‘రైతులకు భరోసా కల్పించాలి’.. అధికారులకు పవన్ సూచన

ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేయాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-09-10 15:02 GMT

ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేయాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని చెప్పారు. ఏలేరు రిజర్వాయర్‌కు పడ్డ గండిని పూడ్చడానికి ఉన్న మార్గాలను కూడా పరిశీలించాలని, అవకాశం లభించిన వెంటనే యుద్ధప్రాతిపదిక గండిని పూడ్చేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వరద ముంపుపై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పవన్ కల్యాణ్ ఈ సూచనలు చేశారు. అదే విధంగా పంట నష్టపోయే రైతులను భరోసా కల్పించాలని, వరద బాధితులకు అందించే వైద్య సేవలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వరద వల్ల ప్రభావితమైన 152 గ్రామాల్లో సహాయక చర్యలు అందాలని, చిట్టచివరి వ్యక్తి వరకు వాటిని తీసుకెళ్లాలని చెప్పారు. దెబ్బ తిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని, ప్రాణ నష్టానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

వివరాలు సేకరించాం

‘‘గొల్లప్రోలు ముంపు ప్రాంతాలు, వరదలో చిక్కుకున్న రాజుపాలెం, కోలంక, సోమవరం, ఎస్.తిమ్మాపురం, వీరవరం, కృష్ణవరం, రామకృష్ణాపురం గ్రామాల్లోని పరిస్థితిపై వివరాలు సేకరించడం జరిగింది. మాధవపురం, నవఖండ్రవాడల్లోని ప్రజలను అప్రమత్తం చేయండి. సహాయక కేంద్రాలకు తీసుకువెళ్ళండి. పంచాయతీరాజ్, R&B శాఖల పరిధిలో దెబ్బ తిన్న రహదారులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. వైద్య ఆరోగ్య సేవల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడంతోపాటు, తగినన్ని ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. పంటలు మునిగిన రైతులకు అధికారులు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పాలని, ముంపు తగ్గాక నష్టం వివరాల నమోదును వేగంగా చేయాలి. పశు సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా చూడండి’’ అని ఆదేశాలు జారీ చేశారు.

పూర్తి సన్నద్ధతతో అధికార యంత్రాంగం

‘‘ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక అంచనా మేరకు 5485 హెక్టార్లలో వరి, 90.4 హెక్టార్లలో పత్తి పంటలు నీట మునిగాయి. 2 వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైన ఆహారం, తాగునీరు, మందులు అందించే ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి నుంచి ప్రతి గంటకు ఒకసారి వరద ఉధృతిపై సమాచారం తీసుకొంటూ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది’’ అని తెలిపారు. అయితే ఏలేరు వరదలపై హోం మంత్రి అనిత

బాధితులను ఆదుకుంటాం: అనిత

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అడుగడుగా అండగా నిలుస్తుందని అన్నారు. వరదలు తగ్గి ప్రతి ఒక్కరూ తమ నివాసంలోకి వెళ్లే వరకు ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని, అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను కూడా తక్షణమే ప్రారంబించాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా వరదల కారణంగా విషజ్వరాల ప్రభావం అధికంగా ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హోంమంత్రి.

వ్యూహం సిద్ధం చేయాలి: సీఎం

‘‘ఉత్తరాంధ్ర తుఫాన్లు అధికంగా సంభవించే ప్రాంతం. అక్కడ తుఫాన్లను ఎదుర్కొనెలా వ్యూహాలను రూపొందించాలి. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలకు ముందుగానే అప్రమత్తం చేయాలి. ప్రాణ నష్టాన్ని సున్నాగానే ఉంచేలా ప్రయత్నించాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి నిత్యావసరాలను సమకూర్చాలి’’ అని అధికారులకు చెప్పారు చంద్రబాబు. కాగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అవన్నీ సజావుగా సాగుతున్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు.. సీఎం చంద్రబాబుకు వివరించారు.

Tags:    

Similar News