గెలుపే వారి సంతకం..

రాజకీయాల్లో ఇద్దరికి రాసి, వాసి కలిసొస్తోంది. జిల్లాలోని ఏ నియోజకవర్గాల్లో పోటీ చేసినా, వారికి ఓటర్ల నుంచి ఆదరణ తగ్గడం లేదు. ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందారు.

Update: 2024-06-07 09:27 GMT

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ఆనం రామనారాయణరెడ్డి ఏ నియోజకవర్గంలో పోటీ చేసిన విజయం సాధిస్తూనే ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుకు కూడా అదే ఆదరణ లభిస్తోంది. రాజకీయాల్లో వీరిద్దరి రాశి, వాసిలో సారూప్యం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విజయాల పరంపరలో.. ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవనికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం వారిద్దరూ టిడిపి నుంచే ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలుపొందారు.

ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆనం రామ్ నారాయణరెడ్డి తనదైన శైలిలో సున్నితంగా స్పందించారు.
"నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఓటర్లు నమ్మినారు. అందుకే మళ్ళీ నన్ను ఆదరించారు" అని రామ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. " నిరంకుశంగా వ్యవహరించడం వల్లే వైఎస్. జగన్ కు ఓటర్లు శంకరగిరిమాన్యాలు పట్టించారు. ఇక జగన్ బెంగళూరు వెళ్లి వ్యాపారాలు చూసుకుంటూ, విశ్రాంతి తీసుకోవడం మంచిది" అని ఉచిత సలహా ఇచ్చారు.
మడమతిప్పని ఆనం
నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజా ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఆయన పది ఎన్నికల్లో పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం, వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారో మళ్లీ అదే టిడిపిలోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మంత్రిగా అనేక శాఖలు
తన రాజకీయ జీవితానికి ఊతం ఇచ్చిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ క్యాబినెట్లో పాటు ఆ తరువాత పార్టీలు మారినా రామ నారాయణరెడ్డి ముగ్గురు సీఎంల సహచర్యంలో కూడా మంత్రి పదవులు నిర్వహించారు. టీడీపీ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో కూడా పనిచేశారు. ఆ తర్వాత టిడిపిలోకి వెళ్లిన టికెట్ దక్కే అవకాశం లేక, వైఎస్ఆర్సిపిలో చేరిన ఆనం వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్ అయినప్పటికీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరిన ఆయన ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
టీడీపీతో ప్రస్థానం ప్రారంభం
నెల్లూరు నగరానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ కోవలో మొదట ఆయన 1983లో టీడీపీలో చేరారు. రాపూరు అసెంబ్లీ స్థానం నుంచి మొదట 1985 నుంచి 1989, 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అనేక శాఖ నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పాతర వేశారు. దీంతో 2014 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు మళ్ళీ టిడిపిలో చేరారు. టికెట్ లభించే అవకాశం లేకపోవడం వల్ల వైయస్సార్ సిపిలో చేరి, 2014 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారిలో అనేకమంది సీనియర్లలో ఒకరైన ఆనం రామ నారాయణరెడ్డి భీంగత సీఎం వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైనప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపణపై ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డిని కూడా వైఎస్ఆర్సిపి నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురిపై అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు కూడా వేయడం. ఈ పరిస్థితుల్లో టిడిపిలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి విజయం సాధించారు. అలాగే, వైఎస్ఆర్ సీపీపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా విజయం సాధించారు.
వారి అరాచకాలే.. మాకు సోపానం
" రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్ జగన్" అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లా కామేపల్లిలో జన్మించి, వెళ్లి విశాఖ ప్రాంతంలో విద్య ఉపాధితో స్థిరపడిన ఘంటా శ్రీనివాసరావు తన రాజకీయ కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఒకో ఎన్నికకు ఒకో నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. 1999లో ఎంపీగా గెలవడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన గంటా శ్రీనివాసరావు వరుసగా ఆరుసార్లు పోటీ చేసి, చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నం ఉత్తరం, మళ్లీ టిడిపిలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా నౌకాయాన రంగంలో పేరు గడించిన విశాఖపట్నం జిల్లా ఓటర్లు కూడా గంటా శ్రీనివాసరావును ఆదరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈయన విజయాలు కూడా కొత్త రికార్డును నమోదు చేశాయి. ఈయన కూడా టిడిపి తో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజారాజ్యం లో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన కూడా తిరిగి టిడిపిలోకి వచ్చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఎంపీగా విజయంతో ప్రారంభం
గంటా శ్రీనివాసరావు 1999లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004 కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన, సినీ నటుడు కొణిదెల చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా మారారు. దీంతో 2009 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచే మళ్లీ ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో కొణిదల చిరంజీవి పట్టుబట్టి మరి గంటా శ్రీనివాసరావుకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అవకాశం కల్పించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు మళ్ళీ ఆయన నియోజకవర్గ మారిపోయింది విశాఖపట్నం ఉత్తరం నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు తాజాగా 2024 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీ స్థానం మారిపోయి భీమిలి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా నియోజకవర్గాలు మారినప్పటికీ ఆయనకు విజయాలు వరిస్తూనే ఉండడం రాసి, వాసి కలిసి రావడంగా చెప్పవచ్చు
పెరిగిన మెజారిటీ
2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు 1,18,020 సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 80,794 ఓట్లు మెజారిటీ లభించింది. పదేళ్ల తర్వాత మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసిన ఆయనను 1,76,230 ఓట్లు వేసిన ప్రాంత వాసులు 83,829 మెజారిటీతో ఆశీర్వదించారు.
Tags:    

Similar News