రాహుల్ గాంధీ విమర్శలను తిప్పికొట్టాలి
సీఎం చంద్రబాబు మంత్రులందరికీ దిశా నిర్థేశం చేశారు.;
కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలపైన రాహుల్ గాంధీ చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, సకాలంలో వాటిపైన స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులకు దిశా నిర్థేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర, దేశ రాజకీయాలపైన చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దిశా నిర్థేశం చేశారు. ఎన్టీఏ భాగస్వామ్య పక్షాల మీద కూడా ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని గట్టిగా తిప్పి కొట్టాలని మార్గ నిర్థేశం చేశారు. ఎన్డీఏ వర్గాలుగా, కూటమి పార్టీలుగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలన్నారు.
కూటమి వర్గంలోని ఏ పార్టీపైన కానీ, ఏ నాయకుడి మీద కానీ విమర్శలు వస్తే కూటమిలోని పార్టీ వర్గాలందరూ కలిసి ఆ విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జనసేన మంత్రి నాందెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నెల్లూరు కిలేడీ అరుణ వ్యవహారంలో సరైన రీతిలో పోలీసు అధికారులు స్పందించక పోవడం వల్లే కూటమి పార్టీ వర్గాల నేతలు ఇబ్బందులు, నిందలు పడాల్సి వచ్చిందన్నారు. రౌడీషీటర్ శ్రీకాంత్‌కు అరుణ పెరోల్ ఇప్పించిన అంశంలో అధికారులు కూడా స్పందించాల్సి ఉందని, అలా సకాలంలో పోలీసు అధికారులు స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సుగాలి ప్రీతి అంశాన్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. సుగాలి ప్రీతి అంశంలో కూడా పోలీసు అధికారులు గత వైసీపీ ప్రభుత్వంపైన, ఆ ప్రభుత్వ నిర్లక్ష్యంపైన పోలీసు అధికారులు మాట్లాడి ఉండిఉంటే ఇంకా బాగుండేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.