ఎర్రజెండాలు ఏకమవుతాయి
ఐక్య ఉద్యమాల ద్వారా కమ్యూనిస్టులు ఏకమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సీపీఐ నాయకులు ఏపీ రాష్ట్ర మహాసభల్లో పేర్కొన్నారు.;
దేశంలో ఎర్రజెండాలు ఏకమై ఐక్య ఉద్యమాలు నిర్వహించే రోజు త్వరలోనే ఉందని సీపీఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో శనివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీపీఐ 28 వ రాష్ట్ర మహా సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారు ఎక్కువ మంది గుజరాత్ వారే ఉన్నారని, వారు ప్రధాన మంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారని ఆరోపించారు. వారికి ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమన్నారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ లో గుజ్జుల యలమందారెడ్డి సరళాదేవి ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ముందుగా సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ...
నక్సలైట్లను హత్య చేసినంత మాత్రాన వారి సిద్ధాంతాన్ని అంతం చేయలేరని స్పష్టం చేశారు. నంబాల కేశవ్ ను చంపిన రోజే అదానికి 22 వేల ఎకరాలు భూమిని అప్పగించారని చెప్పారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు తన నియంత పాలనకు అడ్డువస్తున్నాయని వాటిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి పదవి గిరిజన మహిళకు ఇచ్చామని ప్రగల్బాలు పలుకుతూ ఆమె సంతకంతో గిరిజన వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని విమర్శించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుభాష్ రెడ్డిని పోటీ పెడితే ఆయన నక్సలైట్ అని మోదీ పేర్కొనటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన న్యాయమూర్తి ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండటమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు. దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తానంటున్న మోదీ అసమానతలు లేని సమాజాన్ని తయారు చేయాలన్నారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా దేశాల మధ్య ఘర్షణలు సృష్టించి ఇరుదేశాలకు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోది దాసోహం అయ్యాడని నారాయణ విమర్శించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదని టారిఫ్ లు పెంచుతామని భారత దేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని మోది సమాధానం చెప్పాలి అన్నారు.
వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు రెండూ ప్రధాన మంత్రి మోదీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పేరుతో మోదీ సంకలో మనిషిగా మారారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడాల్సి పోయి బీజేపీ కేంద్ర నాయలకు మద్దతు పలుకుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.
రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికి 22 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏరోజూ చర్చించలేదని, మిట్టల్ కంపెనీకి రాయితీలు ఇవ్వాలని చర్చించి వచ్చారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏపీ ఎంపీలందరూ మోదీకి ఊడిగం చేస్తున్నారన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దశలవారీగా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారని, ఈ విషయంలో చంద్రబాబును, మోదీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. 32 మంది ఆత్మ త్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కును తిరిగి ప్రైవేట్ వారి చేతుల్లోకి పాలకులు తీసుకుపోవడం ప్రజలు గమనిస్తున్నారని, భారీ స్థాయిలో ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకునేందుకు సీపీఐ ముందుండి పోరాటాలు చేస్తుందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలన్నారు. ప్రతి పేదవాడికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో ఐదు సెంట్ల స్థలాలు ఇచ్చి ఐదు లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి వచ్చిన తరువాత పేద వారికి సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు.
నేను సూటిగా ఒక్క మాట అడుగుతున్నా... ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతులకు రసాయన ఎరువులు ఎక్కడైనా అందుతున్నాయా? ఇంకా పంటలు కొన్ని చోట్ల ప్రారంభం కాలేదు. సాగర్ నీరు ఇంకా పొలాలకు చేరలేదు. అప్పుడే ఎరువులు బ్లాక్ మార్కెట్ కు చేరాయన్నారు. లంచం లేకుండా పని జరగటం లేదు. ఏపీలో ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. నేనూ ఎమ్మెల్యేగా చేశాను. ఇప్పటి పరిస్థితులు ఇంతకు మునుపెన్నడూ చూడలేదన్నారు. ఎమ్మెల్యేలు కొందరు నేరుగా డబ్బులు వసూలు చేస్తుంటే, మరికొందరు వారి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా వసూలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం, శ్రీశైలం శిఖరం వద్ద ఎమ్మెల్యేల అరాచకాలను ఆయన ఉదహరించారు.
జుంపాలు ఎగరేసి కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బొట్టుపెట్టుకుని సనాతన ధర్మం అంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇది లంచగొండుల రాజ్యమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారీ ప్రదర్శన
సీపీఐ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా ఒంగోలు ఎరుపెక్కింది. కామ్రేడ్లు కదం తొక్కారు. భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలను పురస్కరించుకుని శనివారం ఒంగోలు నగరంలో నిర్వహించిన భారీ ప్రదర్శన సీపీఐ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వేలాదిమంది తరలివచ్చిన కార్యకర్తలు కదం తొక్కుతూ, పదం పాడుతూ మహాప్రదర్శనలో పాల్గొన్నారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్ లోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన భారీ ప్రదర్శన కలెక్టరేట్, ట్రంకు రోడ్డు, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, కొత్త కూరగాయల మార్కెట్ మీదుగా సభా ప్రాంగణం వరకు సాగింది.
ఈ ర్యాలీకి రాష్ట్ర నలుమూల నుంచి సీపీఐ, ప్రజా సంఘాలకు చెందిన శ్రేణులు పోటాపోటీగా తరలివచ్చారు. పురుషులు ఎర్రచొక్కాలు, మహిళలు ఎరుపు చీరలు ధరించి ప్రదర్శనలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కొందరు మహిళలు చంటి పిల్లలను ఒక చేత్తో ఎత్తుకొని, మరోచేత్తో ఎర్రజెండా చేబూని ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఉత్తేజపరిచింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీపీఐ జిందాబాద్, ఎర్రజెండా వర్థిల్లాలి అనే నినాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. నగరంలో ఎటు చూసినా ఎర్రజెండాలు, అరుణ పతాకాలు, ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లతో ఎరుపు మయమైంది. కిలోమీటర్ల పొడవునా ముందు భాగాన సాగిన రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు, పార్టీ మహాసభల సంఖ్యను సూచిస్తూ 28 సీపీఐ పార్టీ పతాకాలతో సాగిన రెడ్‌ప్లాగ్ మార్చ్ ప్రజలను ఆకర్షించింది.
సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణతో పాటు సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, ఏఐకేఎస్ ప్రధానకార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి ఈశ్వరయ్య, అక్కినేని వనజ, హరినాథరెడ్డి, రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్, జంగాల అజయ్‌కుమార్, డేగా ప్రభాకర్, జగదీష్, సినీనటుడు మాదాల రవిలు అగ్రభాగాన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళా రూపాలు పలువురిని ఆకర్షించాయి.