ఏపీలో రెడ్‌ అలెర్ట్‌–రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు

ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్, మూడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.;

Update: 2025-05-04 13:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ను పిడుగుపాటు వర్షాలు వెంటాడుతున్నాయి. ఈదురు గాలులు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. వచ్చే మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగుపాటుతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందిన ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు.

ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌
వచ్చే రెండు, మూడు గంటలో ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో పాటు ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయట తిరగడం మంచిది కాదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులపాటుతో కూడిన మోస్తరు వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగుపాటు వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకావం ఉందని తెలిపారు.
ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మరి ముఖ్యంగా హోర్డింగ్‌లు, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల కింద కానీ, వాటికి సమీపంలో కానీ నిలబడరాదని హెచ్చరించారు. పిడుగుపాటు వర్షాలు, ఈదురు గాలులుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోని ఆశ్రయం పొందాలని, విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడే సమయాల్లో రైతులు, పశువుల కాపరులు పొలాల్లో ఉండరాదని, అధికారిక సమాచారం కోసం ప్రజలు వేచి చూడాలని కూర్మనాథ్‌ తెలిపారు.
Tags:    

Similar News