అక్వా రంగాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయన ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. ఆమెరికా సుంకాలతో ఇబ్బందిపడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. దేశీయంగానూ ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, వాణిజ్య–పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు సీఎం విడివిడిగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాలను పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి, ఇతర దేశాలతో ఆక్వా విషయంలో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని కేంద్ర వాణిజ్య–పరిశ్రమల శాఖ మంత్రికి, దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు, ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోంటున్నాయని సీఎం తన లేఖల్లో పేర్కోన్నారు.
అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో జరిగే రొయ్యల ఎగుమతుల్లో ఏపీ నుంచి 80 శాతం వాటా ఉందని.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వాటా ఏపీ కలిగి ఉందని సీఎం పేర్కొన్నారు. సుమారు రూ. 21,246 కోట్ల విలువైన సముద్ర, మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం మీద ఆధారపడి 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షల మంది ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమెరికా విధించిన సుంకాలతో రొయ్యలు ఎగుమతులపై ఎక్కువగా ప్రభావం పడిందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు రూ. 25 వేల కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సీఎం తన లేఖల్లో పేర్కొన్నారు. 50 శాతం మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దు అయ్యాయయని లేఖలో వివరించారు. దాదాపు 2 వేల కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై రూ. 600 కోట్ల మేర సుంకాల భారం పడిందని తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో జరిపిన చర్చల ఫలితంగా కేజీ ఆక్వా ఫీడ్ ఎమ్మార్పీపై రూ. 9 మేర తగ్గించ గలిగామన్నారు. సబ్సిడీతో ట్రాన్సఫార్మర్లు సరఫరా చేసేందుకు కూడా ఆలోచన కూడా చేస్తున్నామని సీఎం తన లేఖల్లో వివరించారు.
ఆక్వా రుణ వడ్డీలపై మారటోరియం విధించండి
రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్ర సాయం కూడా ఆక్వా రైతులను నిలబెట్టేందుకు అవసరమవుతుందని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎగుమతి దారులకు..ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించాలని కోరారు. వడ్డీ రాయితీ కల్పించడంతోపాటు... ఫ్రొజెన్ రొయ్యలపై ఉన్న 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని సీఎం లేఖల్లో కోరారు. ఈ చర్యలతో పాటు అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, సౌదీ, రష్యా దేశాల్లో ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలని లేఖల్లో ముఖ్యమంత్రి కోరారు. ఎగుమతి దారులకు మధ్యంతర ఆర్థిక సహాయం, ఎగుమతులపై విధించే సుంకాలు, పన్నుల ఉపశమనం పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు సీ–ఫుడ్ సరఫరా చేయడానికి తాము సిద్దంగా ఉన్నట్టు ఎగుమతిదారులు తనకు విజ్ఞప్తి చేశారని సీఎం చంద్రబాబు వివరించారు.
ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు వేయండి
ఈ చర్యలతో పాటు దేశీయంగా ఆక్వా మార్కెట్ పెంచుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించాలని కోరారు. కోల్డ్ స్టోరేజీలు, హైజినిక్ ఫిష్, సీ–ఫుడ్ మార్కెట్ల ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల నుంచి ఆక్వా ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించేలా ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్యయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. అలాగే దేశంలోనూ సీ–ఫుడ్ వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. ఆక్వా ఉత్పత్తుల్లో మంచి ప్రొటీన్ ఉంటుందని.. ఇది మంచి బలవర్దకరమైన ఆహారమనే విషయాన్ని అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీని కోసం ఎన్‌ఎఫ్డీబీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. జాతీయ సగటు ప్రకారం ఏడాదికి తలసరి వినియోగం 20–30 కిలోల చేపలను ఆహారంగా తీసుకోవాలని ప్రస్తుతం 12–13 కిలోలను మాత్రమే వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సీ–ఫుడ్ ను ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్య సమస్యలను తగ్గించడంతోపాటు... ఆక్వా రైతులకు అండగా నిలిచినట్టవుతుందని తెలిపారు. దక్షిణ భారత దేశం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్వా రవాణ కోసం డెడికెటేడ్ రైళ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మత్స్యకారులకు రూ. 1 లక్ష వరకు వన్–టైమ్ టాప్–అప్ రుణాలు ఇవ్వాలని కోరారు. కొత్త మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి ఎఫ్‌ఐడీఎఫ్ ద్వారా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. ఐకార్–సీఐబీఏ, ఐకార్–ఎన్‌బీఎఫ్‌జీఆర్ వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని సీఎం తన లేఖల్లో కేంద్ర మంత్రులను కోరారు.