సాహిత్యం సమాజాన్ని మార్చే ఆయుధం

రిటైర్డ్‌ డిజిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన పుంజుతోక కాక్‌ టెయిల్‌’ కవితలను సంపుటిని ఆయన తల్లిదండ్రులు చిన్నసత్యనారాయణ రెడ్డి, కృష్ణవేణిలు ఆవిష్కరించారు.;

Update: 2025-09-14 14:07 GMT

సాహిత్యం అనేది సమాజాన్ని మార్చే ఆయుధమని, సామాజిక మార్పు దిశగా ఇకమీదట కలంపోరు చేస్తానని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం ఆయన రచించిన ‘పుంజుతోక కాక్‌ టెయిల్‌’ కవితలను సంపుటిని శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు కొత్తకోట చిన్నసత్యనారాయణ రెడ్డి కృష్ణవేణిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య వ్యవహరించారు. భాషా సాహిత్యాలపై సాధికారత ఉన్నప్పటికీ పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదని, ఇకమీదట సాహిత్య జీవితం సాగిస్తానని, ముఖ్యంగా సాహిత్యంలోకి యువత రావాలని యువత ద్వారానే మార్పు సాధించవచ్చు అని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.


 



ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్‌ జి పుల్లయ్య మాట్లాడుతూ కవిత్వం ఆకట్టుకుంటున్నదని, కవిత్వం ద్వారా కవులు సమాజానికి ఎంతో సేవ చేస్తారని అన్నారు. పుస్తకాన్ని డాక్టర్‌ కర్నాటి చంద్రమౌళి సమీక్షిస్తూ కవిత్వం చదువుతున్న సేపు చైతన్యం కలిగిస్తున్నదని, సామాజిక మార్పు దిశగా ప్రయాణం చేస్తున్నదని అన్నారు. డాక్టర్‌ హరికిషన్‌ మాట్లాడుతూ సాహిత్య లోకంలో పోలీస్‌ అధికారులు చాలా తక్కువగా ఉంటారని.. సమాజం గురించి ఆలోచించే సమయం దొరకడం గొప్ప విషయమని.. దాన్ని అక్షరీకరించడం అరుదైన విషయం అన్నారు.


గౌరవ అతిథిగా హాజరైన సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ కవి జీవిత పర్యంతం విలువలతోనే ప్రయాణం చేశాడని.. జీవితాంతం విలువలను నిలుపుకోవడం తన నిబద్ధతగల జీవితానికి సంకేతం అని అన్నారు. కవిత్వానికి మానవీయరంగులు అద్దారని, కవిత్వ ప్రయాణం అంతా మనిషి కేంద్రంగా సాగుతుందని, మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టి సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కవిత్వం ఎత్తుగడల ప్రధానంగా సాగుతుందని ఇందులోని కవితలన్నీ నవీన సమాజాన్ని కాంక్షిస్తాయని అన్నారు.

ప్రాపంచిక ధృక్పథం సామాజిక స్పృహ చైతన్యంతో కూడిన ఈ కవిత్వం వర్తమాన సాహిత్యాన్ని అన్నారు. కవి ఉద్యోగ జీవితంలోనే కాక సాహిత్య జీవితంలో కూడా అంకితభావంతో కృషి చేస్తున్నారని ఈ కవిత్వం ద్వారా అర్థమవుతుందన్నారు. కవి జీవన రేఖల్ని రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్‌ పి.బి సుబ్బయ్య పరిచయం చేశారు. సభలో ఆయన రాసిన కొన్ని కవితల్ని పద్యాలుగా కళాక్షేత్రం కార్యకర్తలు నంది అవార్డు గ్రహీత మహమ్మద్‌ మియా, బాల వెంకటేశ్వర్లు ఆలపించారు. సభలో పోలీస్‌ శాఖకు చెందిన అధికారులు శ్రీనాథ్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, పార్థసారథి, కవులు చౌశా, కేపీఎస్‌ శర్మ కళాక్షేత్రం కార్యదర్శి యాగంటేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయగా సభ అనంతరం కవిని ఘనంగా సత్కరించారు. 

Tags:    

Similar News