బండ రాళ్లకు 'హిల్ గ్యాంగ్' ఆపరేషన్!.. రైల్వే లైన్లలో సరికొత్త ప్రయోగం

తరచూ కేకే, కేఆర్ లైన్లలో విరిగిపడుతున్న కొండ చరియలు. దీంతో రోజుల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం.

By :  Admin
Update: 2024-09-01 14:11 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం) 

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. తూర్పు కోస్తా రైల్వే అధికారుల గుండెల్లో 'రైళ్లు' పరుగెడతాయి. వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ తూర్పు కోస్తా రైల్వే పరిధిలో కొత్తవలస-కిరండోల్ (కేకే), కొరాపుట్-రాయగడ (కేఆర్) లైన్లున్నాయి. ఈ లైన్లు కొండ ప్రాంతాల మీదుగా వెళ్తాయి. వీటిలో కేకే లైన్ 445 కి.మీలు, కేఆర్ లైన్ 165 కి.మీల మేర రైల్వే లైన్లున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కొండ చరియలు విరిగి పడి ఈ రైల్వే లైన్లపై పడుతుంటాయి. రైలు పట్టాలపై బండరాళ్లు పడడం వల్ల రైళ్ల రాకపోకలకు రోజుల తరబడి అంతరాయం ఏర్పడుతోంది. ఈ లైన్లలో పాసింజర్ రైళ్లకంటే సరకు రవాణా చేసే ఆ గూడ్స్ రైళ్ల రాకపోకలే ఎక్కువగా సాగిస్తుంటాయి. దీంతో ఇటు లైన్లు దెబ్బతినడంతో పాటు అటు రవాణా కూడా నిలిచిపోయి రైల్వేకు భారీగా నష్టం వాటిల్లుతోంది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. కొన్నాళ్ల క్రితం కేఆర్ లైన్లో 500 చదరపు మీటర్ల మేర భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా నెల రోజుల పాటు ఆ లైన్లో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

 

ఈ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అధికారులు దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. కొంకణ్ రైల్వే, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎస్ఆర్) రైల్వేల పరిధిలోనూ ఇలా కొండల మధ్య నుంచి రైల్వే లైన్లున్నాయి. ఆ ప్రాంతాల్లోనూ తరచూ కొండ చరియలు విరిగి పడడుతుంటాయి. అక్కడి రైల్వే అధికారులు కొన్నేళ్ల క్రితం కొంతమంది సిబ్బందికి లైన్లపై పడ్డ బండరాళ్లను తొలగించడం, తొలగింపునకు వీలు పడని వాటిని పేల్చడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తదితర అంశాలపై శిక్షణ నిచ్చారు. వీరిని హిల్ గ్యాంగ్ పిలుస్తున్నారు. వీరి సేవలు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజినల్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ కేకే, కేఆర్ లైన్లలోనూ హిల్ గ్యాంగ్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనిపై రైల్వే బోర్డుకు లేఖ రాయడంతో అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో హిల్ గ్యాంగ్ కోసం తొలివిడతలో 20 మందిని ఎంపిక చేశారు. వీరికి అరుణాచల్ ప్రదేశ్లోని రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఈ ఏడాది మే నెలలో శిక్షణకు పంపారు. వీరు అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని కొన్నాళ్ల క్రితం తిరిగి వచ్చారు.

 

విజయవంతంగా మాక్ డ్రిల్..

అరుణాచల్ ప్రదేశ్లో శిక్షణ నుంచి వచ్చిన ఈ హిల్ గ్యాంగ్ టీమ్ రెండ్రోజుల క్రితం కేకే లైన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కొండ చరియలు విరిగి పడినప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారో, ముందస్తు జాగ్రత్తలను ఈ మాక్ డ్రిల్లో చూపించారు. ఇంజినీరింగ్, ట్రాక్షన్, యాక్సిడెంట్ రిలీఫ్ విభాగాలకు చెందిన మరో 30 మంది సిబ్బందిని అక్బోర్లో అరుణాచల్ ప్రదేశ్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ లో దీనిలో శిక్షణకు పంపించనున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారు 20 మంది, త్వరలో శిక్షణకు వెళ్లి వచ్చే వారితో కలిపి ఈ హిల్ గ్యాంగ్లో 50 మంది ఉంటారు. వీరు భవిష్యత్తులో స్థానికంగా మరికొంతమందిని తయారు చేస్తారు. వీరు అరకు, కోరాపుట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు. హిల్ గ్యాంగ్ సభ్యులు అవసరమైనప్పుడు ఈ ఈ ఆపరేషన్ లో పాలు పంచుకుంటారు.

 

డ్రోన్ల సాయంతోనూ..

కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి హిల్ గ్యాంగ్ సభ్యులు డ్రోన్ల సాయాన్ని కూడా తీసుకుంటారు. కేకే లైన్లోని బొడ్డవర-బొర్రాగుహలు ఘాట్ సెక్షన్లో రెండు వైపుల నుంచి బండరాయి అడ్డంకి కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని అధిగమించడానికి అరకులో అందుబాటులో ఉన్న రైలుతో శృంగవరపుకోట స్టేషన్లో కొత్త ట్రాక్ మెటీరియల్ రిలీఫ్ రైలును కూడా ప్రవేశపెట్టారు. ఈ రైలులో ప్రొక్లెయిన్లు, కంప్రెషర్లు, న్యూమాటిక్ బ్రేకర్లు ఉంటాయి. దీంతో ట్రాక్లపై పడే బండరళ్లాను పేల్చడానికి, ట్రాక్ నిర్వహణను సులభతరమవుతుంది. కాగా రైల్వే ట్రాక్పై పడిన బండరాళ్లను పేల్చడానికి అవసరమైన పూర్తి స్థాయి కిట్ త్వరలో రానుంది. మరోవైపు అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యేక కోచ్లో వ్యాగన్ కప్లింగ్, బోగీ మెటీరియల్తో ఉన్న హైడ్రాలిక్ రీరైలింగ్ పరికరాలతో కూడిన కొత్త ఫ్లయింగ్ స్క్వాడ్న కూడా ఇటీవల అరకులో నియమించారు.

ఈ లైన్లలో ఉన్న సొరంగాల రెండు చివర్లలో, సొరంగాల లోపల ఎమర్జెన్సీ క్యూనికేషన్ సాకెట్లు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ చేసే ట్రాక్ మెన్లకు మార్గనిర్దేశం చేసేందుకు టన్నెల్స్ లోని ట్రాలీ, మ్యాన్ రెఫ్యూజ్లకు ఇటీవల రెట్రో రిఫెక్టివ్ ఇండికేటర్ బోర్డులు అందించారు. ‘ఈ హిల్ గ్యాంగ్ ఏర్పాటుతో రైల్వేకు ఎంతో కీలకమైన కేకే లైన్, కేఆర్ లైన్లలో విరిగి పడిన కొండ చరియలను సత్వరమే తొలగించడానికి, త్వరగా రైళ్ల రాకపోకలను పునరుద్దరించడానికి వీలవుతుంది. తద్వారా సరకు రవాణాకు అంతరాయం లేకుండా, రైల్వేకు నష్టాన్ని నివారించడంతో పాటు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేదుకు దోహదపడుతుంది' అని వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ చెప్పారు.

Tags:    

Similar News