2019లో ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పింది ఆయనే
కర్ణాటక–ఏపీ మధ్య సాంస్కృతిక బంధాలు బలమైనవి అని పవన్ కల్యాణ్ అన్నారు.
By : The Federal
Update: 2025-10-06 10:00 GMT
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాను ఓడిపోయి ఉన్నప్పుడు మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తన భుజం తట్టి ధైర్యం నింపారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. భాష, ప్రాంతాలు వేరుగా ఉన్నప్పటికీ, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణిలో సోమవారం (అక్టోబర్ 6, 2025) సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ్ 80వ జన్మదిన అమృతమహోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలార్, చిక్కబళ్లాపుర్ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి తమ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
’రూల్ ఆఫ్ లా’ స్థాపనలో గోపాల గౌడ దారి చూపాలి
జస్టిస్ గోపాల గౌడ వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేసుకున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన ఎన్నో కీలక తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. భూసేకరణ చట్టంతో ఇబ్బందులు పడేవారి పక్షాన గోపాలగౌడ నిలిచారు. ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినా ఆయన అడ్డుకున్నారు. రూల్ ఆఫ్ లా స్థాపనలో నేటి తరానికి జస్టిస్ గోపాల గౌడ దారి చూపాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కల్యాణ్ కోరారు.
జనసేన పార్టీ చేపట్టిన పోరాటాల్లో జస్టిస్ గోపాల గౌడ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పవన్ కల్యాణ్ తెలిపారు. 2019లో నేను ఓడిపోయిన సమయంలో ఆయన వెన్నుతట్టి ధైర్యం చెప్పారు.. ఆయన ఇచ్చిన సలహాలు, సహకారం ఎప్పటికీ మరచిపోలేను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ఉదాహరణగా చెప్పుతూ, ఏపీలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు ఇచ్చి çకర్ణాటక ప్రభుత్వం సహకరించిందని వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో తాము సానుకూలంగా ఉన్నాము అని పవన్ కల్యాణ్ తెలిపారు.
జస్టిస్ గోపాల గౌడ ఏమన్నారంటే..
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ మాట్లాడుతూ, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం ఆలోచిస్తారని, అలా ఆలోచిస్తూనే నేడు పని చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ ధృక్పథం తను ఇష్టమని అని ప్రశంసించారు. కర్ణాటకలోని మూడు జిల్లాల్లో (కోలార్, చిక్కబళ్లాపుర్, బెంగళూరు రూరల్) నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పవన్ కల్యాణ్ ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను అంటూ గోపాల గౌడ సూచించారు.