పాతబస్తీలో మజ్లిస్ విజయ రహస్యం ఇదే...

హైదరాబాద్ పాతబస్తీలో ఐదు దశాబ్దాలుగా మజ్లిస్ జెండా ఎగురుతోంది. పది సార్లు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులే గెలుస్తూ వచ్చారు.

By :  Admin
Update: 2024-04-03 05:36 GMT

హైదరాబాద్ పాతనగరంతో విస్తరించి ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. 1984వ సంవత్సరం నుంచి 2024వరకు వరుసగా పది సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పతంగ్ విజయకేతనం ఎగురవేసింది.ఐదు దశాబ్దాలుగా మజ్లిస్ వరుస విజయాలకు కారణాలపై విశ్లేషించేందుకు ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి పాత బస్తీలో పర్యటించి అక్కడి ఓటర్ల మనోగతాన్ని తెలుసుకున్నారు. సామాన్య ఓటర్లతో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి...

ఐదు దశాబ్దాలుగా సాలార్ సాబ్ నుంచి అసద్ భాయ్ దాకా ఒవైసీ కుటుంబానికే ఓటేస్తున్నానని చాంద్రాయణగుట్ట నివాసి అయిన బావర్చీ సయ్యద్ గఫార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నాకు 9మంది పిల్లలు...ఏడుగురు కూతుళ్లకు పెళ్లి చేశాను, నా ఇద్దరు కుమారులు బ్యాటరీ షాపుల్లో పనిచేస్తున్నారు, నా భార్య ఇళ్లల్లో పనులు చేస్తుంది...నేను పంక్షన్లలో వంట చేస్తుంటా... మా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు వచ్చి సాయం చేస్తున్న అసద్ భాయ్ అంటే నా కుటుంబానికి ఎంతో ఇష్టం. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. రమజాన్ మాసంలో మా లాంటి పేదలకు ఉచితంగా రేషన్, బట్టలు ఇస్తున్నారు, మాకు పాణం బాగాలేకపోతే ఒవైసీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కూడా చేపిస్తున్నారు, మరి ఇన్ని పనులు చేస్తున్న అసద్ భాయ్ కు ఎన్నికల్లో అండగా ఉంటాను’’ అని సయ్యద్ గఫార్ చెప్పారు. ‘‘వాలిద్ సాబ్ సాలార్ సే లేకర్ అసద్ భాయ్ తక్ హం ఉన్ కో ఓట్ దాల్ రహే’’ అని గఫార్ వివరించారు. ఈ సారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ తాను మజ్లిస్ పార్టీకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒవైసీ కుటుంబానికి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని తేటతెల్లమైంది.
- కేంద్రంలో నీతి, నిజాయితీగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్న నరేంద్రమోదీకి నేను మద్ధతుగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తానని పాతబస్తీలోని లాల్ దర్వాజా ప్రాంతానికి చెందిన సేల్స్ మెన్ కనకర్ల అశోక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను డిగ్రీ చదివినా ఉద్యోగం దక్కక పోవడంతో షోరూంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నానని అశోక్ పేర్కొన్నారు. ‘‘పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో హిందువులు మైనారిటీ...మజ్లిస్ వారితో పెట్టుకొని, వారికి వ్యతిరేకంగా పోతే మా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే చాలామంది హిందూ ఓటర్లు కూడా వారితో గొడవలెందుకని మజ్లిస్ పార్టీకే ఓటేస్తుంటారు, బీజేపీ అభ్యర్థులు నిలబడినా వారు మా హిందువులకు భరోసా ఇవ్వడం లేదు, అందుకే పాతబస్తీ హిందూ ఓటర్లు కూడా మజ్లిస్ పార్టీకి మద్ధతు ఇవ్వాల్సి వస్తుంది’’ అని అశోక్ చెప్పారు. ముస్లింల ప్రాబల్య బస్తీల్లో నివాసముంటున్న హిందువులు మజ్లిస్ పార్టీకి ఓటేయకుంటే ఓట్ల లెక్కింపు తర్వాత తెలుసుకొని మజ్లిస్ కార్యకర్తలు వచ్చి తమ హిందూ కుటుంబాలను వేధిస్తాయని అశోక్ భయాందోళనలు వ్యక్తం చేశారు. పోలీసులున్నా పాతబస్తీలో మజ్లిస్ కార్యకర్తలదే ఆధిపత్యమని, వారు చెప్పిందే వేదమని ఆయన ఆరోపించారు. చార్మినార్ వద్ద ఉన్న జామా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తమ భాగ్యలక్ష్మీ ఆలయంలోనూ గంటలు మోగించి హారతి ఇస్తామని అశోక్ చెప్పారు. ఇప్పటికీ హారతి సమయంలో సాయుధ పోలీసుల పహరా మధ్యనే పూజలు చేసుకుంటున్నామంటే పాతబస్తీలో పరిస్థితి ఏమిటో తెలుస్తుందని అశోక్ వివరించారు. అయినా తాను బీజేపీ సానుభూతిపరుడినని, వీలైతే తాను బీజేపీకి ఓటు వేస్తానని స్పష్టం చేశారు.
- మొదటి నుంచి మజ్లిస్ పార్టీకే మా మద్ధతు ఇస్తున్నామని చార్మినార్ ప్రాంతానికి చెందిన చెప్పుల దుకాణం యజమాని మహ్మద్ సోహైల్ చెప్పారు. అసద్ భాయ్ తోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే ఏ ఎన్నిక జరిగిన మజ్లిస్ అభ్యర్థులకే ఓటేస్తుంటామని సోహైల్ పేర్కొన్నారు. పాతబస్తీలో పేదలకు అసద్ భాయ్ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నారని, ఆయన చేస్తున్న సాయంతోనే ఓటర్లు ఎప్పుడూ ఆయన వెన్నంటే నిలుస్తున్నారని, అందుకే గత 50 ఏళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ వరుసగా విజయాలు సాధిస్తుందని ఆయన చెప్పారు.
- తాను హిందువు అయినా తన మద్ధతు మజ్లిస్ పార్టీకేనని పాతబస్తీకి చెందిన చిరుద్యోగి దొంతు ప్రకాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన ఇంజన్ బౌలిలో తాను నివాసం ఉంటున్నానని, అందుకే మజ్లిస్ పార్టీతోనే తన అనుబంధం కొనసాగుతుందని ప్రకాష్ పేర్కొన్నారు. తమ ప్రాంతంలో పర్యటిస్తున్నపుడు అసద్ అన్న తనను అప్యాయంగా పలకరిస్తుంటారని ఆయన గుర్తు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా, పాతబస్తీలో తన మనుగడ కోసం మజ్లిస్ పార్టీతోనే అనుబంధం పెంచుకున్నానని ప్రకాష్ వివరించారు.

పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా అసెంబ్లీ నియోజవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యుల శాతం కూడా ఎక్కువే. 73.34 శాతం మంది అక్షరాస్యులు ఉండటంతో పాటు ఇక్కడి ఓటర్లు చైతన్యవంతులే. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుస విజయాలతో ఆ వర్గానికి చెందిన ఓవైసీ కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తోంది. తెలంగాణలోనే హైదరాబాద్ ఎంపీ స్థానం ప్రత్యేకం.

మజ్లిస్ కంచుకోట...హైదరాబాద్ పార్లమెంట్ స్థానం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ వరుస విజయాలతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1984వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటి సారి అప్పటి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. నాటి నుంచి 1984,1989,1991,1996,1998,1999 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆరుసార్లు సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. అనంతరం 2004వ సంవత్సరంలో మొదటి సారి పార్లమెంటు బరిలో దిగిన అసదుద్దీన్ ఓవైసీ లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం 2009, 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా విజయం సాధించారు.

ముస్లిం ఓటర్లే అధికం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 59శాతం మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. దీంతో వరుసగా 50 ఏళ్ల పాటు ప్రతీ ఎన్నికల్లోనూ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన పతంగ్ ఎగురుతూనే ఉంది. నియోజకవర్గంలో సగానికి పైగా ఉన్న ముస్లిం ఓటర్ల ప్రభావంతో వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పాతబస్తీ వాసి ఓకరు చెప్పారు. నియోజకవర్గంలో 4.2 శాతం మంది ఎస్సీ ఓటర్లు, 1.3శాతం ఎస్టీ ఓటర్లు, 0.1 శాతం క్రైస్తవ ఓటర్లు ఉన్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 11 లక్షల మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. కుర్మగూడ, కార్వాన్, ఇందిరానగర్, ప్రశాంత్ నగర్, వినయ్ నగర్, సంతోష్ నగర్, సింగరేణి కాలనీ, జియాగూడ, బాపునగర్, శివాజీనగర్, లక్ష్మీనగర్, సంజయ్ నగర్, కేశవస్వామినగర్, నరసింహనగర్, సింగరేణి హట్స్, న్యూ సత్యనారాయణ నగర్ కాలనీ, చెలాపురా, తలాబ్ కట్ట, భవానీనగర్, వెంకటేష్ నగర్, కార్వాన్ సాహు, దుర్గానగర్, హీరానగర్, బండ్లగూడ ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు.

ప్రచారంలో ముందున్న ఒవైసీ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మజ్లిస్ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. రమజాన్ పండుగ సందర్భంగా ముస్లిం బస్తీల్లో పేదలను అసదుద్దీన్ ఒవైసీ కలుస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. ఇఫ్తార్ విందుల్లోనూ పాల్గొంటూ తమ మనుగడ కోసం మజ్లిస్ పార్టీని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మజ్లిస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 2వతేదీన పార్లమెంటు ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేలా భారీ సభ నిర్వహించారు.

అటు బీఆర్ఎస్‌...ఇటు  కాంగ్రెస్ తో స్నేహ సంబంధాలు?
తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం,బీఆర్‌ఎస్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గత రెండు నెలలుగా ఆ పార్టీ కూడా మజ్లిస్‌తో అంతర్గతంగా అవగాహనకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులే చెబుతున్నారు. మజ్లిస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీతోనే సంబంధాలు కొనసాగించడం సర్వసాధారణం. సీఎం రేవంత్ రెడ్డి కొత్త అసెంబ్లీలో ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ తో కలిసి మూసీ నది తీర ప్రాంతం అభివృద్ధిపై చర్చించేందుకు లండన్ వెళ్లారు. అనంతరం హైదరాబాద్ నగర అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లోనూ సీఎం రేవంత్ అక్బరుద్దీన్ కు ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మజ్లిస్ తో స్నేహపూర్వక సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రెండు పార్టీలతో అంతర్గత అవగాహనతో హిందూ ఓట్లను చీల్చేలా డమ్మీ అభ్యర్థులను రంగంలో దించాలని నిర్ణయించినట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

మజ్లిస్‌తో రహస్య ఒప్పందం? 
మజ్లిస్ పార్టీతో సీఎం రేవంత్ రెడ్డి స్నేహ హస్తం చాపుతున్నారని కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు చెబుతున్నారు. ఇటీవల ఇఫ్తార్ విందుతోపాటు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సభల్లో రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీ నేతలకు అత్యంత ప్రాధాన్యమివ్వడాన్ని ఆ నేతలు ఉదహరిస్తున్నారు. ఇందులో భాగంగానే డమ్మీ అభ్యర్థిని అసద్ పై పోటీలో దించడానికి రేవంత్ యత్నిస్తున్నారని మజ్లిస్ తో రహస్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మజ్లిస్ అభ్యర్థుల వల్ల ఓటమి పాలైన ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి అసద్ పై బలమైన అభ్యర్థి అయిన టెన్నిస్ స్టార్ సానియామీర్జాను ఎన్నికల బరిలోకి దించాలని అసమ్మతి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ప్రతిపాదించారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కానీ రేవంత్ దాన్ని కాదని, మజ్లిస్ తో లోపాయికారి అవగాహనతో బలహీన అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నారని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

50 ఏళ్ల విజయం వెనుక...
మొత్తం మీద బహుముఖ పోటీతో ఓట్లు చీలి పోయి మజ్లిస్ పార్టీ అత్యధిక ఓట్లతో విజయం సాధిస్తుందని, ఇదే గత 50 ఏళ్లుగా జరుగుతుందని పాతబస్తీకి చెందిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘మజ్లిస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి చేరువ కావడం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి మజ్లిస్ దగ్గరవుతోంది. అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకోవడం, వారి పార్టీ నుంచి బలహీన అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేలా వ్యూహాన్ని రూపొందించడం సర్వసాదారణంగా మారింది. తమతో రహస్య ఒప్పందాల వల్ల డమ్మీ అభ్యర్థులు ప్రధాన పార్టీలు రంగంలో దించుతుండటమే మజ్లిస్ విజయ రహస్యం, ఇదే వ్యూహాన్ని మజ్లిస్ గత 50 ఏళ్లుగా కొనసాగిస్తోంది’’ అని ముజాహిద్ వివరించారు.


Tags:    

Similar News