భూ కేటాయింపుల్లో భారీ రాయితీలు
‘ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30’ కింద ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ, అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
అమరావతిని ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV) ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30’ కింద ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ, అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా, ఈ పాలసీ కింద ఎంపికైన సంస్థలకు వాటి మూలధన పెట్టుబడిలో 75 శాతానికి మించకుండా ప్రోత్సాహకాలను చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగ కల్పన ఆధారంగా స్థల కేటాయింపులు ఉండనున్నాయి. సంస్థ కల్పించే ప్రతి ఒక్క నియామకానికి 100 చదరపు అడుగుల చొప్పున స్థలాన్ని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) కీలక పాత్ర పోషించనుంది. ఇది ‘హబ్ అండ్ స్పోక్స్’ నమూనాలో స్టార్టప్‌లకు సలహాలు, మార్గదర్శకత్వం ఇవ్వడమే కాకుండా నిధులు సమకూర్చడంలోనూ సహకరిస్తుంది.
భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. నోస్ట్రడామస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు క్వాంటమ్ హార్డ్‌వేర్ సదుపాయాల కల్పన కోసం 5 ఎకరాల ఏపీఐఐసీ (APIIC) భూములను కేటాయించింది. అలాగే, క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ కు 2.5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఈ రెండు సంస్థలకు కూడా మార్కెట్ ధరపై 70 శాతం రాయితీతో భూములను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని హార్డ్‌వేర్ తయారీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించే అవకాశం ఉంది.
కేవలం భూములే కాకుండా, ప్రత్యేక కార్యాలయ స్థలాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు క్యూపీఏఐ (QPAI) ఇండియా కు 2,500 చదరపు అడుగుల స్థలాన్ని, క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌ల నిర్వహణ కోసం ఫార్టీటూ (42) టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కు 2,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. వీటితో పాటు సెంటెల్లా సైంటిఫిక్, క్యూక్లేవోయెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్, సైబ్రానెక్స్ టెక్నాలజీస్ వంటి సంస్థల ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
ప్రభుత్వం అందించే ఈ ప్రోత్సాహకాలకు ప్రతిఫలంగా, సదరు సంస్థలు తమ ఈక్విటీ (వాటా) ను ‘రాష్ట్ర క్వాంటమ్ మిషన్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. సంస్థ విలువ ఆధారంగా ఈ వాటాను నిర్ణయిస్తారు. సైబ్రానెక్స్ వంటి సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం అందించే ‘నేషనల్ క్వాంటమ్ మిషన్’ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఐటీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే ఐదేళ్లలో వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగాల కల్పనతో పాటు, అమరావతిని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.