గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు. డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74 శాతం మేర పూర్తైనట్టు సీఎంకు తెలియచేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచే ప్రారంభించాలని.. 2027 డిసెంబరుకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.