POLICE SELECTION | కష్టాలు తీరే గమ్యం దిశగా పరుగు..

కానిస్టేబుళ్ల నియామకానికి సోమవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. కర్నూలులో ఆదివారం ట్రయల్ రన్ జరిగింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-12-29 12:46 GMT

నిరుద్యోగం పరుగులు పెట్టిస్తోంది. కష్టాలను ఈదుతున్నారు. జీవనపోరాటంలో విజయం సాధించాలని యువత పోలీస్ ఉద్యోగం కోసం పోటీ పడుతోంది. పరుగు పందెంలోనే కాదు. దేహదారుఢ్య పరీక్షలకు సంసిద్ధమైంది.

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఎస్పీ బిందుమాధవ్ కర్నూలులో అభ్యర్థులను మానసికంగా సిద్ధం చేయడానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.

కదిలిన అధికారులు
రాష్ట్రంలో నిలిచిపోయిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభానికి మార్గం ఏర్పడింది.
వైసిపి ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన ఈ వ్యవహారం TDP కూటమి ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు అవకాశం కలిసి వచ్చింది. ఆ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, (apsl PRB) తీసుకున్న నిర్ణయంతో పోలీస్ అర్హత పరీక్షలు పాసైన అభ్యర్థులకు సోమవారం అంటే (డిసెంబర్ 30వ) దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
2022 లో వైసిపి అధికారంలో ఉండగా 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఏడాది జనవరి 22వ తేదీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది నిరుద్యోగ యువత హాజరైన విషయం తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో నిరుద్యోగులు హాజరు కావడం ద్వారా నిరుద్యోగం తీవ్రతను గుర్తు చేసినట్లే కనిపించింది. ఆ ఫలితాలను అదే సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించారు. వారిలో 95,208 వేల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. వారందరికీ వెంటనే దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే గత ఏడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు నిరూపిస్తా అంటూ మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. ఆ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి జరిగిన జాప్యం వల్ల చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉండగా..

పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు హోంగార్డులకు పదవి శాతం, ఏపీఎస్పీ హోంగార్లకు 25 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఇది వివాదంగా మారి కోర్టు వరకు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది.
కూటమి ప్రభుత్వంలో మోక్షం..
టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత అయినా సరే, అర్ధాంతరంగా ఆగిపోయిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత న్యాయపుల్ల సహకారంతో చిక్కులను తప్పించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 6, 100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం ఏర్పాటు చేసింది
ఆ మేరకు ప్రిలిమినరీ పరీక్షలో పాసైన అభ్యర్థులకు దేహదారుడి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 91, 507 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువు గత నెల 21వ తేదీతో ముగిసింది. కాగా పరీక్షలో అర్హత సాధించినప్పటికీ 3,701 మంది అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం లోకి రావడానికి వెనకంజ వేసినట్లే కనిపిస్తోంది. కారణాలు ఏమిటి అనేది పక్కన ఉంచితే యువత వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది.
ఏర్పాట్ల పరిశీలన
కర్నూలు APSP 2వ బెటాలియన్ లో ఎస్పీ బిందుమాధవ్ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు సోమవారం (డిసెంబర్ 30) నుంచి బెటాలియన్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రారంభమయ్యే పిఎంటి (ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ), పిఇటి (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ) పరీక్షల నేపథ్యంలో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, కొంతమంది యువకులతో నిర్వహించిన ట్రయల్ రన్ (రిహార్సల్)లో అభ్యర్థులు ఉత్సవాంగా పాల్గొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ,

"పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడంలో పారదర్శకంగా వ్యవహరిచండి" అని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించారు. వివిధ విభాగాల కింద పరీక్షలు నిర్వహించడానికి వీలుగా సీనియర్ అధికారుల సారధ్యంలో పోలీస్ కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించారు.
అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన "టైమింగ్ టెక్నాలజీ" ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఐడీ సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జి. హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డీస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసులు, డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News