భజన తగ్గించండి- సీమ సమస్యలపై మహానాడులో గళమెత్తండి
మహానాడులో రాయలసీమ వాస్తవ పరిస్థితులపై మాట్లాడి, వాటిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.;
By : The Federal
Update: 2025-05-25 11:16 GMT
సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవ సందర్భంగా మే 31 2025న సంగమేశ్వర వద్ద నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభకు మద్దతుగా నంద్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల విక్టోరియా రీడింగ్ రూమ్‌లో ఆదివారం నాడు సంఘీభావ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొమ్మా శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతమని, రాష్ట్ర విభజన జరిగిన 11 సంవత్సరాల కాలంలో రాయలసీమ మరింత తీవ్ర వివక్షకు గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం అటుంచి, నిర్మించిన ప్రాజెక్టులు ఒకటొకటి నిర్వీర్యం అవుతన్నా పాలకులు వీటి సంరక్షణపై దృష్టి పెట్టడం లేదని తీవ్రంగా విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ దెబ్బతిన్నా, అలగనూరు రిజర్వాయర్ తెగిపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, గోరుకల్లు రిజర్వాయర్ నేడు రేపో తెగే పరిస్థితులు ఉన్నా, తుంగభద్ర డ్యామ్ గేట్లకు భద్రత లేకున్నా, నిర్మాణంలో ఉన్న తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఇంకా 20 ఏళ్లయిన వెలుగు చూడని పరిస్థితులు ఉన్నా పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల సద్వినియోగానికి కీలకమైన ఈ నిర్మాణాల వాస్తవ పరిస్థితిని రాయలసీమ ప్రజాప్రతినిధులు కడపలో జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ముందు ఉంచాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు. అధినాయకులను ప్రసన్నం చేసుకునే భజన కార్యక్రమాలను కొంతైనా తగ్గించుకొని, రాయలసీమ సమాజహితం కోసం అస్తవ్యస్తంగా ఉన్న రాయలసీమ సాగునీటి రంగ పరిస్థితులు, రాయలసీమ నుండి కార్యాలయాల తరలింపు నిలుపుదల, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు, నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి తక్షణమే తరలించే అంశాన్ని, కడప ఉక్కు, వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోవాలని బొజ్జా హితవు పలికారు. రాయలసీమను మభ్యపరిచే గోదావరి బనకచర్ల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ, గోదావరి నీటిని సాగర్ కు మళ్ళించి శ్రీశైలం పూర్తిగా రాయలసీమ వినియోగించుకునే విధానంపై రాయలసీమ ప్రజా ప్రతినిధులు అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని సమాజం అర్థం చేసుకునే విధంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని నంద్యాల రైతు సంఘం సభ్యులను బొజ్జా దశరథరామిరెడ్డి ఈ సందర్భంగా కోరారు. మే 31 సంగమేశ్వరం వద్ద నిర్వహించే ప్రజా బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతు సంఘం అధ్యక్షులు యూనస్, కార్యదర్శి చింతపల్లి నాగ కుమార్, ఉపాధ్యక్షులు దండె సుధాకర్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చిమ్మానాగన్న, కరీంబాష, జాను జాగో మహబూబ్ బాష, బీసీ నాయకులు జిల్లెల్ల శ్రీరాములు, న్యాయవాది అసదుల్లా, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.