ఆర్టీసీ అద్దె బస్సుల సిబ్బంది మెరుపు సమ్మె
దాడులకు నిరసనగా బస్సులు ఆపేసిన డ్రైవర్లు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-08 07:22 GMT
ఆర్టీసీలో ఉంచి బస్సు ప్రయాణం సాధారణ ప్రయాణీకులకు కొత్త కష్టాలు తెచ్చింది. రాయలసీమలోని రెండు జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన దాడుల నేపథ్యంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో కడప, కర్నూలు జిల్లాల్లో ఆర్టీసీ అద్దె బస్సులు బుధవారం ఉదయం నుంచి ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"రక్షణ కల్పించకుంటే బస్సులు నడపలేం" అని అద్దె బస్సుల డ్రైవర్లు చేతులెత్తేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు సరిపోని స్థితిలో రెండు జిల్లాల్లోని అనేక డిపోలో వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
"ఆర్టీసీ బస్సులకు డ్రైవర్ల కొరత కూడా ఏర్పడింది. డిపో స్పేర్ బస్సులు నడపడానికి కూడా సిబ్బంది లేక ఆర్టీసీ డిపో మేనేజర్లు అవస్థలు పడుతున్నారు" ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని రాజంపేట ఇన్ చార్జి డిపో మేనేజర్ టీ. మాధవీలత చెప్పారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగాడానికి దారితీసిన పరిస్థితులు ఇవీ..
సంఘటన 1
అన్నమయ్య జిల్లా రాజంపేట డిపో నుంచి బయలుదేరిన అద్దె బస్సు డ్రైవర్ పై రైల్వే కోడూరు దాటిన తర్వాత తిరుపతికి వస్తుండగా మార్గమధ్యంలోని సెట్టిగుంట వద్ద ప్రయాణికులు డ్రైవర్ పై దాడి చేశారు. దీంతో ఆ డిపోతో పాటు మద్దతుగా బద్వేలు, కడపలో కూడా అద్దె బస్సులు ఎక్కడికక్కడి ఆగిపోయాయి.
సంఘటన 2
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి ఆర్టీసీ అద్దె బస్సు కడపకు బయలుదేరింది. కడప జిల్లాకు ముఖద్వారంగా ఉన్న దువ్వూరు వద్ద ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులతో గొడవపడ్డాడు. కొద్ది దూరం ప్రయాణించాక, బస్సు ఆపేసిన డ్రైవర్ ప్రయాణికుడి తో తలపడ్డాడు. ఈ సంఘటనపై దువ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఈ సంఘటనను నిరసిస్తూ కడప జిల్లాలోని రాజంపేట బద్వేలు కడప డిపోల నుంచి నడుపుతున్న అదే బస్సులను ఎక్కడికక్కడ ఆపేశారు. దీంతో రెండు జిల్లాల్లోని సుమారు 7 డిపోల పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు ఆగిపోయిన కారణంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నుంచి తిరుపతికి రెండు అద్దె బస్సుకు బయలుదేరాయి. వాటిలో ఒక బస్సు శెట్టిగుంట వద్ద ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ప్రయాణికులు అదే సమయంలో మరో బస్సు వచ్చింది. ఈ బస్సు నడుపుతున్న రాజంపేట ప్రాంతానికి చెందిన డ్రైవర్ ఎస్ఎం బాషా ప్రయాణికులు చేయి ఎత్తగానే ఆపారు.
"ముందు వెళ్లిన బస్సు ఎందుకు ఆపకుండా వెళ్ళిపోయాడు అంటూ భాషాతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగి, దాడి చేశారు"
"ఈ విషయం బస్సు డ్రైవర్ ఎస్ఎం. బాషా, కండక్టర్ భాష తన దృష్టికి తీసుకురాలేదు" అని రాజంపేట ఇన్చార్జి డిపో మేనేజర్ టి. మాధవీలత ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి బుధవారం చెప్పారు.
"అద్దె బస్సు ఓనర్ వీడియో షేర్ చేసే వరకు సిబ్బంది తను, డిపో సెక్యూరిటీ దృష్టికి కూడా తీసుకురాలేదని ఆమె వివరించారు. ఈ ఘటనపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో డ్రైవర్ బాషా మౌఖికంగా ఫిర్యాదు చేశారని ఆమె చెప్పారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే మేము మద్దతుగా ఉంటామని చెప్పినా పట్టించుకోలేదు" అని రాజంపేట ఇన్చార్జి డిపో మేనేజర్ మాధవి లత వివరించారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం తన దృష్టికి వచ్చిందని ఆమె వివరించారు.
"మా డిపోలో 36 అద్దె బస్సులు ఉన్నాయి. ఒక బస్సు మాత్రం బుధవారం ఉదయమే నెల్లూరుకు బయలుదేరి వెళ్ళింది. మిగతా సర్వీసులు ఆగిపోయాయి. 38 ఆర్టీసీ బస్సులు మాత్రం నడుపుతున్నాం. విశ్రాంతిలో ఉన్న డ్రైవర్లను కూడా డ్యూటీకి పిలిపించాం" అని రాజంపేట డిపో ఇన్చార్జి మేనేజర్ మాధవీలత చెప్పారు.
ఈ సంఘటనను నిరసిస్తూ ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లు మెరుప సమ్మెకు దిగారు. తమకు రక్షణ కల్పించకుంటే పనిచేయలేమంటూ మొండికేశారు. ఈ సంఘటన నిరసిస్తూ కడప జిల్లాలోని బద్వేలు, కడప డిపోలలో కూడా అద్దె బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లాలో గ్రామీణ, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు ఆగిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలులో అదే పరిస్థితి..
కర్నూలు జిల్లాలో కూడా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేశారు. ఈ జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి కడపకు వస్తున్న అద్దె బస్సు డ్రైవర్ పై కడప జిల్లా దువ్వూరు వద్ద దాడి చేసిన సంఘటనపై నిరసనకు దిగారు. కర్నూలు వన్ టు డిపోలు, ఆళ్లగడ్డ, నంద్యాల తో పాటు నందికొట్కూరు, ఇంకా కొన్ని డిపోలో కూడా బస్సులు ఆగిపోయాయి.
దువ్వూరు వద్ద తండ్రి కోసం ఆరాటం
ఆళ్లగడ్డ నుంచి బయలుదేరిన బస్సు దువ్వూరు వద్ద ఆగింది. ఓ ప్రయాణికుడు అంధుడైన తన తండ్రితో వచ్చాడు. బస్సులోకి ఎక్కుతుండగా డ్రైవర్ ముందుకు నడపడంతో ఆ ప్రయాణికుడు కేకలు వేశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనీ దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ చెప్పారు.
"ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక బస్సు నిలిపివేసిన డ్రైవర్ కిందికి దిగి, తనతో వాగ్వివాదానికి దిగిన ప్రయాణికుడితో తలపడ్డాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారని ప్రయాణికులపై డ్రైవర్ ఫిర్యాదు చేశాడు" అని ఎస్ఐ వినోద్ కుమార్ వివరించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆళ్లగడ్డ తో పాటు కర్నూలులో కూడా ఆర్టీసీలో అద్దె ప్రాతిపదన నడుపుతున్న బస్సులను నిలిపివేశారు.
ఈ విషయంపై కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి మాట్లాడుతూ, దువ్వూరు ఘటనను నిరసిస్తూ అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారనీ చెప్పారు.
"కర్నూలు-1 డిపోలో 9 అద్దె బస్సు సర్వీసులు ఆగిపోయాయి. 86 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం" అని కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి వివరించారు.
మొత్తం మీద స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. బస్సుల సంఖ్య పెంచే వరకు ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే వాతావరణం కనిపించడం లేదు. అంతేకాకుండా ఆర్టీసీలో రెగ్యులర్ బస్సులతో పాటు అద్దె బస్సుల సంఖ్య సమానంగా ఉంది. కర్నూలు జిల్లాలోని మొత్తం బస్సుల్లో 40 శాతం అద్దె బస్సులే ఆధారం అని ఓ కంట్రోలర్ చెప్పారు.