నామినేషన్‌ దాఖలు చేసిన పాకా

నేడు నామినేషన్‌కు ఆఖరి రోజు. నిన్న అభ్యర్థిగా పాకా సత్యనారాయణను ప్రకటించారు.;

Update: 2025-04-29 09:36 GMT

రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్‌ అధికారి వనితారాణికి నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. నామినేషన్‌ దాఖలు సమయంలో పాకా సత్యనారయణతో పాటు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇది వరకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం నామినేషన్‌ చేసుకునేందుకు ఆఖరి రోజు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ రాజ్యసభ సీటును ఎవరికి కేటాయిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమిలో ఎవరికి కేటాయిస్తారనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. వీటన్నింటికి తెరదించుతూ బీజేపీకే ఆ సీటును కేటాయించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన పాకా వెంకటసత్యనారాయణను అభ్యర్థిగా నామినేషన్‌కు ఒక్క రోజు ముందు బీజేపీ ప్రకటించింది. దీంతో ఈ రోజు పాకా సత్యనారాయణ నామినేషన్‌ను దాఖలు చేశారు.
Tags:    

Similar News