బద్ధశతృవులు రేవంత్-మల్లారెడ్డి భేటీ..సరెండర్ అయిపోయారా ?

ఆహ్వానపత్రికను ఇచ్చిన తర్వాత కొంతసేపు రేవంత్ తో మల్లారెడ్డి విడిగా మాట్లాడుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

Update: 2024-10-09 08:42 GMT

బద్ధశతృవులు రేవంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి భేటీ బుధవారం అయ్యారు. ఈనెలాఖరున మనవరాలి వివాహం సందర్భంగా వీవీఐపీలకు మల్లారెడ్డి స్వయంగా ఆహ్వానపత్రికను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డిని తనల్లుడు మర్రి రాజశేఖరరెడ్డితో సహా కలిశారు. వివాహానికి రావాలని కోరారు. ఈమధ్యనే చంద్రబాబునాయుడును కూడా మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆహ్వానపత్రికను ఇచ్చిన తర్వాత కొంతసేపు రేవంత్ తో మల్లారెడ్డి విడిగా మాట్లాడుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఆ కొద్దిసేపటిలో ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారన్నదే ఇపుడు సంచలనంగా మారింది.

వీళ్ళిద్దరి భేటీ ఎందుకింత సంచలనమంటే ఇద్దరు బద్ధశతృవులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు తెలుగుదేశంపార్టీలో ఉన్నప్పటినుండే ఒకరికి మరొకరు దూరంగా మసలుకునేవారు. అలాంటిది ప్రత్యేక తెలంగాణా ఏర్పాటైన తర్వాత మల్లారెడ్డి బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ఆ తర్వాత రేవంత్ కూడా కాంగ్రెస్ లో చేరారు. దాంతో డైరెక్టుగానే ప్రత్యర్ధులుగా మారటంతో ఒకళ్ళపై మరొకళ్ళు రెగ్యులర్ గా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయేవారు. బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండటంతో మల్లారెడ్డి హవా బాగా నడిచింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటమే కాకుండా బద్ధశతృవు రేవంత్ ముఖ్యమంత్రి అవటంతో మల్లారెడ్డికి ఇబ్బందులు మొదలయ్యాయి.

అందరు ఊహించినట్లుగానే ఆక్రమణలను తొలగించేందుకు రేవంత్ ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్ధను ఏర్పాటుచేశారు. జలవనరులను కాపాడటం, ప్రభుత్వ భూములను పరిరక్షిచటం, కబ్జాల్లో ఉంటే తొలగించి రక్షించటం లాంటి బాధ్యతలతో హైడ్రా జోరుమీదుంది. ఇందులో భాగంగానే మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి చెరువులను ఆక్రమించి కాలేజీ భవనాలను నిర్మించారనే ఆరోపణల మీద హైడ్రా సర్వేచేసింది. ఆరోపణలు నిజమే అని నిర్ధారించుకుని మర్రా కాలేజీల్లోని కొన్ని భవనాలను కూల్చేసింది. అలాగే భూకబ్జాలపై మల్లారెడ్డి మీద అప్పటికే ఉన్న ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం కేసులు కూడా నమోదుచేసి దర్యాప్తుచేస్తోంది.

వీటన్నింటి నేపధ్యంలో బీఆర్ఎస్ లో ఉంటే లాభంలేదని భావించిన మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి ఆధారం ఏమిటంటే బెంగుళూరుకు వెళ్ళి కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను మల్లారెడ్డి కలవటమే. ఆ భేటీలో ఏమి మాట్లాడుకున్నారో తెలీదు కాని మల్లారెడ్డి కాంగ్రెస్ లో అయితే చేరలేదు. తాజా డెవలప్మెంట్ల ప్రకారం మల్లారెడ్డి తన వ్యవహారాన్ని చంద్రబాబునాయుడు వైపునుండి నరుక్కొచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా రేవంత్ నుండి మల్లారెడ్డి రక్షణ కోరినట్లు సమాచారం. తన కాలేజీలను, ప్రయోజనాలను కాపాడాలని చంద్రబాబును మల్లారెడ్డి కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరి మల్లారెడ్డి ప్రయోజనాలను రేవంత్ తో చెప్పి చంద్రబాబు కాపాడుతారా ? అన్న సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. ఈ నేపధ్యంలోనే ఆహ్వానపత్రికను అందించే కారణంగా రేవంత్ ను మల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగానే ఇద్దరు భేటీ అయ్యారని సమాచారం. మరి ఈ భేటీలో ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు ? రేవంత్ కు మల్లారెడ్డి సరెండర్ అయిపోయారా ? అనే చర్చ ఒక్కసారిగా పెరిగిపోతోంది. వాస్తవం ఏమిటన్నది ఇద్దరే చెప్పాలి.

Tags:    

Similar News