ఆంధ్రలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పిన షర్మిల

పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల.. సూపర్ సిక్స్ హామీలను కూడా షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Update: 2024-06-20 12:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇంకా బతికే ఉంది. మళ్ళీ కోలుకుంటుంది. ప్రజల్లోకి వస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్‌కు రాష్ట్ర విభజన వ్యవహారంపై క్షమించి ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కీలకంగా మారుతుంది.. ఎన్నికల ముందు రాష్ట్రమంతా జోరుగా సాగిన చర్చే ఇది. అందుకు ప్రధాన కారణం ఏపీసీసీ చీఫ్ షర్మిల. షర్మిల చేతికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు రావడంతో కాంగ్రెస్ కోలుకుంటుందన్న వారు కూడా లేకపోలేదు. చాలా మంది సీనియర్ నేతలు వైసీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ గూటికి కూడా చేరి టికెట్లు అందుకున్నారు. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలే అని ఎన్నికల కౌంటింగ్ రోజుల ప్రజల తీర్పు తేటతెల్లం చేసింది.

175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆఖరికి పక్కా గెలుస్తారన్న టాక్ వచ్చిన షర్మిల కూడా కడప పార్లమెంటు స్థానంలో ఓటమి పాలయ్యారు. కానీ ఓట్లను చీల్చడంలో మాత్రం కాంగ్రెస్ అద్భుతం చేసిందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చిందని విశ్లేషకులు చెప్పారు. కూటమి విజయంలో కూటమి పార్టీల కంటే కాంగ్రెస్ కష్టమే ఎక్కువగా ఉందన్న విశ్లేషకులూ ఉన్నారు. అయితే ఎన్నికల్లో చవిచూసిన ఓటమిపై ఆంధ్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల తాజాగా స్పందించారు. తమకు ఎందుకు ఓట్లు పడలేదో వివరించారు. అంతేకాకుండా బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు.

మార్పు కోసమే ఓటు పడింది..

కేవలం రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర స్థాయిలో ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నారని షర్మిల వివరించారు. మార్పు కోసమే ఓటు వేశారని, అందుకే గతంలో ఉన్నంత బలం బీజేపీకి ఈసారి దక్కలేదని చెప్పారు. ‘‘రాహుల్ గాంధీ దెబ్బకి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న పేరే తప్ప బీజేపీ చేతిలో పవర్ లేదు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడే కాక కేంద్ర స్థాయిలో ప్రజలు మార్పు కోరుకున్నారు దానికే ఓటు వేశారు. ఈ ఎన్నికలు ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతో జరిగాయి. అందులో ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉంది’’ అని చెప్పారు.

‘అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలా’

‘‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విషయంలో అంచనాలు తప్పాయి. అనుకున్న స్థాయిలో పార్టీ పర్ఫార్మ్ చేయలేదు. ఓ సర్వేలో కాంగ్రెస్‌కు 7శాతం ఓటింగ్ వచ్చినట్లు వెల్లడైంది. ప్రజలు ఒక నిర్ధిష్టమైన లక్ష్యంతో ఓట్లు వేశారు. అందులో భాగంగా ఎట్టిపరిస్థితుల్లో తమ ఓట్లు చీలకూడదని వారు భావించారు. అందుకే కాంగ్రెస్‌కు అశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ కీలకంగా మారింది. ఇదే మంచి అదునుగా సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరాలి. అది తీసుకొచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’’ అని సూచించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ పదేళ్లు గడుస్తున్నా తమ మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరంపై శ్వేతపత్రం కావాలి

‘‘పోలవరం ప్రాజెక్ట్‌ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇది వైఎస్ఆర్ కల. దానిని పూర్తి చేయాలి. 2014-2019లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. కానీ అది పూర్తి కాలేదు. ఆ తర్వాత 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఎన్‌డీఏ కూటమి రాష్ట్రంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలను ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

‘మా ఓటమికి అదే కారణం’

‘‘ఎన్నికల ముందు సరైన, సరిపడా సమయం లేకపోవడమే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి కారణం. కేవలం 14 రోజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అది ప్రచారానికి ఏ విధంగానూ సరిపోయే సమయం కాదు. అసలు వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుందని కడపలో చాలా మందికి తెలియదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా ఉందని, ప్రజల సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ప్రజలకు తెలియకపోవడం మా ఓటమికి మరో కారణం. ప్రజల్లోకి వెళ్లడానికి పార్టీ దగ్గర సరిపడా సమయం లేదు’’ అని వివరించారు.

Tags:    

Similar News