టీటీడీలో ప్రక్షాళన.. అధికారుల బదిలీ
మాజీ చైర్మన్ భూమన వ్యాఖ్యలే కారణమా?
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-09 06:39 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati devasthanam TTD) పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభమైంది. తిరుమల లో కీలక బాధ్యత నిర్వహించే డిప్యూటీ ఈఓ ( TTD deputy Eo's) లను బదిలీ చేశారు. ఈ చర్య ద్వారా సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీలో ఈ బదిలీల వెనక రాజకీయ కారణాలు ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. తరచూ తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రస్తుత పాలకమండలి సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. వైసిపి పాలనలో నియమితులై, డిప్యూటీ ఈవోలుగా పనిచేస్తున్న కీలక విభాగాల డిప్యూటీ ఈఓలకు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్థానం చలనం కల్పించారు.
మొదట యాత్రికుల సేవలతో..
టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత గత ఏడాది నవంబర్ ఆరో తేదీ టీటీడీ 56వ చైర్మన్గా బి.ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ఈఓ గా నియమితులైన జే. శ్యామలరావు తిరుమలలో చోటుచేసుకున్న వ్యవహారాలపై దృష్టి సారించారు. వీరిద్దరూ కలిసి తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాల నాణ్యత మెరుగుదల, శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత మెరుగుపరచడానికి అవసరమైన ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందే టిటిడి ఇఓ శ్యామలరావు స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే..
ఇన్నేళ్లుగా పాత అధికారులే...
టీటీడీ డిప్యూటీ ఈవో లలో శ్రీవారి ఆలయం, అన్నదానం, ఇతర కీలక విభాగాలలో వైసిపి ప్రభుత్వం లో నియమితులైన అధికారులే ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నారు. యాత్రికులకు సంబంధించి వసతులు, దర్శనం, సేవలు మరింత మెరుగుపరచడానికి మాత్రమే ఇప్పటివరకు టిడిపి కూటమి నియమించిన చైర్మన్ వి.ఆర్ నాయుడు సారథ్యంలోని పాలకమండలి పనిచేసింది. మినహా, టీటీడీ లోని అన్ని విభాగాల్లో ఉన్న కీలక శాఖల అధికారుల జోలికి వెళ్లలేదు. అంటే పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పవచ్చు. టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో నియమితులైన అధికారులే తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో తో పాటు మిగతా విభాగాల్లో కూడా అధికారులు యథాతధంగా కొనసాగుతూ ఉన్నారు.
పాలనలో ప్రక్షాళన..
టీటీడీలో జరుగుతున్న అని వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం, పరిశీలన చేసిన తర్వాత డిప్యూటీ ఈగోలను బదిలీ చేయడం వెనక ప్రధాన కారణమే ఉన్నట్లు భావిస్తున్నారు. అందులో ప్రధానంగా..
టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని నెలల కిందట చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుత టీటీడీ చైర్మన్ పాలకమండలి సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
"టీటీడీలో రెండు వేల మంది మా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ప్రతి విషయం వెంటనే తెలిసిపోతుంది" అని టిటిడి మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాలు పరిశీలిస్తే, టీటీడీపై నెలకు ఒకసారి ఏదో ఒక అంశం పైన రాద్దాంతం జరుగుతూనే ఉంది.
1. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం
2. ఆర్జిత సేవా టికెట్ల జారీ
3. ఎస్ వి గోశాలలో ఆవులు మరణించడం
4. అలిపిరి సమీపంలో శనేశ్వర విగ్రహం.
5. అధికారుల ఇళ్లకు వెళ్లి శ్రాద్ధం కార్యక్రమంలో పర్యవట్టం కట్టడం. వంటివి మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. తరచూ ఏదో ఒక అంశంపై రాద్ధాంతం జరగడం తెలిసిన విషయమే. పాలక మండలికి సంబంధించి తీసుకునే నిర్ణయాల ప్రతులను కూడా ప్రదర్శించి మీడియా ముందు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉండడం కూడా టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ముకుమ్మడి బదిలీలు..
రాజకీయ కారణాలు ఎన్ని ఉన్న పరిపాలన వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీలో డిప్యూటీ ఈవో లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల దశాబ్దాల కాలంగా ఆగిపోయిన పదోన్నతులకు ఆస్కారం ఉంటుందని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. టీటీడీలో తాజాగా బదిలీ అయిన విభాగాలను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈఓ గా పనిచేయడం ఒక వరం. ఈ పోస్టులో
2012లో నియమితులైన లోకనాథంను అక్కడి నుంచి బదిలీ చేసి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి డిప్యూటీ ఈవో గా మొదట నియమించినట్లు సమాచారం. మళ్లీ దీనిని మార్పు చేసి లోకనాథమును తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి నియమించారు.
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా హరేంద్రనాథ్ను తాజాగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
2. తిరుమలలోని కీలక విభాగం అయిన రిసెప్షన్ వన్ ( Reception 1) డిప్యూటీ ఈవోగా ఉన్న భాస్కర్ ను టీటీడీ ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్ ( Human Resources HR )విభాగానికి అధిపతిగా నియమించారు.
3. తిరుమలలో రిసెప్షన్2 డిప్యూటీ ఈవో గా ఉన్న రాజేంద్రకు ఆర్-వన్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు
4. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఇవ్వగా శాంతి
5. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం డిప్యూటీ ఈవోగా వెంకటయ్య నియమితులయ్యారు.
6. తిరుమలలో కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో గా ఉన్న గోవిందరాజన్ ను డోనర్ సెల్ (donor cell) ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ టీటీడీ కార్యనిర్వహణాధికారి (TTD executive officer) అనిల్ కుమార్ సింగల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీలు పదోన్నతుల కోసం వేచి ఉన్న సీనియర్లలో ఆలు చిగురింప చేశాయి. అన్ని విభాగాల్లో ఈ బదిలీలపై చర్చకు తెరతీసింది. అయినా వైసీపీకి సమాచారం లీక్ కాకుండా ఆపగలరా? ఇంకా ఎలా ఉండబోతుందనేది వేచిచూడాల్సిందే.