పుష్పయాగం: యాత్రికులకు తిరుమలలో 30న కనువిందు

ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌. పండితుల ఋత్విక్‌వరణం అంటే ఏమి చేశారు?

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-29 18:40 GMT
తిరుమల ఆలయంలో...

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగమ శాస్త్రానికి అనుగుణంగా అనుసరించే ఆచార, వ్యవహారాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రి వేదపండితులు, ఆలయ ప్రధాన అర్చకులు బుధ‌వారం రాత్రి పుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేశారు. ఆలయంలోని శ్రీవారి మూలవిరాట్టు ఎదుట నిలబడిని వేద పండితులు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు.


ఋత్విక్‌వరణం అంటే..

తిరుమల శ్రీవారి సేవలో మమేకం అయ్యే అర్చకులు, వేద పండితులు సమయానుసారంగా స్వామివారికి సేవలు చేయడంలో కాలమాన పట్టిక అమలు చేస్తారు. పుష్పయాగం నిర్వహణు ముందు కూడా అర్చకులు ఓ కర్తవ్య దీక్ష తీసుకుంటారు. ఇది మహా బాధ్యతతో కూడిన వ్యవహారం. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
అంకురార్పణ ఎలా చేశారంటే..

శ్రీవారి ఆలయం నుంచి బుధవారం రాత్రి ఏడు గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించిన తరువాత తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మది గంట‌ల మధ్య ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

అక్టోబర్ 30న పుష్ప‌యాగం

ఫైల్ ఫోటో

శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉద‌యం తొమ్మిది గంటల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం యాగం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలోని వసంత మండపంలో ఉభయ దేవేరులతో పాటు శ్రీమలయప్ప స్వామివారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంగి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. దీనికోసం సువాసనలు వెదజల్లే తొమ్మిది టన్నుల 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహిస్తారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవాన్ని వివరిస్తారు.
ఎలాంటి పువ్వులు వాడతారు..
శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగానికి చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చిస్తారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠిస్తారు.
"పుష్పయాగం సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు తిరుమల గార్డెన్ కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు పుష్పాల ఊరేగింపు" నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. గార్డెన్ నుంచి శ్రీవారి ఆలయం సమీపంలని గొల్లమండపం వరకు పువ్వుల బుట్టలు మోసుకుని రావడానికి యాత్రికులతోపాటు టీటీడీ ఉద్యోగులు కూడా పోటీ పడతారు.
ఆర్జిత సేవల రద్దు
శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నేపథ్యంలో గురవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
Tags:    

Similar News