పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు ఎందుకు వేశారంటే..
పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్సన్ వేటు పడింది. ఆ ఇద్దర్నీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
By : Admin
Update: 2024-05-16 15:52 GMT
ఏపీలో ఎన్నికలకు సంబంధించిన హింస కొనసాగుతూనే ఉంది. ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఎన్నికల హింస కొనసాగుతుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్సన్ వేటు పడింది. ఆ ఇద్దర్నీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగింది. దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల సంఘం భావించింది. సీఎస్, డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమయ్యారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చలు జరిపింది. అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగిందంటే...
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీ వెళ్లారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సంజాయిషీ కోరారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ కూడా ఢిల్లీ వెళ్లారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలలో హింస చెలరేగడంపై ఈసీ వివరణ కోరింది. పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించినట్టు సమాచారం. ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకున్న అనంతరం ఇద్దరు పోలీసు అధికారులపై కొరఢా ఝుళిపించింది. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసినట్టు సమాచారం.