డేంజర్‌లో ఉన్న శ్రీశైలం డ్యామ్‌ను కాపాడండి

ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే చర్యలు చేపట్టాలని మాజీ ఏఐఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ సీఎం చంద్రబాబును కోరారు.;

Update: 2025-05-18 11:19 GMT

శ్రీశైలం డ్యామ్‌ ప్రమాద పరిస్థితుల్లో ఉంది. ఇదే విషయాన్ని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ)వారు సంవత్సరం క్రింద హెచ్చరించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కానీ ఇంత వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు, మరమ్మతులు కూడా చేపట్టలేదని మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ఎలాంటి ఆలస్యం చేయకుండా శ్రీశైలం డ్యామ్‌ మరమ్మత్తులు సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు. తాను ఇదే విషయంపై ఇది వరకు 2025 మార్చి నెలలో రాసిన లేఖను గురించి కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పత్రికలో వస్తున్నవార్తల ప్రకారం, ఎన్‌డీఎస్‌ఏ వారి ప్రకటన ఆధారంగా, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడేందుకు అవసరమైన చర్యలు మీ కూటమి ప్రభుత్వం చేపట్టలేదని తెలుస్తున్నదని, నిర్లక్ష్యం చేయకుండా ఆ చర్యలు చేపట్టాలని కోరారు. ఆ మేరకు ఈఏఎస్‌ శర్మ సీఎం చంద్రబాబుకు మరో బహిరంగ లేఖ రాశారు.

శ్రీశైలం డ్యామ్‌ కింది వైపున, పునాది దగ్గరలో, పెద్ద ఎత్తున ముప్పు ఉందని ఎన్‌డీఎస్‌ఏ వారు కొన్ని ప్రతిపాదనలు చేశారని, వీటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరారు. 2025 వర్షాకాలం ముందే ఈ చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీశైలం డ్యామ్‌ పరిస్థితి కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలియచేసినా, ఇంతవరకు అటువంటి మరమ్మతులు మొదలు పెట్టకపోవడం మీద ఎన్‌డీఎస్‌ఏ ఆందోళనలు వ్యక్తం చేశారనే విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేకాకుండా ఎన్‌డీఎస్‌ఏ వారు కొన్ని దీర్ఘకాలిక చర్యలు, ముఖ్యంగా పునాది క్రింద భౌగోళిక మార్పులు మీద నిపుణుల సహాయంతో అధ్యయనం చేపట్టాలని కూడా సూచించారని దీనిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత సీరియస్‌ అంశం మీద ఇంతవరకు, కూటమి ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు కాని, దీర్ఘకాలిక చర్యలు కాని తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను 2025 మార్చిలో రాసిన లేఖలో సూచించిన విధంగా, శ్రీశైలం ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌లో, 2012 వర్షాకాలంలో, కనివిని ఎరుగని స్థాయిలో వచ్చిన వరదల కారణంగా, డ్యామ్‌ ప్రమాద స్థితిలో రావడం గురించి, మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను. అటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడిన దృష్ట్యా, ఇప్పుడైనా, ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతారని ఆశించాను. కాని, ఈ రోజు వరకు, శ్రీశైలం డ్యామ్‌ విషయంలో, ప్రభుత్వం చేపట్టాల్సిన మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరంగా ఉంది అంటూ అందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విపత్తు సంభవిస్తే, కృష్ణా నది కింది ప్రాంతాలకు, అంటే.. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ కింది వరకు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
అంటే అటువంటి విపత్తు సంభవిస్తే, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో నివసించే ప్రజలే కాకుండా, కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కట్టడాలకు కూడా ముప్పు రాగలదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణంలో మార్పుల కారణంగా, రాష్ట్రంలో అన్ని నదులలో, వర్షాకాలంలో, ప్రమాద స్థాయి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడైనా శ్రీశైలం డ్యామ్‌ మరమ్మతులు చేపట్టాలని ఈఏఎస్‌ శర్మ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం జలవనరుల శాఖ అధికారులను తక్షణమే పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికకు అనుగుణంగా, శ్రీశైలం డ్యామ్‌ మరమ్మతులు చేపట్టాలని, ఆ విధంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులను ఆదేశించాలని ఆ లేఖలో కోరారు.
Tags:    

Similar News