సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం.. ప్రశ్నించిన మాజీ ఎంపీ

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పును యావత్ దేశం స్వాగతించింది. కానీ కొందరు మాత్రం ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Update: 2024-08-09 13:30 GMT

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పును యావత్ దేశం స్వాగతించింది. కానీ కొందరు మాత్రం ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. అందులోనూ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ వంటి వ్యక్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇలాంటి తీర్పు ఇవ్వడం దారుణమని భావిస్తున్నారు. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజ్యాంగ సవరణ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తామని వెల్లడించారు.

శనివారం విజయవాడలో ఎస్సీ వర్గీకరణ వయతిరేక పోరాట సమితి సమావేశం నిర్వహించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని, దాని ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ వర్గీకరణ వల్ల షెడ్యూల్డ్ కులాల్లో చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన భావించారు. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఎలా తీర్పుస్తుందని ఇటీవల కేంద్ర మాజీ మంత్రి చింతో మోహన్ కూడా వ్యాఖ్యానించారు.

‘న్యాయమూర్తులకేం తెలుసు!’

‘‘సుప్రీంకోర్టు ఉన్న న్యాయమూర్తులు సుసంపన్నులు. వారు పేద వర్గాల గుర్తించి తీర్పు ఇస్తారా? వాళ్లు ఎప్పుడైనా దళిత వాడల్లో తిరిగారా? అక్కడ దళితులు పడే కష్టాలను చూశారా?’’ అని ప్రశ్నించారాయన. ‘‘ఎస్సీ వర్గీకరణపై న్యాయస్థానం అనాలోచిత, తలతిక్క తీర్పు ఇచ్చింది. భారతదేశంలో వెయ్యికిపైగా ఉపకులాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా వర్గీకరణ చేస్తారు. వర్గీకరణ అంశంపై కమిషన్ వేయాలి. అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో క్రిమిలేయర్ ఉందా? సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉంటే.. వారిలో దక్షిణ భారతదేశానికి చెందిన వారు ఐదుగురేనా? మిగిలిన వారంతా ఉత్తర భారతదేశం నుంచే వస్తారా?’’ అని చింతా మోహన్ ప్రశ్నించారు.

అసలు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి!

‘‘ఎస్సీలను ఉపవర్గీకరించి బాగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్‌లలో ప్రత్యేక కోటాను అందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు’’ అని 2004లో ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్సీల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎస్సీ సామాజిక వర్గంలో మరింత వెనకబడిన వారికి ఉపవర్గీకరణ ద్వారా ప్రత్యేక కోటా కేటాయించడం అనుమతించదగిన అంశమేనని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల బెంచ్ తేల్చింది. కానీ ఉపవర్గీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయి రిజర్వేషన్లను ఒక ఉప కులానికి అందివ్వలేదని, దాంతో పాటుగా ఉపవర్గీకరణకు సంబందించి పూర్తి సమాచారంతో తన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వివరించింది.

Tags:    

Similar News