ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా.. పెమ్మసాని వ్యాఖ్యలకు షర్మిల అనుమానాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం అమలుపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీని రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.

Update: 2024-07-30 09:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం అమలుపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీని రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. అందుకనే కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ పథకాన్ని ప్రమోట్ చేస్తున్నారా? అని నిలదీశారు. లేని పక్షంలో ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ కార్డ్ తీసుకోవాలంటూ టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరారు షర్మిల. ఇదే అనుమానాలను ఆంధ్ర ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రూ.15 లక్షల ఆరోగ్యశ్రీని కాదని రూ.5 లక్షల ఆయుష్మాన్‌ను ఎందుకు తీసుకోవాలో, ఆరోగ్యశ్రీ కన్నా ఆయుష్మాన్ పథకం ఏ విధంగా మెరుగైనదో కూడా కేంద్ర మంత్రి వివరించాలంటూ పెమ్మసానిని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రం ఇచ్చేదేమీ లేదా: షర్మిల

‘‘ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రావు చేసిన వాఖ్యలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని ఆయన కోరారు. అంటే ఇకపై రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? ఆయుష్మాన్ పథకాన్నే అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన కూటమి సర్కార్ చేస్తుందా ? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత YCP ప్రభుత్వం రూ.16 వందల కోట్ల బకాయిలు పెడింగ్‌లో పెడితే.. ఆసుపత్రులు ఆరోగ్య శ్రీను ఆమోదించడం, ఆ కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

ఆరోగ్య శ్రీ ఓ అద్భుతం

‘‘ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇదొక అద్భుతం. దీనిని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎన్నో పేద కుటుంబాలకు ఈ పథకం పునర్జన్మను ఇచ్చింది. ఎంతటి జబ్బు చేసినా పేదల ప్రాణాలకు భరోసా కల్పించిన పథకం ఇదొక్కటే. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్య శ్రీ పథాన్ని స్ఫూర్తిగా తీసుకునే తయారు చేయబడింది. ఇలాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించేది లేదు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న రూ.16 వందల కోట్ల బకాయిలను చెల్లించాలి. పథకానికి ఏ లోటు లేకుండా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని’’ అని కోరారు.

అసలు పెమ్మసాని ఏమన్నారంటే..

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకునేలా చర్యలు చేపడతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ‘‘ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటాం. నేను ప్రాతినిధ్యం వహించిన గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఆయుష్మాన్ కార్డును పొందడానికి మూడు లక్షల మంది అర్హులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు కేవలం 28వేల కార్డులను మాత్రమే పంపిణీ చేశారు. ఒక్క గుంటూరులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ కార్డును అర్హులంతా తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ కార్డుల ద్వారా రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు’’ అని వివరించారు.

అతి త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ కార్డును కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ సందర్బంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సినన్ని డబ్బులు లేవని, ఆరోగ్యశ్రీ వల్ల ఆసుపత్రులకు బిల్లులు కూడా రావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అంటే ఆ రోగులకు చికిత్స అందించడానికి కూడా ఆసుపత్రులు వెనకడుగు వేస్తున్నాయని వివరించారు.

Tags:    

Similar News