విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవానికి ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను, కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది.
దసరా సందర్భంగా గురువారం రాత్రి జరిగే బన్ని ఉత్సవాల్లో రక్తం చిందకుండా ఆపేందుకు పోలీసులు ఈ ఏడాది కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు హోళగుంద మండలం దేవరగట్టులో కర్రల సమరం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి కూడా దాదాపు రెండు లక్షల మందికి పైగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 10 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు.. 10 చెక్ పోస్టులు, వీడియో కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఇక, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
"బన్ని ఉత్సవాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కొందరు వ్యక్తులు కావాలనే మనస్పర్ధలు, పాత కక్షలతో దాడులకు పాల్పడుతున్నారు. బన్ని ఉత్సవం సంబరంలాగానే ఆచారించాలి. ఉత్సవంలో చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఉత్సవం ముసుగులో గాయాలు చేసుకోవద్దని" కర్నూల్ SP విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు.
8 వందల అడుగుల ఎత్తులో కొలువు దీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని కాగడాలు చేత బూని శివ, పార్వతుల కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవం ముగిశాక ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడంతో తలలు పగుల్తాయి. వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గ్రామస్తులు దీనిని ఓ క్రీడగా భావిస్తున్నా కర్రల సమరం మాత్రం భీకరంగా జరుగుతుంది. ఒక గ్రూపు వారు విగ్రహాలను తీసుకెళ్తుంటే, మరో గ్రూపు వారు ఆపే ప్రయత్నం చేస్తారు. అనంతరం విగ్రహాలను తిరిగి దేవరగట్టు మీద ఉంచడంతో ఉత్సవం పూర్తవుతుంది.
బన్నీ ఉత్సవానికి ముందు వచ్చిన అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి ఉత్సవాలు ముగిసేంత వరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. 7 గ్రామాల ప్రజలు ఈ కట్టబాట్లు పాటిస్తారు.