సత్రంపాలెం సంఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్
కుట్రలు చేసే వారిని ఉపేక్షించవద్దని వార్నింగ్;
By : The Federal
Update: 2025-09-13 13:59 GMT
మచిలీపట్నం పరిథిలోని సత్రంపాలెం సంఘటనపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కుట్రలు, కుతంత్రాలు, కులవైషమ్యాలు సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జనసేన కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశకావేశాలకు లోను కావొద్దని హితవు పలుకుతూనే ప్రత్యర్థులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
అసలింతకీ సత్రంపాలెంలో ఏం జరిగిందీ?
సత్రంపాలెం గ్రామానికి చెందిన గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ఒకరు ఇటీవల ఓ వీడియో చేశారు. ఆయన వైసీపీ అభిమాని కావడంతో పవన్ కల్యాణ్ కి వ్యతిరేకంగా అసభ్యపద జాలంతో ఓ వీడియోను తయారు చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పై అభ్యంతరక వ్యాఖ్యలు చేశాడనీ ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతన్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. గిరిధర్ ఇంటి ముందు పెద్దఎత్తున నిరసనలు మిన్నంటాయి. దీంతో గిరిధర్ ఇంటి నుంచి బయటకు వచ్చి మోకాళ్ల మీద కూర్చుని మన్నించమని వేడుకున్నాడు.
ఇంతలో కృష్ణా జిల్లా పోలీసులు రంగప్రవేశం చేసి గిరిధర్‌ను అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ, జనసేన పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. “సామాజిక విభేదాలు సృష్టించే కుట్రలను సహించబోమని” హెచ్చరించారు.
'ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ముసుగులో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావారణానికి తావీయవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి' అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సమస్యను జటిలం చేయొద్దు..
మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించారు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్లాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు అని పేర్కొన్నారు.
అంతర్గత విచారణకు ఆదేశం
కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని చట్టం ముందు నిలపాలి. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చాను. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచించా. కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదాం’’ అని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు.