన ధాన్యాన్ని వర్షం తగలకుండా సురక్షిత స్థలాల్లో భద్రపరచుకోవాలి.
  • తడిసిన గింజలు చిగురించకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసర సంప్రదించాల్సిన నంబర్లు 

విపత్తు నిర్వహణ సంస్థలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. రైతులు, ప్రజలు ఈ టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని కోరింది. 

  • 112
  • 1070
  • 1800 425 0101

రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News