నకిలీ మద్యం రాకెట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసు కూటమి వర్గాలలో కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తెరపైకి వచ్చిన నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలనాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ప్రాంతంలో నాలుగు నెలల నుంచి నకిలీ మద్యం డెన్ నడుస్తున్నట్లు, దీని ద్వారా వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లలో అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణ తేలించింది. ఈ కేసులో టీడీపీ నేత అద్దేపల్లి జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్‌మోహన్ రావు ప్రధాన పాత్ర పోషించారని ఎక్సైజ్ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.
నకిలీ మద్యం తయారీ, అమ్మకాల ద్వారా అధిక లాభాలు సంపాదించడం కోసమే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు ప్రధాన నిందితుడు జగన్‌మోహన్ రావు ఒప్పుకున్నాడు. మూడు నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి, మొలకల చెరువులో తయారైన కల్తీ మద్యాన్ని అక్కడికి తీసుకొనివచ్చి బాట్లింగ్ చేసి సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని జగన్‌మోహన్ రావు పర్యవేక్షిస్తూ, నమ్మకమైన కూలీలను నియమించి నడుపుతున్నాడని, తన బార్‌లో కూడా ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నానని అతను అంగీకరించాడు.
హైదరాబాద్‌కు చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుల్స్, మొలకల చెరువులో తయారైన మద్యాన్ని ఇబ్రహీంపట్నంకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, బెంగళూరుకు చెందిన బాలాజీ నకిలీ మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్, లేబుల్స్‌ను సరఫరా చేసి మొత్తం వ్యాపారానికి మద్దతు ఇచ్చాడు. ఈ సీల్స్ అసలు ఒరిజినల్‌లా ఉండేలా తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగించారని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో 14 మంది నిందితులపై ఏపీ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2020 కింద సెక్షన్లు 13(e), 13(1), 34(a) r/w 34(a)(1)(ii), 34(e), 34(f), 34(h) r/w 34(2) & 36(1)(b)&(c), 37, 42, 50, 50(B) కింద కేసు నమోదు చేశారు. మూడు పాపులర్ బ్రాండ్లకు సంబంధించిన నకిలీ మద్యం తయారీలో మరో నలుగురు నిందితులు దొరకాల్సి ఉందని, ప్రధాన నిందితలు జనార్థన్ రావు, కట్టా రాజు (అనుచరుడు)లపై అరెస్టు చేయాల్సి ఉందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. జనార్థన్ రావు వ్యాపార నిమిత్తం సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లి తిరిగి రాలేదని, గోడౌన్‌లో భారీ సెర్చ్‌లో వేలాది ఖాళీ బాటిళ్లు, కల్తీ మద్యం సీజ్ చేశారు. ఈ రాకెట్ మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు విస్తరించి, ప్రభుత్వ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు తక్కువ ధరలతో సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.