సజ్జ రైతు.. నుజ్జు, నుజ్జు
సిరిధాన్యాలకిచ్చే 'మద్దతు' ఇదేనా? ఫలితం లేని పంట పండించడం రైతులకు సాధ్యమా?;
By : The Federal
Update: 2025-09-17 06:10 GMT
(ఎంవీఎస్ నాగిరెడ్డి)
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదు. ఇప్పటికే ఉద్యానపంటలైన ఉల్లి, టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడా జాబితాలో చిరుధాన్యాలలో ఒకటైన సజ్జ కూడా చేరింది.
వరుస ధరల పతనాలు కొనసాగుతున్న పరిస్థితిలో రాయలసీమ, మరో వెనుక బడిన జిల్లా ప్రకాశంలో సాగుచేసే సజ్జకి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దత్తు ధర కూడా లభించడం లేదు.
ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రంలో సజ్జ సాధారణ సాగు 61,775 వేల ఎకరాలు కాకా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 55,471 ఎకరాల్లో సజ్జ సాగయింది. సజ్జకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దత్తు ధర క్వింటలుకు 2775 రూ.. ఇంత కంటే తక్కువ ధరకు మార్కెట్ లో అమ్మకం జరగ కూడదు..
కానీ ప్రస్తుతం వ్యాపారులు కొంటున్న ధర 1800 నుండి రూ.2000.
మైనర్ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు) సాగు చేసేది నీటి వనరులు లేని వర్షాధార ప్రాంతాలలో.. వర్షాలు సక్రమంగా కురిసి పంట పండి ప్రభుత్వ మద్దత్తు ధరకు అమ్ముకుంటేనే మిగిలేది అతి స్వల్పం..
సజ్జ తరువాత రాష్ట్రంలో చిరు ధాన్యలలో సాగు జరిగేది రాగి.. ఈ సీజన్ లో రాగి మొత్తం సాగు 44,478 ఎకరాలైతే వెనుక బడిన ఏజెన్సీ జిల్లా అల్లూరి సీతరామరాజు జిల్లాలోనే సాగు జరిగినది 36,093 ఎకరాలు..
రాగులు కనీస మద్దత్తు ధర క్వింటాలు 4886 రూ.. మైనర్ మిల్లెట్స్ లో సజ్జకి, రాగికి మాత్రమే కనీస మద్దత్తు ధరలు ఉన్నాయి..
కేంద్రం ప్రకటిస్తున్న ధరలు గిట్టుబాటు ధరలు కాదు.. కనీస మద్దత్తు ధరలు మాత్రమే. స్వామి నాథన్ కమీషన్ నివేదిక ప్రకారం C 2+50% (Comprehensice Cost+50%) సజ్జకి మద్దత్తు ధర ప్రకటించాలంటే కనీసం క్వింటాలు 5000 రూ అవుతుంది.
చిరు ధాన్యాలు వాడటం ఆహారానికి చాలా మంచిది అని డాక్టర్లతో సహా అనేక మంది మాట్లాడు తున్నారు. కానీ పండించే రైతుకు లాభసాటిగా లేక పోతే ఎలా పండిస్తాడనే ప్రశ్నకు జవాబు మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు.
చిరు ధాన్యాలకుమద్దత్తు ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునః సమీక్షించ వలసిన సమయంలో ఆ ప్రకటించిన కనీస మద్దత్తు ధర కూడా రాకుండా అమ్ముకుంటా ఉంటే ప్తభుత్వ యంత్రాంగం చూస్తూ ఉరుకుంటూ ఉంటే రైతు ప్రతినిధులుగా ఆవేదన కలుగుతున్నది.
సజ్జ సాగు..
కర్నూలు 14,258 ఎకరాలు
నంద్యాల 12,066 ఎకరాలు
అనంతపురం 8,389 ఎకరాలు
ప్రకాశం 7,210 ఎకరాలు
తిరుపతి 5,045 ఎకరాలు
నెల్లూరు 2,292 ఎకరాలు
కడప 2,008 ఎకరాలు
నీటి వనరులు లేని ప్రాంతాలలో పెద్దగా రసాయనిక ఎరువులు వాడకుండా పండించే మంచి సూక్ష్మ పోషకాహారాలు ఉన్న చిరు ధాన్యాల పంటలను ప్రోతహించ వలసిన సమయంలో కనీస మద్దత్తు ధరను కూడా రైతుకు అందించలేక పోవడం చాలా బాధాకరం. సెప్టెంబర్ నాటికి అతి తక్కువ సాగు జరిగిన జిల్లాలు శ్రీ సత్య సాయి 42%, అన్నమయ్య 19%, కడప 35%, చిత్తూరు 24%, ప్రకాశం 53%.
సాగు సంక్షోభం, వరుస ధరల పతనాలతో రాయలసీమ రైతులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రకటనలకే పరిమితం గాకుండా.. ప్రభుత్వ యంత్రాంగం చిత్త శుద్ధి తో రైతులను ఆదుకోక పోతే ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయి.
(రచయిత- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ సభ్యుడు)