శ్రీశైలం దర్శనం మోదీకి సంతృప్తిని కలిగించింది
కర్నూలు పర్యటనను ప్రధాని మోదీ ఎంతో ఆస్వాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారని, శ్రీశైలం దర్శనంతో మోదీ ఎంతో సంతృప్తి చెందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు నిర్వహించిన కార్యక్రమాలను ప్రధాని మోదీ అభినందించారని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలు విజయవంతమైందని సీఎం చంద్రబాబు తన మనసులోని మాటను వెల్లడించారు. కష్టపడి పని చేసి కలిసి కట్టుగా సమన్వయంతో వ్యవహరించి, అధికారులంతా కలిసి మోదీ పర్యటనను సక్సెస్ చేశారని, మంత్రులు కూడా కష్టపడి పని చేశారని, ఈ సందర్భంగా అధికారులను, మంత్రులను అభినందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ జీఎస్టీ సభ ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సభను ఎంతో ఆస్వాదించారని పేర్కొన్నారు. గత నెల రోజులుగా సూపర్ జీఎస్టీ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలను అన్నింటిని ఒక పుస్తక రూపంలో తీసుకొని రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.