రాజమండ్రి ప్రిజన్ కెఫే.. అదుర్స్.. ఓసారి తింటే మళ్లీ వదలరంతే!
ఈమధ్య మీరెప్పుడైనా రాజమండ్రి వెళ్లారా? ఆటు వెళ్తే కనుక మీరు కచ్చితంగా సెంట్రల్ జైలు దాకా వెళ్లి దాని ఎదురుగా ఉన్న ఆ కెఫే పై ఓ లుక్ వేయండి.
ఈమధ్య మీరెప్పుడైనా రాజమండ్రి (ప్రస్తుత రాజమహేంద్రవరం) వెళ్లారా? ఆటు వెళ్తే కనుక మీరు కచ్చితంగా సెంట్రల్ జైలు దాకా వెళ్లిరండి. దాని ఎదురుగా ఉన్న ఆ కెఫే పై ఓ లుక్ వేయండి. రాజమండ్రి అనడంతోనే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది సెంట్రల్ జైలు. ఆమధ్య చంద్రబాబు కూడా ఆ జైల్లోనే గడపడంతో ఆ జైలు బాగా ఫేమస్ అయింది. తెలియని వాళ్లకు కూడా తెలిసివచ్చేలా చేసింది. నిజానికి ఆ జైలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిందే. అటువంటి చోట ఇప్పుడో కెఫే (హోటల్) వెలిసింది. సువిశాల ప్రాంగణం, లెక్కకు మిక్కిలి ఆహార పదార్థాలు ఈ కేప్ సొంతం. ప్రైవేటు వ్యక్తులతో పాటు సెంట్రల్ జైలు ఖైదీల సంయుక్త భాగస్వామ్యంతో నడుపుతున్న ఈ హోటల్ ఇప్పుడో ఓ ఊపు ఊపుతుంది. పెద్ద ఆట్రాక్షన్ సెంటర్ గా మారింది. దీంతో అటు జైలుకు ఇటు ఖైదీలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కొత్తగా కట్టిన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సువిశాలమైన ప్రాంగణం ఉంది. గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా కావడంతో ఎప్పుడూ ఆ రోడ్డు రద్దీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ఎలాగైనా వినియోగం లోకి తేవాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా టెండర్లు పిలిచారు. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కొత్త ఫుడ్ అవుట్‌లెట్ ఏర్పాటైంది.