సనాతన ధర్మం మతోన్మాదం కాదు
తన పొలాన్ని దున్నడం లేదని, సహజంగా పెరిగే మొక్కలను పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.;
By : The Federal
Update: 2025-05-22 12:28 GMT
సనాతన ధర్మం మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో సారి వ్యాఖ్యలు చేశారు. సతానతన ధర్మం అనేది ఒక మతోన్మాధం కాదని అన్నారు. మన పూర్వీకులు చెట్లను, నదులను, ప్రకృతిని పూజించే వాళ్లని పేర్కొన్నారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం 2025 వేడుకల కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్శిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జంతుజాలం మన అన్నదమ్ములని, మనం మన రూట్స్ తెలుసుకునే విధంగా ప్రవర్తించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రకృతిపై మనిషి చేసే యుద్ధం ఎలా ఉంటుందో తనకు తెలుసని, ప్రతి చిన్న మార్పు కూడా పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతాయని అన్నారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే మనిషికి అలవాటై పోయిందని, తిరిగి ప్రకృతికి ఇవ్వడం అలవాటు లేకుండా పోయిందన్నారు.
ఈ సందర్భంగా తన సొంత పొలం, అందులో పెంచుతున్న జంతుజాలం గురించి ప్రస్తావించారు. తన ఎనిమిది ఎకరాల పొలంలో దున్నడం మానేసినట్లు చెప్పారు. దానిక బదులుగా సహజంగా పెరిగే మొక్కలను ఆ ఎనిమిది ఎకరాల్లో పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇలా ప్రతి ఒక్కరు మనకై మనం ప్రకృతికి ఏమి చేద్దామనే ఆలోచనలు చేయాలని సూచించారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని అయితే వనజీవి రామయ్య తన జీవితాంతం మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, లక్షలాది మొక్కలను నాటారని వెల్లడించారు. సహజంగా ఏర్పడిన మడ అడవులను కూడా మనుషులు నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
జీవ వైవిద్యాన్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లోని శేషాచలం, నల్లమల అడవులతో పాటు పాపికొండల్లోని అడవులను నాశనం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్శిటీ పార్కును ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరి చాలా బాగుంటుందని, అటవీ మార్గదర్శకాల ప్రకారం నర్సరీలు మొక్కలను పెంచాలని సూచించారు కోనాకార్పస్ మొక్కల అమ్మకాలను ఆపడం గురించి కడియం నర్సరీలు ఆలోచనలు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.