మదనపల్లెలో 21రోజుల పాటు ఆర్.ఎస్.ఎస్. వాళ్లు ఏం చేస్తారు?

బిజెపికి వెన్నెముకగా భావించే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతోంది. ఆ సంస్థ దక్షిణాది రాష్ట్రాల 21 రోజుల శిక్షణ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు.

Update: 2024-05-17 12:31 GMT

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు తెలియడానికి ఇంకొన్ని రోజులే గడువుంది. ఇంతలోనే బిజెపికి దిశానిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్.. రాయలసీమపై ఫోకస్ పెట్టింది. భారతీయ ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించే దిశగా పనిచేసే ఆర్ఎస్ఎస్ 21 రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అది మదనపల్లిలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణ శిబిరానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. నాలుగు రోజులపాటు ఆయన ఇదే శిక్షణ శిబిరంలో ఉండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలిసింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మోహన్ భగవత్ రాక నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మదనపల్లె పట్టణంతోపాటు శిక్షణ శిబిరం నిర్వహించే ఓ ప్రైవేటు పాఠశాలను కూడా తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ పాఠశాల కేంద్రంగా నిర్వహించే శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మోహన్ భగవత్ శిక్షణ ఇవ్వనట్లు సమాచారం.

మదనపల్లెకు చారిత్రక నేపథ్యంతో పాటు బిజెపి మూలాలు ఉన్నప్పటికీ, సంఖ్యా పరంగా తక్కువలోనే ఉంటారు. అయితే, బిజెపి నాయకత్వం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందనే విషయం తెలిసిందే. అందులో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామయిన టిడిపి అందించిన సహకారం, మిత్రుత్వంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిజెపి అభ్యర్థులు పోటీకి దిగారు. రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాలో ఒక పార్లమెంటుతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మాజీ సీఎం, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమారరెడ్డి.. బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయన విజయాన్ని ఆకాంక్షిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉండే కలికిరి లాంటి ప్రాంతానికి కూడా ప్రచారానికి రావడం ప్రస్తావనార్హం.

 

బిజెపి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు, అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ స్థానంలో కూడా బిజెపి అనుబంధ సంఘాలు విస్తృతంగా రంగంలోకి దిగాయి. అందులో ప్రధానంగా చాప కింద నీరులా ఆర్ఎస్ఎస్ శ్రేణులు పనిచేశాయనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే దిశగా కమలనాథులు ముందుకు కదులుతున్నారు. ఆ పరంపరలో..

కూటమి సహకారంతో..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన మిత్రుత్వం, సహకారం నూతనంగా ఆంధ్రలో బిజెపి వెళ్ళూనుకునేలా పావులు కదుపుతోంది అనే వాతావరణం కనిపిస్తోంది. అందులో భాగంగా రాయలసీమ స్థాయి ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం నిర్వహించడానికి మదనపల్లెకు సమీపంలో తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇందుకు వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం.

మూడు రాష్ట్రాల నుంచి రాక

గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మదనపల్లిలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరానికి నాంది పలకనుంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి సుమారు 500 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరుకానునట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిందనే సంకేతాలు ఉన్న పరిస్థితుల్లో.. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న మదనపల్లి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News