చర్చి నుంచి వచ్చే లోగా దొంగల బీభత్సం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పెళ్లి సొమ్మును దొంగలు దోచుకున్నారు.;
రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న దానిలో రూపాయి రూపాయి దాచుకుంటూ తమ కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టుకున్న సొమ్మును దొంగలు దోచుకున్నారు. నగదుతో పాటు బంగారాన్ని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుల గుండెలు ముక్కలయ్యాయి. కన్నీటి పర్యంతం అయ్యారు. ఆదివారం అర్థరాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సంజీవ రాయుడు అనే వ్యక్తి బండల వ్యాపారం చేసుకుంటూ బొరుగుల బట్టీ వీధిలో జీవనం సాగిస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా సంపాదించుకున్న రూ. 4.50లక్షల నగదు, నాలుగు తులాల బంగారాన్ని తన కుమార్డె పెళ్లి కోసం బీరువాలో భద్రంగా దాచుకున్నాడు. ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి చర్చికి వెళ్లారు. దీనిని దొంగలు గమనించారు. సంజీవ రాయుడు ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ఇదే అదునుగా ఆ దుర్మార్గులు భావించారు.
అనుకున్నదే తడువుగా ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. బీరువాలో సొమ్ము ఉన్నట్లు గమనించిన దొంగలు బీరువా తాళాలను పగలగొట్టారు. సంజీవ రాయుడు తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న రూ. 4.50లక్షల నగదుతో పాటు నాలుగు తులాల బంగారాన్ని దోచుకొని వెళ్లారు. చర్చి నుంచి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి నిర్ఘాంత పోయారు. పరుగు పరుగున వెళ్లి బీరువాలో చూడగా అందులోని నగదు, బంగారం కనిపించక పోవడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. బాధితుడు సంజీవ రాయుడు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ యుగంధర్, ఎస్‌ఐ జయప్ప తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలింపులకు దిగారు.