'కడప టీడీపీ'కి షాక్.. 'రాయచోటి రాయుడు' కన్నుమూత
సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు మంగళవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-06 04:24 GMT
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాయచోటి నుంచి నాలుగుసార్లు, ఎమ్మెల్యే, రాజంపేట నుంచి ఎంపీగా కూడా పనిచేసిన సుగవాసి పాలకొండరాయుడు అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
శ్వాసకొశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సుగవాసి పాలకొండరాయుడు బెంగళూరులో చికిత్స తీసుకుంటూ మరణించాడనే సమాచారం అందింది. ఆయన పార్థీవదేహాన్ని మధ్యాహ్నం తరువాత రాయచోటికి తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లు కుటుంబసభ్యుల ద్వారా తెలిసింది.
బెంగళూరులో మరణించిన సుగవాసి భౌతికకాయం మంగళవారం మధ్యాహ్నం రాయచోటికి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన కుటుంబీకులు చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు మృతికి రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి, కర్నూలు జిల్లా మంత్రి బీసీ జనార్థనరెడ్డితో పాటు వివిధ వర్గాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
పెదరాయుడు..
కడప జిల్లా రాయచోటిలో ఆయన టీడీపీకి 'పెద రాయుడు'గా అండగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీరామారావు, ప్రస్తుతం సీఎం ఎన్. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ స్థానం నుంచి 1978లో మొదటిసారి జనతా పార్టీ నుంచి సుగవాసి పాలకొండరాయుడు రాజకీయ తెరపైకి వచ్చి, ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు (బలిజ) సామాజికవర్గానికి చెందిన ఆయన ఈ ప్రాంతంలోని ఆ వర్గంతో పాటు రాష్ట్రంలో ముస్లిం జనాభాలో ప్రథమస్థానంలో ఉన్న రాయచోటిలో మైనారిటీ వర్గాల్లో మంచి పట్టు ఉంది.
పార్టీల అండ లేకుంటే మనుగడ సాగించడం, ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కష్టం. కానీ, రాయచోటి నుంచి మళ్లీ 1983లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం ద్వారా పాలకొండరాయుడు కొత్త అర్థం చేప్పారు. ఆయనకు ఉన్న జనాదరణను గుర్తించిన ఎన్టీరామారావు టీడీపీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు పాలకొండరాయుడు టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాయచోటి స్థానం నుంచి సుగవాసి పాలకొండరాయుడు 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కాంగ్రెస్ కు సవాల్..
తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అప్పటి సీఎం ఎన్. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాది సమయం ఉంది. అయితే, బాంబు దాడి ఘటనను సానుభూతి ఓట్లుగా మార్చుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పటికే దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి జవజ్జీవాలు పోసే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోఉచిత విద్యుత్ పథకం కీలకంగా మారిన పరిస్థితుల్లో 2004లో ముందస్తు ఉన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పవనాలు బలంగా ఉండడంతో టీడీపీ అధికారం కోల్పోయింది. వైఎస్. రాజశేఖరరెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
2004 ఎన్నికల్లో కూడా రాయచోటి నుంచి వరుసగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా సుగవాసి పాలకొండరాయుడు పట్టు నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.
ఎంపీగా సుగవాసి
రాష్ట్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లిన సుగవాసి పాలకొండరాయుడిని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పార్టీలోకి తీసుకున్నారు.
1984లో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సుగవాసి పాలకొండరాయుడు మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా నిలిచారు. తనతో పాటు బలిజ సామాజికవర్గానికి చెందిన అన్నయ్యగారి సాయిప్రతాప్ పై పోటీ చేసి, విజయం సాధించారు. ఆ పదవీకాలం పూర్తయ్యాక సుగవాసి రాయచోటి అసెంబ్లీ స్థానం రాజకీయాలకు పరిమితం అయ్యారు.
2024 ఎన్నికల నాటికి ఆరోగ్యం క్షీణించడంతో తన కొడుకు సుగవాసం బాలసుబ్రమణ్యంను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని తలంచారు. దీనికి సీఎం ఎన్ చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారు. కూటమి పొత్తుల ధర్మం నేపథ్యంలో టీడీపీ నుంచి సుగవాసి బాలసుబ్రమణ్యంను రాజంపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించారు. గ్రూపుల గొడవల నేపథ్యంలో ఆయన ఇక్కడి ఓటమి చెందారు.
రాయచోటిలో 40 ఏళ్లుగా సుగవాసి పాలకొండరాయుడు టీడీపీకి పెద్దదిక్కుగా నిలిచారని చెప్పవచ్చు. ఆయన తుదిశ్వాస విడిచారనే సమాచారం అందడంతో అన్నివర్గాల్లో విషాదం నెలకొంది.