మొత్తం వీళ్ళిద్దరే చక్కబెడుతున్నారా ?

టార్గెట్ రీచవ్వాలన్నా అందుకు నమ్మకమైన, గట్టి మద్దతుదారులు చాలా అవసరం. అందుకనే ఆ బాధ్యతలను పొంగులేటి, వేంకు రేవంత్ అప్పగించారు.

Update: 2024-07-14 08:16 GMT

కొద్దిరోజులుగా ఒక డెవలప్మెంట్ బాగా ప్రచారమవుతోంది. అదేమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో జాయినవుతుండటం. పలాన ఎంఎల్ఏ కాంగ్రెస్ లో చేరారు, ఆరుగురు ఎంఎల్సీలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోవటాన్ని అందరు చూస్తున్నదే. పలానా సీనియర్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరారని ప్రముఖంగా వస్తోంది. తెరమీద అందరికీ కనబడుతున్నది బీఆర్ఎస్ నుండి వచ్చేసి కాంగ్రెస్ లో చేరుతుండటం మాత్రమే. అయితే చేరికల సందర్భంగా విడుదలవుతున్న చాలా ఫొటోలు, వీడియోల్లో కామన్ పాయింట్ ఒకటుంది.




 ఇలాంటి చేరికలకు తెరవెనుక ఎంత కసరత్తు జరిగితే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు ? బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో ఫిరాయించటానికి కారణాలు ఏమై ఉంటాయి ? ముఖ్య కారకులు ఎవరు ? అన్న విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు చేరటానికి ప్రధాన కారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. పొంగులేటి, వేం ఇద్దరూ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులు, గట్టి మద్దతుదారులని అందరికీ తెలిసిందే. పొంగులేటి ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించారు.




 ఎలాగంటే ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లూ ఇపుడు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. ఎన్నికల్లో పది సీట్లకు తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలిస్తే తర్వాత భద్రాచలం బీఆర్ఎస్ ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు కూడా హస్తం గూటికి వచ్చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెలవటంలో పొంగులేటిదే కీలకపాత్ర. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధుల తరపున పొంగులేటి భారీగానే ఖర్చుపెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. అలాగే ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందనే విషయంలో అధిష్టానం ఎంఎల్ఏలతో అభిప్రాయసేకరణ చేసిన విషయం తెలిసిందే. మెజారిటి ఎంఎల్ఏల అభిప్రాయాలు రేవంత్ కు అనుకూలంగా మలచటంలో కూడా పొంగులేటి పాత్రుందట. కాబట్టి ఏ కోణంలో చూసుకున్నా వ్యక్తిగతంగా, ప్రభుత్వంలో పొంగులేటి ఎంత కీలకమో అర్ధమవుతోంది. అందుకనే బీఆర్ఎస్ ను కుళ్ళబొడిచే కార్యక్రమంలో పొంగులేటికే రేవంత్ బాధ్యతలు అప్పగించినట్లున్నారు.




ఇక వేం నరేందర్ వ్యవహారం చూస్తే వీళ్ళిద్దరు టీడీపీలో ఉన్నపుడే బాగా సన్నిహితులు. 2015లో సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ తరపున ఎంఎల్సీగా పోటీచేసిన వేం గెలుపుకోసమే రేవంత్ నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో మాట్లాడింది. అంటే వీళ్ళిద్దరు ఎంతటి సన్నిహితులో దీంతోనే అర్ధమవుతోంది. రేవంత్ తో పాటు టీడీపీలో నుండి వచ్చి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళల్లో వేం కూడా ఒకరు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేంను రేవంత్ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. రేవంత్ తరపున వ్యవహారాలన్నింటినీ వేం చక్కబెడుతున్నారని పార్టీలో ప్రచారంలో ఉంది. 

 




 ముఖ్యమంత్రి అవగానే రేవంత్ పెట్టుకున్న టార్గెట్ ఏమిటంటే బీఆర్ఎస్ నుండి ఎంతమంది వీలుంటే అంతమంది ఎంఎల్ఏలను లాగేసుకోవాలని. 38 మంది ఎంఎల్ఏల్లో తక్కువలో తక్కువ 27 మందిని లాగేసుకుని అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదాను ఊడబీకించాలన్నది రేవంత్ పట్టుదల. ఎప్పుడైతే బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందో అప్పుడు కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా, క్యాబినెట్ ర్యాంకు రెండూ పోతాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్నది రేవంత్ బలమైన కోరిక. తన కోరిక తీరాలన్నా, టార్గెట్ రీచవ్వాలన్నా అందుకు నమ్మకమైన, గట్టి మద్దతుదారులు చాలా అవసరం. అందుకనే ఆ బాధ్యతలను పొంగులేటి, వేంకు రేవంత్ అప్పగించారు.




ఏ ఎంఎల్ఏ కాంగ్రెస్ లో చేరినా, ఎంఎల్సీలు చేరినా కామన్ పాయింట్ ఏమిటంటే చేరికల సమయంలో పొంగులేటి, వేం ఉండటమే. బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో మంతనాలు జరిపేది, వాళ్ళ డిమాండ్లను రేవంత్ తో చర్చించి తర్వాత వాటిని మళ్ళీ సదరు ఎంఎల్ఏలు లేదా గ్రూపుతో చర్చలు జరుపుతున్నది వీళ్ళిద్దరే అని పార్టీవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయించాలంటే ఊరికే ఎవరూ ఫిరాయించరు కదా. ఫిరాయింపుకు ముందే రకరకాల డిమాండ్లను, ఆర్ధిక హామీలను తీసుకునే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్నారు. ఫిరాయింపుల డిమాండ్లకు పొంగులేటి, వేం హామీగా ఉండి వారందరినీ రేవంత్ తో మాట్లాడించి తర్వాత పార్టీలోకి వచ్చేట్లుగా చేస్తున్నారు. ఇంకా ఎంతమందితో మాట్లాడుతున్నారో ? ఎవరెవరికి ఏమేమి హామీలిస్తున్నారో ? ఎవరెవరు ఎప్పుడెప్పుడు పార్టీలో చేరుతున్నారో వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అందుకనే మూడో కంటికి తెలీకుండానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.

Tags:    

Similar News