'సీమ'పై జాలి చూపని వర్షం

రాయలసీమ ప్రాంతం వర్షం కోసం అర్రులుజాస్తోంది. ఊరిస్తున్న మబ్బులు కరుణించడం లేదు. అల్పపీడనాలు కూడా ఆదుకోవడం లేదు. రిజర్వాయర్లలో కూడా అంతంతమాత్రంగానే నీరుంది.

Update: 2024-09-04 15:13 GMT

వరుస తుఫానులు కోస్తా ప్రాంతాన్ని వణికిస్తున్నాయి. చినుకు జాడ లేక రాయలసీమ తల్లడిల్లుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు మినహా వర్షం జాడ కనిపించడం లేదు. తుఫానుల ప్రభావం రాయలసీమ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ఈ సీజన్లో వర్షాలు కురవకుంటే మాత్రం రానున్న వేసవి నాటికి సేద్యపునీరు కాదు కదా, మంచినీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది.

మళ్లీ అల్పపీడనం..
పశ్చిమ బంగాళాఖాతం సమీపంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖాధికారి కేవీఎస్. శ్రీనివాస్ ప్రకటించారు. దీని ప్రభావం వల్ల "ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్నిచోట్ల అతి భారీ, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది" అని ఆయన వెల్లడించారు. అందులో ప్రధానంగా..
"రాష్ట్రంలోని ఏలూరు, పలనాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్" ప్రకటించారు. అంతేకాకుండా,
"అల్లూరి అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, యానం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సముద్రతీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ఉంటాయనీ, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళవద్దు" అని కూడా హెచ్చరికలు జారీ చేశారు.

సీమపై ప్రభావం లేదు...
బంగాళాఖాతంలో రెండో అల్పపీడనం సిద్ధంగా ఉంది. మొదటి తుఫాను వల్ల రాయలసీమలో వర్షాపాతం నమోదు కాలేదు. మళ్లీ ఏర్పడే తుపాను వల్ల కూడా వర్షం జాడ ఉండదనే విషయం వాతావరణ శాఖ వెల్లడించిన వివరాలతో స్పష్టం అవుతోంది. దీంతో ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా ఆదుకోవడానికి ప్రభుత్వమే చర్యలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కర్నూలులో అధికం
ఇదిలావుండగా, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలతో పాటు అనంతపురంలో కూడా వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, నాలుగు జల్లులు కురుస్తున్నాయి. మినహా ఆశాజనకమైన వర్షాలు కురవలేదు.
రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు జిల్లాలో సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదు అవుతున్నట్లు జిల్లా అధికారులు విడుదల చేస్తున్న గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలుకు ఎగువప్రాంతంలోని కర్ణాటకలో కురిసే వర్షాల కారణంగా దిగువకు ప్రవహిస్తున్న తుంగభద్ర నదితో పాటు కృష్ణా నదిలో మాత్రం నీరు పారుతోంది. ఇది మినహా సేద్యపు నీటి చెరువులు, కుంటలు నిండే పరిస్థితి కనిపించడం లేదు. తుఫాను ప్రభావం లేకపోవడం వల్ల ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు.
అనంతలో స్వల్పం
అనంతపురంలో విభజిత పుట్టపర్తి జిల్లాలో 32 మండలాలు ఉండగా, నాలుగు మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. ప్రస్తుత సీజన్లో సగటు వర్షపాతం 40.8 1.3 మిల్లీమీటర్లు నమోదు కావాలి. అంటే ప్రతి మండలంలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, రుతుపవనాలు అనుకూలించని స్థితిలో తుఫాను ప్రభావం కూడా లేకపోవడం వల్ల బుధవారం 2.5 నుంచి 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నాలుగు మండలాల్లో మాత్రమే నమోదైనట్టు జిల్లా అధికారులు విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 10.0 మిల్లీమీటర్ల నుంచి 50 మిల్లీమీటర్లు అత్యధికంగా రెండు మండలాల్లో మాత్రమే వర్షపాతం నమోదైంది. బుధవారం సత్యసాయి జిల్లాలో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 0.4 మిల్లీమీటర్ల వర్షం నంబూలిపూలకుంట, కదిరి, లేపాక్షి, కనగానపల్లె, మడకశిర మండలాల్లో మాత్రమే అత్యంత స్వల్ప వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో వాన చినుకు జాడే లేదు.

తిరుపతి జిల్లాలో 34 మండలాల్లో సెప్టెంబర్ నెలకు 124.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాలి. జిల్లాలో మూడో తేదీ 17.5, నాల్గవ తేదీ బుధవారం వరకు 15.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. జూలై నెలలో మాత్రం జిల్లా మొత్తం మీద సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. అందులో 307.5 కు 397.2 మిల్లీమీటర్లు అంటే 29.2 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. 2023 సంవత్సరంలో సాధారణ వర్షపాతం 385మిల్లీమీటర్లు కాగా 379.7 మిల్లీమీటర్లు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి సాధారణ వర్షపాతానికి వరకు 397.5గా నమోదైనట్టు ఆయన వివరించారు.
రిజర్వాయర్లు దయనీయం

రాయలసీమలో సేద్యపు నీరు అందించే రిజర్వాయర్లు దుస్థితిలో ఉన్నాయి. నిర్వహణ గాలికి వదిలేయడం, గేట్లు తుప్పపట్టిపోయినా పట్టించుకునే వారు. లేరు. కడప, కర్నూలు, అనంతపురంలో ఉన్న భారీ రిజర్వాయర్ల పరిస్థితి దేవుడెరుగు. చిన్నవాటిని కూడా పట్టించుకున్న పాపానపోలేదు.
ఇదిగో సాక్ష్యం..


తిరుపతి జిల్లా కేవిబి పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ ను తెలుగుగంగ ఎస్ఈ మదనగోపాల్ తో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు. రిజర్వాయర్ గేట్ మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. రైతులతో మాట్లాడారు. తెలుగుగంగ కెనాల్ నుంచి తిరుపతి పట్టణానికి నీరందించే ఆఫ్ టేక్ పాయింట్, కోకో కోలా కంపెనీ కి నీరు అందించేందుకు చేపడుతున్న ఆఫ్ టేక్ పాయింట్ ను కలెక్టర్ పరిశీలించారు.
సీమలో నిరీక్షణ..

రాయలసీమలో మాత్రం ఈ నెల ఐదో తేదీ ఏర్పడనున్న అల్పపీడనంతో వర్షాలు కురిపిస్తుందా? అని ఈ ప్రాంత ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. అడపాదడపా కురిసిన వర్షాల వల్ల ఈ ప్రాంతంలో రానున్న వేసవిని గుర్తు చేస్తూ, రిజర్వాయర్లలో ఉన్న తక్కువ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సెప్టెంబర్లో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే మాత్రం నీటి ఎద్దడి తప్పదు.
ప్రధానంగా గత నెలలోనే టీటీడీ అధికారులు కూడా "తిరుమలలో నీటిని పొదుపుగా వాడండి" అని సూచనలు కూడా చేయడం గమనార్హం. తిరుపతికి కండలేరు, చంద్రగిరి సమీపంలోని కల్యాణి డ్యాం నుంచి తిరుపతి, తిరుమలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటి నిలువలు కూడా సుమారు 300 రోజులకు సరిపడ ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయినా, ప్రస్తుతం వచ్చిన ఇబ్బందులు లేవంటూ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు.
కోస్తాలో భయం
"రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల ఐదో తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి" అని ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరిక కోస్తా, ప్రధానంగా కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటున్నారు. మళ్లీ ఎలాంటి ముప్పు ఎదురుకానుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా, సీఎం ఎన్. చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

శ్రీశైలం గేట్లు మూసివేత


కర్ణాటకలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల తుంగభద్ర నదిలో వరదనీరు తగ్గుముఖం పట్టడం వల్ల ఆ ప్రభావం శ్రీశైలం జలాశయంపై పడింది. దీంతో డ్యాం క్రస్ట్ గేట్లను నీటిపారుదల శాఖాధికారులు మూసివేశారు. మొదట జూలై 29వ తేదీన గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. వరదనీరు తగ్గిన నేపథ్యంలో ఆగష్టు 12న మూసివేశారు. మళ్లీ 28వ తేదీ గేట్లు ఎత్తిన అధికారులు తాజాగా బుధవారం మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.70 నీటిమట్టం అడుగులు ఉండగా, ఇన్ ఫ్లో1,43.199 క్యూసెక్కులు ఉన్నట్లు వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు.



తిరుపతి జిల్లా కేవిబి పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ ను తెలుగుగంగ ఎస్ఈ మదన గోపాల్ తో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు. రిజర్వాయర్ గేట్ మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. రైతులతో మాట్లాడారు. తెలుగుగంగ కెనాల్ నుంచి తిరుపతి పట్టణానికి నీరందించే ఆఫ్ టేక్ పాయింట్, కోకో కోలా కంపెనీ కి నీరు అందించేందుకు చేపడుతున్న ఆఫ్ టేక్ పాయింట్ ను కలెక్టర్ పరిశీలించారు.
Tags:    

Similar News