104వ ఏట రాజేశ్వరి మూర్తి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా కళాశాలను స్థాపించి, ప్రిన్సిపాల్‌గా సేవలు అందించిన రాజేశ్వరి మూర్తి 104వ ఏట కన్ను మూశారు.;
By : రాఘవ
Update: 2024-12-13 15:45 GMT
స్త్రీ విద్యకోసం పరితపించి, దానికి తన జీవితాన్ని అంకితం చేసిన రాజేశ్వరి మూర్తి న్యూయార్క్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఈనెల 10వ తేదీ మంగళవారం ఆమె 103 ఏళ్ళు పూర్తి చేసుకుని 104వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నెల 4వ తేదీ న్యూయార్క్ లోని తన ఇంట్లో కాలు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన దెబ్బతగిలి, మెదడులో రక్త నాళాలు చిట్లాయి. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉండి చికిత్స పొందుతూ నేటి సాయంత్రం కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా కళాశాలకు రాజేశ్వరి మూర్తి రూపశిల్పి. తిరుపతిలోని ఎస్‌పీడబ్ల్యూకళాశాలను 1952లో స్థాపించగా, 1954 నుంచి 1976 వరకు ఆ కళాశాలకు ప్రిన్సిపాల్ గా రాత్రింబవళ్ళు సేవలందించారు. రాజేశ్వరి మూర్తి కృషి వల్లనే ఈ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా గుర్తింపు పొందింది. రాజేశ్వరి 1921లో కాకినాడలోని ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. పీయూసీ వరకు కాకినాడలోనే చదువుకున్నారు. చెన్నైలోని మెడికల్ కాలేజీలో రసాయాన శాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న కాకినాడకు చెందిన మూర్తితో వివాహమైంది. ఆయన ప్రోత్సాహంతోనే గడిత శాస్త్రంలో బీఎస్‌సీ ఆనర్స్ పూర్తి చేసి, ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. టీటీడీ చైర్మన్ సీ అన్నారావు కోరికమేరకు 1954 లో ఎస్‌పీడబ్లు్య కళాశాల ప్రిన్సిపాల్‌గా చేరి, 22 ఏళ్ళ పాటు సేవలందించారు.
రాజేశ్వరి మూర్తికి పిల్లలు లేరు. భర్త మరణం తరువాత కుంగి పోకుండా మహిళల విద్యకోసమే తన జీవిత నౌకను ఒంటరిగానే సాగించారు. అమెరికాలో గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొంది మూడు అవార్డులు సొంతం చేసుకున్నారు. మహిళల విద్య కోసం కృషి తోనే ఆమె ఒంటరి జీవితాన్ని అధిగమించారు. ఆమె 103వ పుట్టిన రోజు వరకు జీవిస్తారా అన్న సందేహంలోనే ఆమె శిష్యులు మీనా, శిల్ప కొద్ది రోజులు ముందుగా కేక్ కట్ చేయించి చివరి పుట్టిన రోజును జరిపారు. రాజేశ్వరి మూర్తి మరణంతో ఆమె విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.