మంత్రి లోకేష్ వాట్సాప్ బ్లాక్.. కారణం ప్రజలే..

వాట్సాప్ బ్లాక్ కావడంతో ప్రజలకు తన మెయిల్ ఐడీని అందించారు మంత్రి నారా లోకేష్. ప్రజలు తమ సమస్యలను ఇకపై మెయిల్‌లో తెలపవచ్చని వెల్లడించారు.

Update: 2024-07-11 12:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తన మార్క్ పాలన ప్రారంభించేసింది. ఇందులో భాగంగా మంత్రులు సైతం రంగంలోకి దిగి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల కష్టాలను తెలుసుకోవడంలో మంత్రి లోకేష్ మరో అడుగు ముందుకేశారు. తన వాట్సాప్ నెంబర్ అందించి ప్రజల తమ సమస్యలను వాట్సాప్ ద్వారా కూడా తెలపవచ్చని వెల్లడించారు. అయితే తాజాగా ఆయన వాట్సాప్‌ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

వాట్సాప్ బ్లాక్‌కు ప్రజలే కారణం..

అయితే ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు వాట్సాప్ వేదికగా తమ సమస్యలను మంత్రి నారాలోకేష్‌కు చేరవేస్తూ ఉన్నారు. ఇలా రోజూ భారీ సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్న క్రమంలో వాట్సాప్ మాతృసంస్థ మెటా.. లోకేష్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసింది. అధిక సంఖ్యలో మెసేజ్‌‌‌లు వస్తుండటంతో సాంకేతిక సమస్య తలెత్తిందని, అందుకే ఖాతాను బ్లాక్ చేశామని మెటా.. లోకేష్‌కు వివరించింది. ఈ విషయాన్నే నారా లోకేష్.. ప్రజలతో కూడా పంచుకున్నారు. అయితే వాట్సాప్ బ్లాక్ కావడంతో తమ సమస్యలు తెలపడం ఎలా అని ఎవరూ ఆందోళన చెందవద్దని కూడా వెల్లడించారాయన.

‘‘ప్రజలు తమ సమస్యలను నా అధికారిక మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కు పంపండి. వీటిని నేనే స్వయంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడతాను. సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా సరే ఈ మెయిల్ ఐడీ ద్వారా నన్ను సంప్రదించవచ్చు’’ అని ప్రకటించారు. అంతేకాకుండా సహాయం కోసం తన వద్దకు వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ప్రజలకు తనకు మధ్య అధికారం అనే గీతనేది ఏమీ ఉండదని చెప్పుకొచ్చారాయన.

వాట్సాప్‌కు మెసేజ్‌లు ఎందుకు పోటెత్తాయి

ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉండవల్లిలోని నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ ద్వారా 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించారు లోకేష్. దీంతో లోకేష్ దృష్టికి వెళ్తే తమ సమస్య పరిష్కారం అయిపోయినట్లే అని ప్రజలంతా బలంగా నమ్మారు. అంతే లోకేష్ నివాసానికి చేరుకోలేని వారంతా కూడా వాట్సాప్‌ ద్వారా తమ సమస్యలను తెలపడం ప్రారంభించారు. అందుకే ఆయన వాట్సాప్‌కు మెసేజ్‌లో పోటెత్తాయి. మెసేజ్‌ల తాకిడీ మరీ అధికంగా ఉండటంతో ఖాతాను మెటా బ్లాక్ చేసింది.

Tags:    

Similar News