రుషికొండ ప్యాలెస్ ఖర్చుతో ఎంతో చేయొచ్చు..?

ఈ భవంతులపై భిన్నాభిప్రాయాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి, ఏజెన్సీ రోడ్లకు వెచ్చించాల్సింది. అనాలోచితంగా రూ.500 కోట్లు వృధా చేశారని నిట్టూర్పు.

Update: 2024-11-04 09:44 GMT

వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోగానే రుషికొండ ప్యాలెస్ వివాదాల్లో కూరుకుపోయింది. అంతకుముందు వరకు అంతంతమాత్రంగానే ఉన్న వ్యతిరేకత పార్టీ గద్దె దిగగానే మరింత తీవ్రతరమైంది. అంతేకాదు.. రాజకీయంగానూ పెను దుమారాన్నే రేపుతోంది. విశాఖ సాగరతీరంలోని రుషికొండపై 18 ఎకరాల విస్తీర్ణంలోని 9.88 ఎకరాల్లో సువిశాలమైన ఏడు భవంతులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్మించిన సంగతి తెలిసిందే.

 

విశాఖను పరిపాలనా రాజధానిని చేసి అక్కడి నుంచే పాలన సాగించాలన్న లక్ష్యంతో ఈ రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. రూ.500 కోట్లు వెచ్చించి రాజ ప్రాసాదాలను తలదన్నేలా చేపట్టిన ఈ కట్టడాలకు విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, గంగ అనే ఏడు పేర్లు పెట్టారు. ఇవి రాచరికపు కాలానికి అనుగుణంగానే ఉండడం విశేషం!

ఇప్పటికే వీటన్నిటినీ చూసిన వారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి వవన్ కల్యాణ్, మంత్రులు, ఇతర పార్టీల నాయకులు ఈ రుషికొండ ప్యాలెస్ను చూసి జగన్ తనను తాను రాజుగా ఊహించుకుని సౌధాలను కట్టించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

 

అవును.. అవి అలా ఉన్నాయి మరి..

కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా రుషికొండ ప్యాలెస్, అందులోని వస్తువులు, సామగ్రి, ఫర్నిచర్, సదుపాయాలను చూసి అవాక్కవుతున్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి ముందు పర్యాటక శాఖ రిసార్టుల్లో 58 గదులుండేవి. ఇప్పుడు కేవలం 12 గదులే (విశాలమైన) ఉన్నాయి. ఇందులో ప్రెసిడెన్షియల్ స్యూట్, స్యూట్ రూమ్లు, బాంకెట్ హాళ్లు, డీలక్స్ స్యూట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, రిక్రియేషనల్ లాంజి, బిజినెస్ సెంటర్, ప్రైవేటు స్యూటు రూమ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.

మొత్తం ఏడు బ్లాకుల్లోనూ చూడడానికి రెండు కళ్లూ చాలవన్నట్టు కట్టడాలు, హంగులూ, ఆర్భాటాలు దర్శనమిస్తున్నాయి. బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు, సీలింగ్ ఫ్యాన్ నుంచి షాండ్లియర్ల వరకు వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఇటాలియన్ మార్బుల్ గోడలు, గచ్చులు, సువిశాల పడక గదులు, కారిడార్లు, వందలాది మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాళ్లు, పువ్వులు, ఆకుల ను పోలిన ఐదు రెక్కల ఫ్యాన్లు, ఎన్నెన్నో కళాఖండాలు, ఫ్రిడ్జ్లు, ఫైళ్లు భద్రపరచేందుకు లాకర్లు, మసాజ్ టేబుల్, ఇంపోర్టెడ్ సోఫాలు, మంచాలు, మతి పోగొట్టే పరదాలు, గృహాలంకరణ వస్తువులు, ఇలా ఒకటేమిటి? అన్నీ వినూత్నంగా, విభిన్నంగా ఉన్నాయి. ధగధగలాడుతూ మెరిసిపోతున్నాయి. ఇలా ప్రతి వస్తువూ ఎంతో ఖరీదైనదే. బాత్ టబ్ రూ.36 లక్షలు, బాత్రూమ్ కమోడ్లు రూ.6 నుంచి 13.5 లక్షలు, ఒక్కో ఫ్యానుకు రూ.3 లక్షలు, షాండ్లియరుకు రూ.2 నుంచి 15 లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది.

 

ఫ్యాన్లు, షాండ్లియర్లు పదుల సంఖ్యలో అమర్చారు. ఇంకా సోఫాలు, కుర్చీలు, సెంట్రలైజ్డ్ ఏసీలు, ఇతర ఫర్నిచరుకు రూ.14 కోట్లు, చిత్రాలు, కళాఖండాలకు రూ.19.5 కోట్లు, ఇంటీరియర్ డిజైనింగ్కు రూ.33 కోట్లు, దారపోసినట్టు సమాచారం. ఇవికాకుండా ల్యాండ్ స్కేపింగ్, హోం థీయేటర్ స్క్రీన్, అడ్వాన్స్డ్ సౌండ్సిస్టం ఇంకా మరెన్నో సదుపాయాలను రూ.కోట్లు వెచ్చించి సమకూర్చారు.


వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ రుషికొండ ప్యాలెస్పై అడపాదడపా విమర్శలు వెల్లువెత్తేవి. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఆ ప్యాలెస్ లోని అద్భుతాలు వెలుగు చూశాయి. దీంతో అసలే అప్పులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు విలాసవంతమైన భవంతులకు రూ.500 కోట్లు వెచ్చించడం అవసరమా? అన్న చర్చ ఊపందుకుంది.

 

ఈ సొమ్ముతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని, పెండింగ్ ప్రాజెక్టులకు వినియోగించవచ్చన్న వాదనలు మొదలయ్యాయి. 'ఉత్తరాంధ్రలో నిధుల్లేక కునారిల్లుతున్న బాబూ జగ్జీవన్రామ్ సుజల స్రవంతికి ఈ సొమ్మును వెచ్చిస్తే అది కొంతైనా ముందుకు కదిలేది. ఇంకా భావనపాడు పోర్టుకు ఖర్చు చేసినా ఫలితం ఉండేది. లేదా ఏజెన్సీలో రోడ్లు లేక డోలీ మోతలతో సతమతమవుతున్న గిరిజనులకు రోడ్లు వేసినా ఎంతో మేలు జరిగేది.

కానీ అలాకాకుండా రూ.500 కోట్లు రుషికొండ ప్యాలెస్కు ఖర్చు చేయడం సరికాదు. సీఎం చంద్రబాబు ఈ ప్యాలెస్ ను ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తే ఈయనకూ జగన్ గతే పడుతుంది' అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు కేఎస్ చలం ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

 

ప్యాలెస్ నిర్మాణం.. అనాలోచిత నిర్ణయం..

'రుషికొండలో రూ.500 కోట్లు వెచ్చించి రాజప్రాసాదాన్ని తలదన్నేలా భవంతుల నిర్మాణం అనాలోచితం. ఈ సొమ్మును అభివృద్ధి పనులకు వెచ్చిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. ఈ నిధులతో ఏజెన్సీలో రోడ్లకు మరమ్మతులు చేపడితే అక్కడ గిరిజనులు దశాబ్దాల కష్టాలు తీరేవి. పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించినా రైతులకు మేలు జరిగేది.

 

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి. కానీ అలా కాకుండా ప్యాలెస్ నీళ్లలా ఖర్చు చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఈ ప్యాలెస్ను ఎలా వినియోగించాలో స్పష్టత లేక పోవడం ఆశ్చర్యంగా ఉంది.' అని సీపీఐ (ఎం) కార్యదర్శివర్గ సభ్యుడు కొత్తపల్లి లోకనాథం 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 

Tags:    

Similar News