మరోసారి విరాళం ప్రకటించిన పవన్.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్..

ఏపీ వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. తొలుత కోటి రూపాయల విరాళం ఇచ్చినా పవన్ కల్యాణ్.. ఈరోజు 400 పంచాయతీలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.

Update: 2024-09-04 12:15 GMT

ఏపీ వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. తొలుత కోటి రూపాయల విరాళం ఇచ్చినా పవన్ కల్యాణ్.. ఈరోజు 400 పంచాయతీలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. బాధితులను ఆదుకోవడం అంటే ఇంట్లో కూర్చుని మాటలు చెప్పడం కాదంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చురకలంటించారు. రాష్ట్రంలో ముంపుకు గురైన ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం అందిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ ప్రకారం మొత్తం 400 పంచాయతీలకు గానూ రూ.4 కోట్లు విరాళాన్ని వెల్లడించారు. ఈ విరాళ నగదు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. దీంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ. కోటి విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో.. రాష్ట్రంలోని వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన తన విరాళాలను ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.




 

వరద బాధితులకు ఉద్యోగుల సాయం

రాష్ట్రంలోని వరద బాధితులకు ఆదుకోవడానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు కూడా ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి తమ ఒకరోజు జీతాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మొత్తం శాఖలోని 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒకరోజు జీతం రూ.14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.75 లక్షలు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఒక్క రోజు జీతం రూ.10 లక్షలను సీఎం సహాయనిధికి అందించనున్నట్లు వారు పవన్ కల్యాణ్ అందించిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరినీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు.

ఆ గ్రామాలను అప్రమత్తం చేయండి: పవన్

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని పవన్ కల్యాణ్.. అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న గ్రామాలను ముందుగానే హెచ్చరించాలని కాకినాడ కలెక్టర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. ప్రజలకు ఆహారం, తాగునీరు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా చెప్పారు.

అందుకే బయటకు రాలేదు

ఇంతటి స్థాయిలో వరదలు వచ్చినా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదని, వరదల దెబ్బకి హైదరాబాద్ పారిపోయారా అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని చెప్పారు. ‘‘మనం పర్యటించాం అంటే దాని కారణంగా వరద బాధితులకు ఏ విధంగా అయినా లాభం ఉండాలి. కానీ నేను బయటకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఉంటే.. అది వరద బాధితులకు అందించే సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రజలకు అందాల్సిన సహాయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే నేను పర్యటనకు రాలేదు. కానీ కొందరు అదేం పట్టించుకోకుండా కొందరు ఇళ్లలో కూర్చుని విమర్శలు చేస్తుంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు పవన్.

Tags:    

Similar News