'సజ్జల' స్థానంలోకి 'పెద్దిరెడ్డి'..! జగన్ ముందు ఫ్లూట్ పనిచేస్తుందా?

నిర్ణయాల్లో వైఎస్ జగన్ మోనార్క్. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు సజ్జలదే కీలక పాత్ర. ఇప్పుడు ఆ స్థానంలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరారు. మోనార్క్ నేత ముందు ఈయన సలహాలు పనిచేస్తాయా?

Update: 2024-09-16 07:59 GMT

అధికారం కోల్పోయిన మూడు నెలల తరువాత పార్టీ ప్రక్షాళనకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానే కాకుండా, సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా నుంచి ఆయన కుమారుడు భార్గవరెడ్డిని తప్పించారు. వారి స్థానంలో సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా సభ్యుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇదిలావుంటే..

పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోనార్క్ మార్కు నిర్ణయాలు తీసుకుంటారు.
"ఎవరి మాట వినరు. తాను అనుకున్నదే చేస్తారు" అనేది వైఎస్. జగన్ పై ఉన్న ఆరోపణలు. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని వినియోగించుకుంటారా? ఆయన మాటలు, సలహాలను వైఎస్. జగన్ పాటిస్తారా? అనేది సమాధానం లభించని మిలియన్ డాలర్ల ప్రశ్న.
"ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు" ఓ సినిమాలో సినీహీరో బాలకృష్ణ డైలాగ్ ఇది. ఇదే తరహా పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఉండబోతుందా? సలహాలు పాటిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. ఎందుకంటే...
అధికారం కోల్పోయిన తరువాత రాయలసీమ ప్రాంతానికి చెందిన అనేక మంది సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ కోవలో మొదట కర్నూలు జిల్లా పాణ్యం సీనియర్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వరం వినిపించిన మొదటి వ్యక్తి. "పార్టీ పరిస్థితి బాగా లేదు. ల్యాండ్ టైటిల్ డీడ్ దెబ్బతీస్తుంది" అని పార్టీ అధ్యక్షుడికి చెప్పేందుకు విఫలయత్నం అని గుర్తు చేశారు. "ఎన్నికల ముందు వైఎస్. జగన్ ను కలవాలనుకుంటే, అధికారులు అడ్డుపడ్డారు. అక్కడి కోటరీ దగ్గరికి కూడా రానివ్వలేదు. అందుకు ఫలితం అనుభవించాం" అని కూడా ఫలితాలు వెలువడిన వారంలోపే కాటసాని తన వేదనను వెళ్లగక్కారు.

రెండో అంశం సాధారణంగా ఏ పార్టీకి అయినా సరే విధివిధానాలు ఉంటాయి. కార్యవర్గం ఉంటుంది. కనీసం మూడు నెలలకు ఒకసారైనా పార్టీ యంత్రాంగం సమావేశమవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఆ మేరకు తీసుకునే నిర్ణయాల ద్వారా కార్యాచరణ అమలు చేస్తుంది. సిద్ధాంతపరంగా వ్యవహరించే జాతీయ పార్టీలు కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్ తరువాత వారి నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీలో ఆ సంస్కృతి కనిపిస్తుంది. కానీ, వైసీపీలో ఆ పరిస్థితి మచ్చుకు కూడా ఉండదనడంలో సందేహం లేదు. కార్యవర్గం ఉందా? లేదా? అనేది వారికే తెలియాలి. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్. జగన్ నిర్ణయాలు, ఆలోచనలే కీలకంగా అమలయ్యే ఈ పార్టీలో సీనియర్ రాజకీయవేత్త, మాస్ ఫాలోయింగ్ కలిగిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది సందేహమే.

పులివెందుల వాసి అని...
వైసీపీ ఆవిర్భావం తరువాత వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్. జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన సీనియరిటీ, అనుభవాన్ని వినియోగించుకోవాలనే ప్రధాన కారణంగాతో పాటు పులివెందుల ప్రాంతానికి చెందిన సజ్జలను సొంతమనిషి కింది పరిగణలోకి తీసుకుని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు.
2014 ఎన్నికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అంతర్గతంగా ఆయన పార్టీ నేతలను సమన్వయం చేశారు, అనడం కంటే కంట్రోల్ లో ఉంచారు. అన్ని విషయాల్లో ఆయన పాత్రే కీలకంగా కనిపించింది.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. సీఎం హోదాలో ఉన్న వైఎస్. జగన్ స్థానంలో సజ్జల సకల శాఖల మంత్రిగా వ్యవహరించారనే నిరసనలు కూడా ఎదుర్కొన్నారు.
"మా సమస్యలపై సీఎంతో మాట్లాడుతాం. మధ్యలో సజ్జలతో ఏమిటి పని?" అని సమ్మె నోటీసు ఇచ్చిన సమయంలో ఎన్జీవో ప్రతినిధులు బాహాటంగా ప్రశ్నించిన విషయం ప్రస్తావనార్హం. "కొందరు సలహాదారులే సీఎం వైఎస్. జగన్ ను తప్పుదోవపట్టిస్తున్నారు" అని ఉద్యోగ సంఘం నేతల్లో ఒకరు వేదికపైనే సూటిగా వ్యాఖ్యానించారు. అంటే.. ప్రభుత్వ వ్యవహారాల్లో అంతలా చొచ్చుకుపోయిన సజ్జల పార్టీలో ఇంటా, బయట కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కూడా నిధులు మింగేయడంతో పాటు పార్టీని దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల కుటుంబీకులపై మీమ్స్, ట్రోలింగ్ వల్ల నష్టం జరిగిందనే విషయం ఆలస్యంగా గ్రహించినట్లు పార్టీవర్గాల సమాచారం.
"మాకు రావాల్సిన సొమ్ము భార్గవరెడ్డి స్వాహా చేశారు. యూ ట్యూబర్లు కూడా ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు" అని రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ సోషల్ మీడియాలో కీలకమైన వ్యక్తి "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధితో వ్యాఖ్యానించారు. "భార్గవరెడ్డి దొరికితే తోలు తీస్తారు సార్" అని కూడా అన్నారంటే, వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ముంబై సినీనటి కాదంబరీ జత్వానీ కేసులో సజ్జలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన పూచనలతోనే వ్యహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణాటాటా, విశాల్ గున్ని సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఇందులో అన్ని వేళ్లు సజ్జల వైపే చూపుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందే...

2024 ఎన్నికల్లో నగదు బదిలీ పథకాలు గట్టెక్కిస్తాయని వైసీపీ మితిమీరిన విశ్వాసం ప్రకటించింది. అధికారంలో ఉంటూనే 175 స్థానాల్లో ఒంటిరిగా పోటీ చేసిన వైసీపీ ఊహించని ఫలితాలతో 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. అప్పటికి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఆత్మశోధన చేసుకోవడం కాకుండా, నగదు లబ్ధిపొందిన అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత మూడు నెలల పాటు వైసీపీ నేతలు ఎక్కడివారు అక్కడ గప్ చుప్ అయ్యారు. పార్టీ క్యాడర్ ఆత్మరక్షణలో పడింది. పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు, మాజీలు కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో...
వైసీపీ అలర్ట్

ఆలస్యంగా అయినా, వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. సకలశాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిని దాదాపు పక్కకు తప్పించినట్లే వాతావరణం కనిపిస్తుంది. ఆ స్థానంలో చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ వ్యవహరాల కమిటీ సలహా సభ్యుడి హోదాను కట్టబెట్టారు. సజ్జల స్థానాన్ని ఈ విధంగా భర్తీ చేశారనేది వైసీపీలో వినిపిస్తున్న టాక్.
మాస్ ఇమేజ్ పనిచేస్తుందా?

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన పెద్దిరెడ్డి తొమ్మదిసార్తు పోటీ చేసి, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినప్పటికీ పెద్దిరెడ్డి ఆయన కొడుకు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా జిల్లాలో మదనపల్లె, పలమనేరు, పుంగనూరు అసెంబ్లీ స్థానాల్లో స్థానిక సంస్థలే కాకుండా, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వడం నైజంగా మార్చుకున్నారు. పూతలపట్టు, సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, తంబళ్లపల్లె, కుప్పం, చిత్తూరు, జీడీ.నెల్లూరు అనేకాకుండా, జిల్లా మొత్తం మీద మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. "ఏదన్నా ఊరికి చెప్పకుండా వస్తేనే వందల మంది ఉంటారు. ముందస్తు కార్యక్రమం అయితే ఆ సంఖ్య ఊహించడం కష్టం" అంతలా అభిమానం సంపాదించుకున్న పెద్దిరెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ప్రస్తుతం వైసీపీలో ఉన్నా, మొత్తానికి ఆయనది పెద్దన్న పాత్రే.

2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో తిరుపతి, నగరి, చంద్రగిరి మినహా మిగిలిన తొమ్మది స్థానాల్లో తాను ఎంపిక చేసిన వారికే టికెట్లు సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన తీరు అలాగే ఉండేది. వారిని గెలిపించుకునే బాధ్యతలు తీసుకుని, వర్గాలను సమీకరించడంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. టీడీపీ అధికారంలో ఉన్నా 1989లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లెకు చెందిన బీసీ మహిళ రెడ్డెమ్మను జెడ్పీ చైర్ పర్సన్ ను చేశారు. ప్రస్తుతం అదేసీటు వి.కోట బీసీ నేత శ్రీనివాసులు (శ్రీను)ను కూర్చుండబెట్టారు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పడు కూడా పుంగనూరుకు చెందిన తన అంతరింగికుడు, న్యాయవాది ఎన్. రెడ్డెప్పకు మాత్రమే లిడ్ క్యాప్ చైర్మన్ పదవని తీసుకున్నారు.
2019 ఎన్నికల్లో రెడ్డెప్పను చిత్తూరు ఎంపీగా గెలిపించుకోవడంలో పెద్దిరెడ్డిదే కీలకపాత్ర. ఈ తరహాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ఫ్రాంచైజీగా తీసుకుని, తన పట్టునిలుపుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానథరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా విజయం సాధించారు. ఇక్కడ బాధ్యతలు ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి రాయలసీమ జిల్లాల్లో పార్టీని నడిపించడంలో కీలకంగా వ్యహరించారు. అయితే, చిత్తూరు జిల్లాలో పోటీ చేసిన ఆయన, కుటుంబీకులు మినహా అందరూ ఓటమి చెందిన విషయం తెలిసిందే.
అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కాస్త ఆలస్యంగా అయినా స్పందించారు. పదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి పూర్తిగా పక్కకు ఉంచినట్లే పరిస్థితి చెప్పకనే చెబుతున్నది. ఆ స్థానాన్ని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భర్తీ చేశారు. ఎన్నికల వేళ టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్- 6 వైఫ్యల్యాలపై గంపెడంతో ఆశతో ఉన్న వైఎస్. జగన్.. గతంలో సజ్జల మాదిరే, పార్టీ వ్యవహారాల్లో కూడా పెద్దిరెడ్డి నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించేందుకు ఉదారంగా వ్యవహరిస్తారా? వైఎస్. జగన్ అంతరంగం ఇందుకు అంగీకరిస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News