వైసీపీ హయాంలో ఏ పరిశ్రమ తరిలిపోయిందో చెప్పాలి
రాజధాని పేరుతో లక్షల కోట్లు అప్పలు చేస్తున్నారని, ఇదంతా ఎవరు తీర్చాలని వైసీపీ నేతలు సజ్జల, బుగ్గన ప్రశ్నించారు.;
By : The Federal
Update: 2025-09-12 16:08 GMT
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పరిశ్రమ తరలిపోయిందో చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఆరోపణలు చేయడం కాదని, ఏన్ని పరిశ్రమలో తమ హయాంలో ఏపీని వీడిపోయాయో చెప్పాలని ఆయన నిలదీశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో శుక్రవారం వే టు న్యూస్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుపైన, కూటమి ప్రభుత్వంపైన వారు విమర్శలు గుప్పించారు.
మా మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేకపోతే, అన్ని పరిశ్రమలు ఎందుకు వస్తాయి? ఎంఎస్‌ఎంఈ రంగంలో అంత అభివృద్ధి ఎలా సాధ్యం? మా వల్ల ఒక్కటంటే ఒక్క కంపెనీ అయినా తరలి పోయిందా? ఉంటే చెప్పండి. అసలు లూలూ కంపెనీ అనేది ఒక పరిశ్రమనా? దాని వల్ల ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయా? అది వేరే చోట్ల భూమి అద్దెకు తీసుకుని మాల్స్ నడుపుతోంది.. అని సజ్జల పేర్కొన్నారు. మాపై నాడు విపక్ష టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేసింది. మేము రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని నిందలు వేశారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుమ్మెత్తి పోశారు. కానీ, వాస్తవ అప్పు చాలా తక్కువగా ఉంది. ఆ వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఔనన్నా, కాదన్నా.. రాష్ట్రంలో ఉన్నవి రెండే ప్రధాన పార్టీలు. వైయస్సార్‌సీపీ, తెలుగుదేశం. అయితే చెప్పింది చేయడంలో మాతో వారు సరికారు. చంద్రబాబు ఏనాడూ తన హామీలు నిలబెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కూడా మా కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామన్నారు. కానీ గెల్చాక, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అదే జగన్‌గారు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. చేసేదే చెప్పారు. చెప్పింది చేశారని అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం విశ్వసనీయత లేదు. ఆయన ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. అలాగే ఏనాడూ ఆయన హామీలు నిలబెట్టుకోలేదు. నిజంగా మా హయాంలో పరిశ్రమలు ఏవైనా తరలి పోయాయా? ఉంటే చెప్పండి. ధైర్యంగా వివరించండి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాపై నిందలు వేస్తూ, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇది దారుణం. మళ్లీ చెబుతున్నాను. లూలూ అనేది కంపెనీ కాదు. ఒక సూపర్‌మార్కెట్ మాత్రమే. రాజధాని అనేది పరిపాలన కేంద్రం. అక్కడ ఎవరూ పరిశ్రమలు పెట్టరని సజ్జల పేర్కొన్నారు.
ఏ రాష్ట్రానికి లేనంతగా మనకు దాదాపు 1000 కి.మీ తీర ప్రాంతం ఉంది. అంతకు ముందు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులు ఉంటే.. మా ప్రభుత్వ హయంలో ప్రధాన పోర్టుల పనులన్నీ చేపట్టాం. కేవలం మూడేళ్లలో రామాయపట్నం దాదాపు పూర్తి చేశాం. భావనపాడు (మూలపేట) పోర్టు సగం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు పనులు మొదలుపెట్టాం. అవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చగలిగే స్థాయిలో ఉన్నాయన్నారు. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు కట్టామన్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రాజధాని పేరుతో అప్పులు సరికాదన్నారు. ఇప్పటికీ కూడా రాజధానిపై జగన్ క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ రాజధాని అన్నారు కాబట్టే, ఆరోజు జగన్ ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కోసం నిర్మాణాలు చేస్తే బాగుంటుందని జగన్ చెప్పారు. ఇక్కడే రా«జధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవసరం లేదు. అందుకే విశాఖ, కర్నూలును ప్రస్తావించారని సజ్జల పేర్కొన్నారు.
లక్షల కోట్ల అప్పు చేసి రాజధాని పేరుతో అమరావతిలో ఖర్చు చేయొద్దు. అది ప్రజలపై భారం వేస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తుందని.. అందుకే విజయవాడ–గుంటూరు మధ్య డెవలప్ చేయొచ్చని చెప్పారు. కానీ, ఆ పని చేయకుండా ఐకానిక్ టవర్స్ అంటూ లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ వ్యయం దారుణంగా పెంచారు. గతంలో ఉన్న సంస్థలకే ఆ పనులు అప్పగించారు. ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన సరికాదు. ఆయన రాష్ట్రంపై చాలా అప్పుల భారం వేస్తున్నారు. నిజానికి అమరావతిలో రాజధాని అంటున్నా, అక్కడ ఎవరూ ఉండడం లేరు. ఉద్యోగులంతా విజయవాడ, గుంటూరులోనే ఉంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణ తగదని స్పష్టం చేశారు. పోలీసులు దారుణంగా కేసలు పెట్టి వేధిస్తున్నారు. సీఎం చంద్రబాబు కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. దానికి పోలీసులు వంత పాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీదే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్, పారిశ్రామిక రంగం ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండి పోయింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, అది 5 ఏళ్లలో 40 శాతానికి చేరింది. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ వాటా తగ్గింది. 2019–2021 వరకు చూస్తే, కేంద్రం కూడా చాలా అప్పు చేసింది. అప్పుడు కేంద్ర అప్పు జీడీపీలో దాదాపు 60 శాతానికి చేరింది. కాబట్టి, రాష్ట్రం అప్పులు ఎక్కువ చేసిందని చెప్పడం సరికాదు. ఇంకా 2015–19 వరకు చూస్తే మనకు కేంద్రం నుంచి 3.7 శాతం వాటా రాగా, ఆ తర్వాత 2019–24 మధ్య అది కేవలం 3 శాతమే వచ్చింది. అది కొన్ని వేల కోట్లకు సమానమని బుగ్గన పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం అప్పులు చూస్తే.. స్థూల ఉత్పత్తిలో ఎప్పుడైనా 50 శాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ, అది 2020–21లో ఏకంగా 60.7 శాతానికి చేరింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేశాయి. ఇంకా కేంద్రం నుంచి పన్నులు, ఇతర ఆదాయాల్లో మనకు 2014–19 మధ్య 47 శాతం వాటా రాగా, ఆ తర్వాత 5 ఏళ్లలో 2019–24 మధ్య 46 శాతమే వచ్చిందన్నారు.
ఎప్పుడైనా పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తొలి 10 ఏళ్లు చాలా కీలకం. కానీ మన రాష్ట్రంలో తొలి 5 ఏళ్లు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ తర్వాత 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల అభివద్ధి కోసం పని చేశాం. కానీ, ఆ సమయంలో అప్పు ఎక్కువ పెరిగిందన్న ప్రచారం అవాస్తవం. నాడు మా ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి, చాలా ఖర్చు చేశాం. దాని వల్ల చాలా వేగంగా ఫలితాలు వస్తాయి. ఆ దిశలో మేము పని చేశాము. పిల్లల మీద మేం చేసిన ఖర్చు ఒక పెట్టుబడి లాంటిది. దాని వల్ల భవిష్యత్తు బాగుంటుందన్నారు.
ఈ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాధాన్యం చూస్తే, అప్పు చాలా చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం, చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎప్పుడు ఏం చెప్పినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూనే, లక్షల కోట్ల అప్పుతో నగర నిర్మాణం చేస్తోందని విమర్శించారు.