వైసీపీలో కలకలం రేపుతున్న ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్ వ్యాఖ్యలు

మీకు చేతనైతే మాజీ సీఎం జగన్‌ను, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిలను చంపుకోవాలని, కురుబోళ్లను కాదని న్యాయవాది నాగన్న అన్నారు.;

Update: 2025-04-09 09:29 GMT

ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యల మీద మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మెప్పు కోసమే ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ అలా మాట్లాడుతున్నారని, జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని మండిపడ్డారు. తన వ్యక్తిగత స్వార్థం కోసమే సుధాకర్‌ యాదవ్‌ అలా మాట్లాడుతున్నారని, ఖాకీ యూనిఫాంను టీడీపీకి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ సరిగ్గా విధులు నిర్వహించి ఉండి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగేదా? అని ప్రశ్నించారు. టీడీపీకి చుట్టంగా పని చేసేందుకు సుధాకర్‌ యాదవ్‌కు ఖాకీ యూనిఫాం ఇవ్వలేదన్నారు.

ప్రముఖ న్యాయవాది నాగన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు పంపాల్సిన డైలీ సెర్చి రిపోర్టును ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఎలా పంపిస్తారని ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ను నిలదీశారు. హత్యకు గురైన కురుబ లింగమయ్యకు సంబంధించిన రిపోర్టులో అవాస్తవాలు రాశారని మండిపడ్డారు. పోలీసు యూనిఫాంను అవమాన పరచొద్దన్నారు. కురుబ కులస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎస్‌ సుధాకర్‌ యాదవ్‌ మీద మండిపడ్డారు. గొర్లను కాచుకునే కురుబోళ్లను ఎలా చంపుతారని, మీకు చేతనైతే మాజీ సీఎం జగన్‌ను, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలను చంపుకోండి, కురుబోళ్లను కాదని ఎమ్మెల్యే పరిటాల సునీత మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్య కేసులో తప్పుడు సెక్షన్‌లతో ఎప్‌ఐఆర్‌ నమోదు చేశారని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌కు సూచించారు.
అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా.. తాము అధికారంలోకి వస్తే టీడీపీ కార్యక్తల్లా పని చేస్తోన్న పోలీసు అధికారులకు బట్టలు ఊడదీసి నిలబెడుతామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వాఖ్యల మీద శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం అరటి తొక్క కాదు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారా? మీరిస్తే పోలీసులు యూనిఫాం వేసుకోలేదు. కష్టపడి చదువుకొని, పరుగు పందెం వంటి పలు ఈవెంట్లలో పాసై, వేలాది మంది పరీక్షలు రాసే పోటీలో నెగ్గి, ఉద్యోగం సంపాదించి వేసుకున్న యూనిఫాం. తాము నిజాయితీ పని చేస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి విధులు నిర్వహిస్తున్నాం. నిజాయితీగానే ఉద్యోగం చేస్తున్నాం. అదే నిజాయితీతో చస్తాం. అంతే కానీ.. అడ్డదారులు తొక్కం. పోలీసుల గురించి జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలంటూ మాజీ సీఎం జగన్‌కు హెచ్చరికలు చేశారు.
అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. చట్టబద్దంగానే ఎన్నికల సమయంలో విధులు నిర్వహించాం. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించాం. అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నికలు వాయిదా పడేలా వైసీపీ వాళ్లు చేశారు. మాజీ సీఎం జగన్‌ శిష్యుల వద్ద తుపాకులు ఉన్నాయి. ఎవరు వస్తారో రావాలని వాళ్లు రెచ్చగొడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భద్రత భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబును ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాలను కోరారు. అయితే వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు? ఈ వివాదం ఏ విధమైన మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News