వానదేవుడు ఎక్కడ... వానచినుకులు ఎక్కడ?

ఆంధ్రాలో మొరపెట్టుకుంటున్న ప్రజలు, కుప్పం నియోజకవర్గంలో ఏడు గ్రామాల ప్రజలు వానలో కోసం ఒక రోజు వనవాసం;

Update: 2025-07-15 04:48 GMT
వానకోసం వనవాసం తరలి వెళ్లున్నకుప్పం నియోజకవర్గం ఏడు గ్రామాల ప్రజలు

వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది వానకాలం. వాన జాడ ల్లేవు. వర్షించే మేఘాలు కనుచూపు మేరా కనిపించడం లేదు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు బాగా పడతాయని వాతావరణ అధికారులు చెప్పారు. ప్రజలు నిజమే అని నమ్మారు. అయితే అనుకున్న వర్షాలు రాలేదు. వానదేవుడు మొకం చాటేశాడు.  చినకులు పడకపోవడంతో చాలా మంది రైతులు దుక్కులు దున్నలేని పరిస్థితి ఏర్పడింది. దున్నినా విత్తనాలు వేయలేరు. అన్ని జిల్లాల్లో  మెట్ట ప్రాంత రైతులకు వ్యవసాయం జీవన్మరణ సమస్యగా మారింది. వసాయం రైతుల జీవనాధారం. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యవసాయానికి కీలకం. అయితే 2025 రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షాలను అందించలేదు. ఫలితంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు అలుముకుంటున్నాయి.

కరుణించు వానదేవుడా అని ప్రజలు మొక్కి పూజలు చేసి మొరపెట్టుకుంటున్నారు.

శివుడికి జలాభిషేకం

నంద్యాల జిల్లా  ఎర్ర మఠం గ్రామస్తులు సోమవారం సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శివలింగానికి, లలితాదేవి, గంగాదేవికి 101 బిందెలతో కృష్ణా జలాలు తెచ్చి జలాభిషేకం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతన్నలు సాగుచేసుకున్న మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ ఇతర పంటలు వర్షాలులేక ఎండిపోయే దుస్థితి నెలకొంది. దీంతో వానలు కురవాలని ప్రజలు పూజలు చేస్తున్నారు.

చినుకుల కోసం కప్పలతో ఊరేగింపు

వర్షాలు కురిపించాలని వానదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నంద్యాల జిల్లాకే చెందిన కొలిమిగుండ్లలో సోమవారం గ్రామస్తులు కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. పొడవాటి కర్రకు మధ్యలో కప్పలను ఉంచి కుండలను వేలాడదీశారు. కుండలో పసుపు, కుంకుమ కలిపిన నీళ్లు పోసి డప్పు వాయిద్యాలతో ఊర్లోని పలు వీధుల్లో ఊరేగింపు చేస్తు ఇంటింటి వద్ద ధాన్యం సేకరించారు. సాయంత్రం గంగమ్మకు పూజలు నిర్వహించారు. వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాన దేవుడు కరుణించాలనే ఉద్దేశంతో పాత కాలపు ఆచారాన్ని చేపట్టామన్నారు. ఈవిధంగా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని నమ్మకంతో చేశామని గ్రామస్థులు తెలిపారు.


చిత్తూరు జిల్లాలో వానల కోసం వనవాసం

 శాంతిపురం మండలం కర్లగట్ట సమీపాన ఏడు గ్రామాలు ప్రజలు వానలు కురవాలని సామూహిక వనవాసం చేశారు. ఈ వూర్లలోని ప్రజలంతా తొలి కోడికూయగానే  గ్రామాలు వదిలపెట్టి  దూరంగా వలస దేవర స్థావరానికి చేరుకున్నారు. 



గ్రామంలో ఎవరూ ప్రవేశించకుండా చుట్టుపక్కల ముళ్ల కంపలు కంచె వేసేశారు. ఏడు గ్రామాల ప్రజలు  కలసి సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం చీకటి పడ్డాక మరలా గ్రామాలవైపుకు బయలుదేరారు. వర్షాలు బాగా కురిసి ప్రజలు,  ప్రజలు పశుపక్ష్యాదులు సుఖసంతోషాలతో ఉండాలనే ఒక్క కోరికతో వర్షాలు కరవనపుడు ఈ గ్రామాల ప్రజలు ఒక రోజు వనవాసం ఇలాచేస్తున్నారు.  తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నఈ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అప్పట్లో వర్షాలు లేక కరువు వచ్చిన సమయంల పశు పక్ష్యాదులకు నీరు లేక, పంటలసాగుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులంతా ఒకరోజు వసనాసం వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు.

ఇలాగే అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని వూర్లో కప్పలకు పెళ్లిళ్లు చేసి వానదేవుడిని  ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వర్షపాతం వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 141.58 మి.మీ. కాగా, 2025లో జూన్ 1 నుంచి జూలై 13 వరకు కేవలం 102.44 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సుమారు 27.6 శాతం లోటును సూచిస్తుంది. 26 జిల్లాల్లో 12 జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. వర్షపాతం అత్యధిక లోటు ఉన్న జిల్లాలు...

అన్నమయ్య: -67.14 మి.మీ.

చిత్తూరు: -59.15 మి.మీ.

శ్రీ సత్యసాయి: -55.39 మి.మీ.

వైఎస్సార్ కడప: -55.05 మి.మీ.

తిరుపతి: -44.89 మి.మీ.

నంద్యాల: -22.34 మి.మీ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: -49.4 మి.మీ.

పల్నాడు: -49.8 మి.మీ.

గుంటూరు: -38.19 మి.మీ.

పశ్చిమ గోదావరి: -20.84 మి.మీ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ: -33.39 మి.మీ.

శ్రీకాకుళం: -25.37 మి.మీ.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కూడా వర్షపాతం అంతంతమాత్రంగా ఉంది. ఇది వ్యవసాయ కార్యకలాపాలను మొదలుపెట్టడంలో రైతులకు సవాళ్లను సృష్టించింది. రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలు, ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అత్యంత తీవ్రమైన వర్షపాత లోటును ఎదుర్కొన్నాయి.

వ్యవసాయంపై ప్రభావం

వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైన రాయలసీమలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షపాతం లేకపోవడంతో దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం వంటి పనులు సాగలేదు. ఫలితంగా ఈ సీజన్‌లో విత్తనాలు వేయడం ఆలస్యమై, రైతుల ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వర్షపాతం అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆలస్యం జరిగింది.

రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు వంటి జిల్లాలు చారిత్రాత్మకంగా కరువు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. 2025లో వర్షపాత లోటు ఈ ప్రాంతాల్లోని రైతులను మరింత కుంగదీసింది. భూగర్భ జలాల స్థాయి 41 శాతం ప్రాంతాల్లో 8-20 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇది నీటిపారుదల సౌకర్యాలను దెబ్బతీసింది. ఈ పరిస్థితి రైతులను అప్పులు, వలసలు, తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పరిస్థితి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గతంలో (2024 జూన్‌లో) గణనీయమైన వర్షపాత లోటు (-60 శాతం కంటే ఎక్కువ) నమోదైంది. 2025లో కూడా ఈ జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటం వల్ల వరి, మొక్కజొన్న, కాయగూరల వంటి పంటల సాగు ఆలస్యమైంది. ఈ జిల్లాలో రైతులు చిన్న రైతులు, గిరిజన సముదాయాలు ఎక్కువగా ఉండటం వల్ల, కరువు ప్రభావం వారి జీవనోపాధిపై తీవ్రంగా పడింది.

ఏలూరు జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయికి దగ్గరగా ఉన్నప్పటికీ, తగినంత నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ జిల్లాలో వరి, చెరకు, పత్తి వంటి పంటలు ప్రధానమైనవి. కానీ వర్షపాత లోటు వల్ల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది.

ప్రభుత్వ చర్యలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సమస్యను పరిష్కరించడానికి కొన్ని చర్యలు చేపట్టాయి. జూలై 11, 2025న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తక్షణ ఉపశమనం, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం వ్యూహాలపై చర్చించారు. అయితే రైతులు ఇంకా తగినంత సహాయం అందలేదని వాపోతున్నారు.

ప్రభుత్వ సూచనలు

1. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ: బోరుబావులు, చెక్ డ్యామ్‌లు, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతలను ప్రోత్సహించడం.

2. వర్షపు నీటి సంరక్షణ: వర్షపు నీటిని సంరక్షించడానికి చెరువులు, కుంటల నిర్మాణం.

3. పంటల వైవిధ్యీకరణ: తక్కువ నీటి అవసరమైన పంటలైన జొన్న, సజ్జ, కూరగాయల సాగును ప్రోత్సహించడం.

4. భూగర్భ జలాల రీఛార్జ్: భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి రీఛార్జ్ పిట్‌లు, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్.

5. రైతు సహాయం: పంట నష్టపరిహారం, రుణాల రీషెడ్యూలింగ్, బీమా పథకాలను అమలు చేయడం.

రైతు నేతల సూచనలు

రుతుపవన కాలంలో వర్షపాత లోటు రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ కార్యకలాపాలు ఆలస్యమవడం, భూగర్భ జలాల క్షీణత, ఆర్థిక ఒత్తిడి రైతులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయన్నారు.

రైతులను తక్షణం ఆదుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటి సంరక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, రైతు సహాయ పథకాల ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చునని ఆయన చెప్పారు.

Tags:    

Similar News