‘కడపలో షర్మిలకే ఛాన్స్’.. రఘురామకృష్ణ

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రలో ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు జరుగుతన్నాయి. వాటిలో భాగంగానే నిన్న తిరుపతిలోని పద్మావతి మహిళ యూనివర్సిటీలో

Update: 2024-05-16 13:35 GMT

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రలో ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు జరుగుతన్నాయి. వాటిలో భాగంగానే నిన్న తిరుపతిలోని పద్మావతి మహిళ యూనివర్సిటీలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. సుత్తులు, రాడ్లు, కత్తులు తీసుకుని ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో తన ప్రాణాలకు తెగించి గన్‌మ్యాన్.. నానీని కాపాడారు. నానీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పులిపర్తి నానీని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప ఎంపీ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీగా షర్మిల గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ జోస్యం చెప్పారు. అనంతరం నానీపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

దాడి హేయమైన చర్య

‘‘నానీపై దాడి నీచమైన, హేయమైన చర్య. ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికే భద్రత కరువైతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా ‘‘ఈవీఎంలు భద్రంగా పెట్టిన ప్రాంతంలో హంతకులు తిరుగుతున్నారంటే రాష్ట్రం శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏపీ పోలీసు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. వైసీపీకి కొమ్ముకాస్తూ.. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. కొంతమంది పోలీసులు మాత్రమే నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈసీ చేసిన బదిలీలతో కూడా అతి తక్కువ మందిలో మాత్రమే మార్పు వచ్చింది. పోలింగ్ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలను చూస్తుంటే వైసీపీ ఓటమి తథ్యమని అర్థం అవుతోంది. అది తట్టుకోలేకనే ఆ పార్టీ వర్గాలు హింసకు పాల్పడుతున్నాయి’’ అంటూ వైసీపీ టార్గెట్‌గా మండిపడ్డారు ఆయన.

సజ్జల తీరు విడ్డూరం

ఈ ఎన్నికల్లో కూటమి 130 నుంచి 150 స్థానాల్లో గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు. అందుకు 173 అసెంబ్లీ స్థానాలు, 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన చెప్పడమే నిదర్శనమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఐప్యాక్ దగ్గరకు వెళ్లి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో అని సజ్జల అడ్డగడం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలు విన్న తర్వాతనే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పక్కా అని ఐప్యాక్ నిర్దారించింది. ఇప్పటికి కూడా వైసీపీకి 160+ స్థానాలు వస్తాయన్న భ్రమలో జగన్ ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు.

ఎనిమిది మందిపై దాడి జరగొచ్చు

జూన్ 4న ఆంధ్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుందని, ఆలోపు కూటమికి చెందిన ఎనిమిది మంది నేతలపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని రఘురమకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి దాడులు చేయాల్సిన అవసరం లేకపోయినా దాడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూటమి నేతలను హెచ్చరించారు. అదే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా కాస్తంత అప్రమత్తంగానే వ్యవహరించాలని తెలిపారు. ‘‘జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి అందులో వైసీపీ ఓడిపోవడంతో సొంత పార్టీ నేతలే వీధి రౌడీల్లా కొట్టుకోవడం ఖాయం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల దృష్టా అతి త్వరలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని జోస్యం చెప్పారు.

షర్మిలే గెలవొచ్చు

ఉండి నియోజకవర్గంలో కచ్ఛితంగా తానే గెలుస్తానని రఘురామకృష్ణ రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా కడపలో కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో కడప మొత్తంలో వైసీపీ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కడప ఎంపీగా వైఎస్ షర్మిల ఎన్నిక అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈవీఎంలను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే’’ అని తెలిపారు. ‘‘ఉండి నియోజకవర్గంలో నాదే గెలుపు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ దాదాపు 55 వేల మెజార్టీ వస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవు’’ అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఫైర్

ఎన్నికల ఫలితాలపై రఘురామకృష్ణ రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని, కూటమి లాంటి మోసపూరిత పార్టీలను ప్రజలు నమ్మరని, ప్రజలకు కష్టాలను అర్థం చేసుకుని వారికి ఇంటి గడప దగ్గరే సంక్షేమాన్ని అందించిన జగన్‌కే అధికార పీఠాన్ని అందిస్తున్నారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతల బండారం బయటపెడతామని ఘాటుగా బదులిస్తున్నారు.

Tags:    

Similar News