ఇక సౌదీలో వుండ‌లేను

అనంతపుర్‌వాసి రోద‌న‌...

Update: 2025-10-02 07:26 GMT

సౌదీ అరేబియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ, అనంతపురం జిల్లా, ఆజాద్ నగర్‌కు చెందిన నిజాం అనే యువకుడి వీడియో వైర‌ల్ అవుతోంది. త‌న‌ను ఇండియాకి రప్పించాలంటూ అత‌ను పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడులను ఆ  వీడియోలో వేడుకున్నాడు. డ్రైవర్ ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, "నన్ను రక్షించండి, ఇండియాకి తీసుకెళ్లండి" అంటూ దీనంగా వేడుకుంటున్న వీడియో చేశాడు.


కుటుంబ పోషణ, ముఖ్యంగా తన కొడుకు కిడ్నీ ఆపరేషన్ కోసం నిజాం దాదాపు రూ.12 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసమే అతను గల్ఫ్ దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, అక్కడ తన యజమాని అన్నం పెట్టడం లేదని, ఇంటి నుంచి బయటకు గెంటేసాడని నిజాం కన్నీటి పర్యంతమవుతున్నారు. తనను ఎలాగైనా రక్షించాలని, స్వదేశానికి తీసుకురావాలని అభ్యర్థిస్తూ ఆ వీడియోలో వేడుకున్నారు. ఈ ఘటన రాయలసీమ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వేలాది మంది పేద కార్మికుల కష్టాలకు అద్దం పడుతోంది.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బాస గణేష్ అనే యువకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబిలో వ్యవసాయ కూలీ (అగ్రికల్చర్ వర్కర్) వీసాతో పని చేస్తున్నాడు. ఏమైందో.. ఎలా జరిగిందో... కానీ, 2025 జూన్ మొదటి వారం నుండి దుబాయిలోని రషీదియా పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నాడు. టెలికం సిమ్ కార్డులు,  బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఒక కేసులో గణేష్ ను దుబాయి పోలీసులు విచారిస్తున్నారు.  గణేష్ కు న్యాయ సహాయం అందించి, దుబాయి జైలు నుంచి విడిపించాలని... అతని తల్లి బాస లక్ష్మి, అక్క సంజన హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. 


జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒళ్లు నొప్పులు తగ్గడానికి వేసుకునే మందులతో పట్టుబడి ఆబుదాబిలోని సుహాన్‌ సెంట్రల్‌ జైలులో మగ్గుతున్నాడు. గ‌త నాలుగేళ్ళుగా విచారణ ఖైదీగా జైలుకు పరిమితమయ్యాడు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్‌ జాతీయ భద్రత కేసులో ఏడేళ్ల కింద అరెస్టు అయ్యాడు. అప్పటినుంచి అబుదాబి జైలులోనే  శిక్ష అనుభవిస్తున్నాడు. 

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్, కామారెడ్డి జిల్లా కరడ్‌పల్లికి చెందిన యువకులు నిషేధిత మందులతో పట్టుబడి జైల్లోనే ఉండిపోయారు.జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి యూఏఈలో అక్రమంగా సరిహద్దు దాటుతూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.

సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన ఇద్దరు అమాయకులను రాయికల్‌ మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ మాయమాటలు చెప్పి హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌ విమానం ఎక్కించాడు. అక్కడి నుంచి మలేసియాకు రోడ్డు మార్గం ద్వారా కొంత దూరం, మరికొంత నడక మార్గం ద్వారా చేర్చారు.మలేసియాలో ఉపాధి కోసం బస్సు ఎక్కుతున్న అభాగ్యులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య రియాద్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

మల్యాలకు చెందిన రాజయ్య అనే మరో వ్యక్తి జైల్లో శిక్ష అనుభవిస్తూ మృతి చెందగా కనీసం మృతదేహం కూడా ఇల్లు చేరలేదు. ఆయన డెత్‌ సర్టిఫికెట్‌ మాత్రమే పంపడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. 

కువైట్ సెంట్రల్ జైళ్లలో 60 శాతం మంది భారతీయులే డ్రగ్స్ కేసులో శిక్షలు అనుభవిస్తున్నారని కువైట్‌లోని భారత ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.  విదేశాల్లో డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న భారతీయుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.  భాష రాని దేశంలో, నిబంధనలు తెలియని నేలపై, సహాయం అందని పరిస్థితుల్లో నరకప్రాయం వారి జీవితం. కేర‌ళ‌ న‌ర్స్ నిమిష విషయంలో కొంత మద్దతు లభించింది. కానీ అలాంటి ఎన్నో జీవితాలు నా అన్ననాథుడే లేకుండా ముగిసిపోతున్నాయి. 

ప్రపంచంలోని 89 దేశాల్లో భారత్‌కు చెందిన 9 వేల 521 మంది అక్కడి జైళ్లలో మగ్గుతున్నట్లు పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది.  అందులో 49 మంది మరణశిక్ష అమలు కానున్న ఆందోళనలో కాలం వెళ్లదీస్తున్నారు.ఇందులో 4,755 మంది కేవలం ఆరు గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో బంధించబడి ఉన్నారు. గల్ఫ్‌ దేశాలతో పాటు మలేషి యా జైళ్లలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నా రు. అంటే కేవలం ఉపాధి కోసం వెళ్లినవారు వీసా నిబంధనలను అతిక్రమించి జైలు పాలైనట్లు వెల్లమవుతుంది.  గల్ఫ్ దేశాల్లో 4 వేల 755 మంది భారతీయులు చిన్నచిన్న నేరాలకు జైళ్లలో మగ్గుతుంటే, 500 మందికి పైగా తెలంగాణ వారే వున్నారని భీమ్‌రెడ్డి, తెలంగాణ ఎన్నారై వ్యవహారాల సలహామండలి ఉపాధ్యక్షుడు.అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,200, దుబాయ్‌లో 2,143, నేపాల్‌లో 1,227, ఖతర్‌లో 752, యూకేలో 278, అమెరికాలో 170, పాకిస్థాన్‌లో 308 మంది భారతీయ పౌరులు విదేశీ కారాగారాల్లో మగ్గుతున్నారు.

గల్ఫ్‌ దేశాల చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో పలువురు భారతీయులు జైళ్ల పాలవుతున్నారు. మన దేశానికి చెందిన కొన్ని రకాల మందులను గల్ఫ్‌ దేశాలు నిషేధించాయి. ఇది కూడా తెలియనివారు అనేక మంది ఉన్నారు.కంపెనీల వీసాలపై వెళ్లి ఆ కంపెనీల్లో పని నచ్చకపోతే కల్లివెల్లి కార్మికులుగా మారి పనిచేయడం చివరకు పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. మరికొందరు విజిట్‌ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడంతో కటకటాల పాలయ్యారు.

31 దేశాలతో శిక్షార్హమైన వ్యక్తుల బదిలీపై మన విదేశాంగ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందు లో గల్ఫ్‌ దేశాల్లోని ఒమాన్‌ మినహా మిగిలిన ఐదు దేశాలున్నాయి. అయినా ఖైదు చేయబడ్డ భారతీయులకు విముక్తి లభించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి వివిధ దేశా ల్లోని జైల్‌లో మగ్గుతున్న భారతీయులను మాతృదేశానికి పంపాల‌ని బాధితుల కుటుంబ‌స‌భ్యులు కోరుతున్నారు.

జైళ్లలో ఉన్న ఖైదీలను టీఎస్‌పీ అగ్రిమెంట్‌ ద్వారా బదిలీ చేయడానికి పలు దేశాలతో భారత్‌ ఒప్పందం చేసుకుంది.  ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో బంగ్లాదేశ్, ఇరాన్, కజకిస్తాన్, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్, యూకే వంటి చాలా దేశాలు ఉన్నాయి.  విదేశాల్లో జైలుపాలు కాకుండా వుండాలంటే....విదేశాలకు వెళ్లే ముందు స్థానిక చట్టాలు, నిబంధనలు, కల్చర్ గురించి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు తమ పౌరులకు సకాలంలో న్యాయ సహాయం అందించే వ్యవస్థను బలోపేతం చేయాలి.విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి.మరణశిక్షకు గురైన వారి కేసుల్లో దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలి.

Similar News